వీఆర్వోల వేదన

ABN , First Publish Date - 2022-12-15T00:39:33+05:30 IST

రెవెన్యూ శాఖలో ఒత్తిడితో సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అల్లాడిపోతున్నారు.

వీఆర్వోల వేదన
నరసాపురంలో ధర్నా చేస్తున్న వీఅర్వోలు (ఫైల్‌)

ఇతర శాఖల విధులు వారిపైనే..

సొంత జేబుల నుంచి పెట్టుబడి

బిల్లులు మంజూరు చేయని ప్రభుత్వం

మానసిక ఒత్తిడితో కుటుంబాలకు దూరం

(భీమవరం–ఆంధ్రజ్యోతి):

రెవెన్యూ శాఖలో ఒత్తిడితో సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఎక్కడ చిన్న తప్పిదం జరిగినా మెమోలు జారీ అవుతున్నాయి. షోకాజు నోటీసులి స్తున్నారు. ఇటువంటి విధులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వీఆర్వోలకు ఇప్పుడు వంద రోజుల్లో రీ సర్వేను పూర్తి చేయాలని లక్ష్యాలను నిర్దేశించారు. అందుకు సంబంధించిన వ్యయమంతా వారే పెట్టుకునేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇవన్నీ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. విధుల్లో సమయపాలన లేకుండా పోతోంది. రాత్రి, పగలు విధుల్లో ఉంటూ కుటుంబ జీవితానికి దూరమవుతున్నామని ఆందోళన చెందుతున్నారు.

గ్రామస్థాయిలో విధులు నిర్వహించే వీఆర్వోలకు ఇటీవల పనిభారం అధికమైంది. ఎప్పుడు ఏ బాధ్యత మీద పడుతుందోనన్న ఆందోళన వెంటాడుతోంది. పనిభారం తగ్గించాలంటూ చివరకు వీఆర్వోలు నిరసనకు దిగే దుస్థితి ఏర్పడింది. విధులతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. మండల స్థాయి నుంచి, జిల్లా అధికారుల వరకు వినతి పత్రాలను సమర్పిస్తూనే ఉన్నారు. రాష్ట్రస్థాయిలోనూ సమస్యలు చెప్పుకున్నా ఫలితం దక్కడం లేదు. ఫలితంగా రెండు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు నిరసన తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలతో తమ మనోభీష్టాన్ని వెల్లడించారు. తహసీల్దార్‌లకు వినతి పత్రాలు సమర్పించారు. అయినా ఉన్నతాధికారుల్లో చలనం లేదు. ప్రభుత్వం ఆదేశించే విధులను గంటల వ్యవధిలోనే పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. సచివాలయాలు ఏర్పాటైనా గ్రామ స్థాయిలో ఉండే వీఆర్వోలకు తిప్పలు తప్పడం లేదు. ప్రధానంగా వెబ్‌ల్యాండ్‌ సమస్యలు పరిష్కరించాల్సి వస్తోంది. దానికోసం క్షేత్ర స్థాయిలో పరిశీలన నిర్వహించాలి. పట్టాదార్‌ పాస్‌ పుస్తకం జారీ చేయాలంటే గతంలో నెలన్నర రోజుల వ్యవధి ఉండేది. ఇప్పుడది 21 రోజులకు కుదించారు. అప్పటిలోగా పట్టాదార్‌ పుస్తకం మంజూరు చేయకపోతే వీఆర్వోలనే బాధ్యులను చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో భూము లను పరిశీలించి క్లియరెన్స్‌ ఇస్తేనే పట్టాదార్‌ పుస్తకం మంజూరవుతోంది.

రీసర్వే ఉచ్చులో వీఆర్వోలు

ప్రభుత్వం జగనన్న భూరక్ష పథకంలో గ్రామాల్లో రీ సర్వే నిర్వహిస్తోంది. అందుకోసం ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని నియమిస్తున్నారు. వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించే బాధ్యత వీఆర్వోలపై పడుతోంది. మరోవైపు రీ సర్వేకు అయ్యే వ్యయాన్ని వారే భరిస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రాథమికంగా నిర్వహిం చిన సర్వేకు గరిష్ఠంగా రూ.50 వేల వరకు సొంత సొమ్ములు వెచ్చించారు. పూర్తిస్థాయిలో సర్వే నిర్వ హిస్తే మరింత ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుం ది. రీ సర్వే నిర్ణీత వ్యవధిలోనే పూర్తి చేయాలన్న ఒత్తిడి అధికమవుతోంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు పైసా బిల్లు మంజూరు చేయలేదు. అంతా రెవెన్యూ ఉద్యోగులే భరిస్తున్నారు. రీసర్వేలో భాగంగా సర్వేయర్‌లతో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించాల్సి వస్తోంది. ఒకవైపు పని ఒత్తిడి ఎదురవుతుంటే మరో వైపు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.

ధాన్యం కొనుగోలు బాధ్యతంతా వీరిదే..

ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ఎన్నడూ లేని విధంగా వీఆర్వోలను కస్టోడియన్‌లుగా నియమించింది. రైస్‌ మిల్లుల వద్ద కస్టోడియన్‌ ఆఫీసర్‌ బాధ్యతలను వారు నిర్వహిస్తున్నారు. ఇటీవల ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు. తేమ శాతం తేడా ఉంటోంది. రైతు భరోసా కేంద్రాలకు, రైస్‌ మిల్లుల వద్ద తేమ శాతానికి పొంతన కుదరడం లేదు.

దాంతో వీఆర్వోలే కస్టోడియన్‌లుగా సమస్యను పరిష్కరించాల్సి వస్తోంది. నిత్యం కొనుగోలు బాధ్యతను నిర్వ హిస్తూ ఒత్తిడికి గురవుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తప్పులు జరిగితే కస్టోడియన్‌ ఆఫీసర్‌లను బాఽధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చస్తున్నారు. ఇటువంటి హెచ్చరికలతో వీఆర్వోలు బెంబేలెత్తిపోతున్నారు.

సంబంధం లేని విధులు

రెవెన్యూ శాఖకు సంబంధం లేని బాధ్యతలు ఇప్పుడు వీఆర్వోలు నిర్వహించాల్సి వస్తోంది. జగనన్న ఇళ్ల స్థలాలకు సంబం ధించి ఈకేవైసీ నిర్వహించడంలో వీఆర్వోలే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కొంతకాలంపాటు దీనిలోనే నిమగ్నమయ్యారు. అంతలోనే లబ్ధిదారులు ఇళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు వస్తున్నాయి. ఆ బాధ్యత కూడా వారిపైనే పడుతోంది. వ్యవసాయ గణాంకాల విధులను నిర్వహిస్తున్నారు. ఈ–క్రాప్‌ నమోదుతో పాటు, వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి గణంకాలు సిద్ధం చేయాల్సి వస్తోంది. ఇటువంటి బాధ్యతల తోపాటు ప్రతినిత్యం నిర్వహించాల్సిన విధులు అనేకం ఉంటున్నాయి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఎఫ్‌ఎంసీ, వ్యవసాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. వీటికితోడు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైతే క్షేత్రస్థాయిలో బాధ్యతంతా వారిపైనే పడుతోంది. జాతర సమయాల్లో దేవాలయాల వద్ద వీఆర్వోలను నియమిస్తున్నారు. దీనికితోడు ప్రతి సోమ, గురువారాల్లో సమావేశాలు ఉంటున్నాయి. ఎన్నికల విధులు తప్పడం లేదు. స్పందనలో సెల్ఫీ ఫొటో తప్పనిసరి చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే పరిరక్షించే బాధ్యత కూడా వీరిదే. ఇలా చెప్పుకుంటే పోతే లెక్కకు మిక్కిలి విధులతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులకు సైతం సమస్యలు చెప్పుకున్నా పరిష్కారం లభించడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల విధులను వీఆర్వోలే నిర్వహించాల్సి వస్తోంది.

తహసీల్దార్ల మాటేంటి ?

తన విధులు కాకపోయినా అధికార పార్టీ నాయకుడి ఒత్తిడి మేరకు గడప గడప కార్యక్రమంలో ఓ తహసీల్దార్‌ పాల్గొని ఇటీవలే కొవిడ్‌, దాని సంబంధిత వ్యాధుల బారిన పడి అకాల మరణం చెందారు. ఈ ఘటన తహసీల్దార్‌ వ్యవస్థను సందిగ్ధంలో పడేసింది. మరో మండల తహసీల్దార్‌ అధికారులు, నాయకుల ఒత్తిళ్లతో హార్ట్‌ ఎటాక్‌తో మరణించారు.

Updated Date - 2022-12-15T00:39:40+05:30 IST