ముచ్చటగా మూడుసార్లు..
ABN , First Publish Date - 2022-08-05T05:14:49+05:30 IST
అధికార ప్రభుత్వం అభివృద్ధి కోసం లక్షలు, కోట్లు వ్యయం చేస్తున్నామంటూ తెగ డబ్బాలు కొడుతోంది..
తాడేరు వంతెన శిథిలమై రెండేళ్లు పూర్తి
రూ.1.90 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు
మూడు సార్లు టెండర్లు పిలిచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు
ప్రయాణ సౌకర్యం కోల్పోయిన మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లోని 30 గ్రామాల ప్రజలు
భీమవరం, ఆగస్టు 4 : అధికార ప్రభుత్వం అభివృద్ధి కోసం లక్షలు, కోట్లు వ్యయం చేస్తున్నామంటూ తెగ డబ్బాలు కొడుతోంది.. కానీ కేవలం 1.90 కోట్లు రూపాయలతో చిన్న వంతెన నిర్మాణం చేపట్టలేకపోవడం చూస్తే సిగ్గు చేటు అనే మాట చక్కగా సరిపోతుందేమో.. పట్టణ శివారున తాడేరు వంతెన శిఽథిలమై అప్పుడే రెండో ఏడాది పూర్తవుతోంది. 2020 జూలై చివరిలో ఈ వంతెన శిఽథిలం కావడంతో రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.
చిన్న వాహనాలకు ఐరన్ రేకు వేశారు. భీమవరం–నరసాపురం వయా మత్స్యపురి 32 కి.మీ. రోడ్డు ఇది. గత ప్రభుత్వం సుమారు రూ.40 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు, మత్స్యపురి వద్ద వంతెన నిర్మాణం మూడేళ్ల గడువులోగానే పూర్తి చేసింది. అయితే అనంతరం శిథిలమయిన తాడేరు వంతెనను కేవలం రూ.1.90 కోట్లతో ఆర్అండ్బీ అధికారులు నిర్మించలేని దారుణమైన దుస్థితి భీమవరం నియోజకవర్గంలో నెలకొంది.
20 కి.మీ. అదనంగా తిరిగి రావాల్సిందే..
భీమవరం – నరసాపురం – పాలకొల్లు నియోజకవర్గాలకు చెందిన ప్రజల రవాణాలో ఈ రోడుఉ్డ కీలక పాత్ర వహిస్తోంది. 24 నెలలుగా వంతెన పనిచేయకపోవడంతో 20 కిలో మీటర్లు దూరం వరకు అదనంగా ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. భీమవరం రావాలంటే వీరవాసరం మండలం నుంచి తిరిగి రావాల్సిందే.! ముఖ్యంగా వరి రైతులు, ఆక్వా రైతులు రవాణాకు అదనపు పెట్టుబడులతో అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది సంక్రాంతికి రూ.20 లక్షలతో వేసిన ఐరన్ రేకుపై చిన్నకార్లు, ఆటోలు వెళ్లడానికి మాత్రమే అవకాశం కలిగింది. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు వంతెన నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలం చెందారు. ఈ దుస్థితి ఇంకెంత కాలమంటూ ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
మూడుసార్లు టెండర్లు పిలిచినా..
భీమవరం నుంచి మత్స్యపురి మీదుగా నరసాపురానికి వెళ్లే ఈ రోడ్డు భీమవరం, పాలకొల్లు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 30 గ్రామాలకు ప్రధాన రహదారిగా ఉంది. 2016లో ఈ రహదారి నిర్మాణం చేశారు. నరసాపురం భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంతలో 2020లో భీమవరం శివారులో ఉన్న తాడేరు వద్ద గునుపూడి సౌత్ డ్రెయిన్‌పై ఉన్న పాత వంతెన శిథిలమైపోయింది. దీంతో రాకపోకలు ఆగిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. నూతన వంతెన కోసం ఆర్అండ్బీ అధికారులు రూ.1.90 కోట్లు అంచనాతో టెండర్లు పిలిచారు. ఎవరూ కాంట్రాక్టర్లు ఎవరూ స్పందించలేదు. రెండో దఫా మళ్లీ పిలిచారు. సీన్ రిపీట్.. ఇప్పుడు మూడోసారి పిలిచారు.. అయినా రాకపోవడంతో ప్రత్యేకనిధి ప్యాకేజీకి మళ్లిస్తున్నట్టు ఆర్అండ్బీ అధికారులు చెప్పారు. కేవలం ఈ చిన్న వంతెన నిర్మాణం చేపడితే ఆ సొమ్ములు వస్తాయో రావో అన్న మీమాంసతోనే కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి.