సంక్షోభం
ABN , First Publish Date - 2022-08-04T05:53:00+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం మిల్లర్లకు శాపంగా మారుతోంది.
నెలరోజులుగా మూతపడ్డ రైసు మిల్లులు
రంగంలోకి ఎఫ్‌సీఐ.. బియ్యం సేకరించేందుకు అంగీకారం
పోర్టిఫైడ్ బియ్యం సేకరణకు అనుమతి
జిల్లాలో 1.50 లక్షల టన్నుల సేకరణ
నేటి నుంచే తీసుకోవడానికి సమ్మతి
పోర్టిఫైడ్ కెన్నల్ సరఫరాలోనూ ప్రభుత్వం వెనుకంజ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం మిల్లర్లకు శాపంగా మారుతోంది. కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరణపై సకాలంలో నిర్ణయం తీసుకో లేక పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లేమితో నెల రోజులుగా రైస్ మిల్లులు మూతపడే దుస్థితి నెల కొంది. ఎట్టకేలకు పోర్టిఫైడ్ బియ్యం తీసుకుంటామని ప్రభుత్వం అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు అప్పగించేలా అనుమతి లభించింది. జిల్లాలో 1.50 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోనుంది. ఎఫ్‌సీఐకి పోర్టిఫైడ్ బియ్యాన్ని అప్ప గించాలి. క్వింటాల్ బియ్యంలో కిలో పోర్టిఫైడ్ కెన్నల్‌ను కలుపుతారు. ఇప్పుడు కెన్నల్ సమస్య వెంటాడుతోంది. కేంద్రం ఒకే చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం దిక్కులు చూసే పరిస్థితి.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో రైసు మిల్లులు సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో షార్టెక్స్ బియ్యం పుష్కలంగా ఉన్నాయి. రబీలో ఉత్పత్తి అయిన మిగులు బియ్యాన్ని విధిగా కేంద్ర ప్రభు త్వానికి అప్పగించాలి. సకాలంలో అనుమతి తెచ్చుకోవాలి. కేంద్రంతో రాష్ట్ర అధికారులు ఆ దిశగా సంప్రదింపులు జర పాలి. ఉచిత బియ్యం ఇవ్వలేమన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభు త్వం గడచిన మూడు నెలల నుంచి కినుక వహించింది. దాంతో కేంద్రం కూడా పట్టు బిగించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోర్టిఫైడ్ బియ్యాన్ని తీసుకోవడానికి కేంద్రం విము ఖత చూపింది. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు నిలిపివేస్తా మని హెచ్చరించింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభించింది. అదికూడా కేంద్ర ఆధీనంలో ఉండే అంత్యోదయ అన్నయోజన కార్డులకు పరిమితం చేసింది. కేంద్ర కార్డులకు ఉచిత బియ్యం ఇచ్చేలా రాష్ట్రం అంగీకరించడంతో పోర్టిఫైడ్ సేకరరించేందుకు కేం ద్రం అనుమతి ఇచ్చింది. జిల్లాలో 1.50 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. ఆ మొత్తం సొమ్ములను రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌కు జమ చేయనుంది.
ఎఫ్సీఐతోనే బకాయిలు ముడి
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో సొమ్ములు చెల్లించలేని దుస్థితిలో ఉంది. ఇప్పటివరకు రూ.1015 కోట్లు చెల్లించారు. మరో రూ.230 కోట్లు చెల్లిం చాల్సి ఉంది. సొమ్ముల కోసం రైతులు జిల్లాలో వ్యవసాయ అధికారు లను నిలదీస్తున్నారు. ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదు. ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించిన తర్వాతే సొమ్ములు చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత ఆహార సంస్థకు బియ్యం చేరిన 48 గంటల వ్యవధిలోనే బిల్లులు చెల్లిస్తుంది. ఆ సొమ్మునే రైతులకు ఇవ్వాలి. అది నెరవేరాలంటే బియ్యం సేకరణ సకాలంలో నిర్వహించాలి. ఇప్పటికే కాలా తీతమైంది. మిల్లర్లు మరాడించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగ మే బియ్యం తీసుకోవడంలో విఫలమైంది. ఇప్పటికైనా పోర్టిఫైడ్ కెన్నల్‌ను సర ఫరా చేసి బియ్యం సేకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ఇటు మిల్లర్లు, అటు రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
చరిత్రలోనే లేదు..
రబీ సీజన్లో ధాన్యం మరాడించే క్రమంలో మిల్లులు మధ్యలో నిలచి పోవడం చరిత్రలోనే లేదు తొలిసారిగా దాదాపు 30 రోజుల పాటు నిలచి పోయా యి. తాజాగా కేంద్రం బియ్యం తీసుకోవడానికి అంగీకరించడంతో బుధవారం నుంచి మిల్లులు తిరగ నున్నాయి. మిల్లులను తిప్పి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగిం చాలని పౌర సర ఫరాల కార్పొరేషన్ అధికారులు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు మిల్లర్లు సమాయత్తమవుతున్నారు. గురువారం నుంచి మిల్లులు మరాడించే అవకాశాలున్నాయి.
పోర్టిఫైడ్తో లింకు
మిల్లర్లు తాజాగా ఎఫ్‌సీఐకి పోర్టిఫైడ్ బియ్యాన్ని అప్పగించాలి. అందుకోసం క్వింటాల్ బియ్యంలో కిలో పోర్టిఫైడ్ కెన్నల్‌ను కలుపుతారు. రాష్ట్ర ప్రభుత్వమే కెన్నల్‌ను సరఫరా చేస్తుంది. ఇటీవల కెన్నల్ సరఫరా కూడా సక్రమంగా చేయ డం లేదు. కాంట్రాక్టర్లకు సొమ్ములు ఇవ్వకపోవడంతో నిలిపివేశారు. వాస్తవానికి కెన్నల్ బియ్యం ధర దాదాపు రూ.72 ఉంటుంది. అందులో రూ.42 కేంద్ర ప్రభు త్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రూ.30 సమకూర్చాలి. అదికూడా ప్రభుత్వం ఇవ్వలేని స్థితిలో ఉంది. దాంతో కెన్నల్ సరఫరా నిలిచిపోతోంది. ప్రభుత్వం ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించాలని ఆదేశాలిచ్చినా కెన్నల్ సమస్య ఇప్పుడు వెంటాడుతోంది. ప్రభుత్వం దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటేనే మిల్లర్లకు ప్రయోజనం కలుగుతుంది.