పొలంబడితో రైతులకు మేలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-05T05:07:32+05:30 IST

పొలంబడి ద్వారా రైతులకు మెరుగైన సాగు పద్ధతులను తెలిపేందుకు వ్యవసాయాధికారులు మరింత కృషి చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు.

పొలంబడితో  రైతులకు మేలు : కలెక్టర్‌
పొలంబడిలో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

ఆచంట, ఆగస్టు 4 : పొలంబడి ద్వారా రైతులకు మెరుగైన సాగు పద్ధతులను తెలిపేందుకు వ్యవసాయాధికారులు మరింత కృషి చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. శేషమ్మచెరువులో గురువారం నిర్వహించిన వైఎస్‌ఆర్‌ పొలంబడి కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని రైతులకు పలు సూచనలు అందిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో చీడ పీడలను అరికట్టేందుకు ఇష్టానుసారంగా రసాయన ఎరువులు, పురుగుల మందు లు వినియోగం వల్ల సాగు ఖర్చు పెరిగి నాణ్యత లేని ఉత్పత్తులను పొందుతున్నామన్నారు. దీనికారణంగా మార్కెట్‌ రేటు, లాభాలు గణనీయంగా తగ్గుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకు రైతులకు పొలంబడి ద్వారా శిక్షణ అందిస్తారన్నారు. వ్యవసాయ పనులు ఎలా జరుగుతున్నా యని ఆరా తీశారు. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రం ద్వారా సేవలను రైతులు వినియోగించుకోవాలన్నారు. ప్రతీ రైతు ఈ–పంట నమోదు చేసుకోవాలన్నారు. దాళ్వాకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదని, గ్రామంలోని దేవుడి పుంతకు సంబంధించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని రైతులు, గ్రామస్థులు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా ఉపాధి హామీ నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేయాలని ఎంపీ డీవోను ఆదేశించారు. ఆక్వా రంగానికి సంబంధించి ఆక్వా జోన్‌లో  రైతులు చెరువులు సాగు చేసుకోవచ్చని, అయితే తాగునీటి ఇబ్బందులు ఎదురైతే   అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా  హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ప్రాముఖ్యత, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలపై రైతులతో ముచ్చటించారు.  సర్పంచ్‌ జెక్కంశెట్టి శ్రీరాములు, వ్యవసాయ శాఖ ఏడీ జెడ్‌. వెంకటేశ్వరరావు, ఏడీఏ  పి.పార్వతి, ఏవో కె.రాజశేఖర్‌,  తహసీల్దార్‌  నజీముల్లాషా, ఎంపీడీవో జగన్నాథం పాల్గొన్నారు.  అనంతరం ఆచంట తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T05:07:32+05:30 IST