చేతులెత్తేసింది..
ABN , First Publish Date - 2022-05-20T06:01:12+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అన్యాయం చేస్తోంది.

కొనుగోళ్లు బంద్.. మిల్లర్ల వద్ద పేరుకుపోయిన ధాన్యం
ఆర్‌బీకేల్లో నమోదు కాని వైనం
బ్యాంక్ గ్యారంటీ పైనా పెదవి విప్పడం లేదు
కొనుగోలు ధాన్యానికి పైసా చెల్లింపు లేదు
ప్రభుత్వం వైఖరితో రైతుల ఇక్కట్లు
ఖరీఫ్ ముందస్తు సాగుపై తీవ్ర ప్రభావం
పెంటపాడు మండలం జట్లపాలెంలో ఓ మోతుబరి రైతు వద్ద 800 క్వింటాళ్లు ధాన్యం నిల్వ ఉంది. ఆర్‌బీకేల్లో నమోదు చేసుకుని మిల్లుకు తరలించాలని సదరు రైతు 15 రోజుల నుంచి ప్రయత్నా లు చేస్తున్నాడు. మిల్లుల వద్ద ఇప్పటికే ధాన్యం పేరుకుపోయింది. బ్యాంక్ గ్యారంటీ మేరకు ఆర్‌బీకేల్లో నమోదు చేసేశారు. కొత్తగా నమోదుకు అవకాశం లేకుండా పోయింది. దాంతో ధాన్యం అమ్మకానికి సదరు రైతు ఎదురు చూస్తున్నాడు. రైతు భరోసా కేంద్రంలో నమోదైన తర్వాత 21 రోజులకు గానీ సొమ్ములు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ గడువులోగానైనా ప్రభుత్వం సొమ్ములు చెల్లిస్తుందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో వేలాది మంది రైతులు ఇప్పుడు ధాన్యం అమ్మకానికి ఆపసోపాలు పడుతున్నారు. అమ్మిన ధాన్యానికి సొమ్ములు రాక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వాతావరణం గుబులు రేపుతోంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అన్యాయం చేస్తోంది. సకా లంలో ధాన్యం కొనుగోలు చేయడంలో చేతులెత్తేస్తోంది. సొమ్ముల విడుదలలోనూ జాప్యం చేస్తోంది. పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ధాన్యం కొను గోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. గడిచిన పది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేకపో తోంది. రైతు భరోసా కేంద్రాల్లో నమోదు కావడం లేదు. రైతు లకు సొమ్ములు అందాలంటే రైతు భరోసా కేంద్రాల్లో నమో దు కావాల్సిందే. గడిచిన ఖరీఫ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ బీకేలను రంగంలోకి దింపినా ధాన్యం అమ్మకానికి రైతులు ఆపసోపాలు పడుతున్నారు. నెలల తరబడి సొమ్ముల కోసం ఎదురు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో ఇదే పరిస్థితి. ఏదో వంకతో జాప్యం చేస్తున్నారు. గతంలో ఈ–క్రాప్‌లో నమోదు కాలేదని రైతులకు సొమ్ములు జమచేయలేదు. ఇప్పుడు మిల్లర్ల వద్ద బ్యాంక్ గ్యారంటీ లేదం టూ ప్రభుత్వం మెలిక పెట్టింది. బ్యాంకు గ్యారంటీ వెసులు బాటు కల్పించాలంటూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివే దిక పంపారు. లేదంటే ధాన్యం కొనుగోలుపై ప్రభావం పడు తుందని సంకేతాలు పంపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బ్యాంక్ గ్యారంటీ విషయంలో వెసులు బాటు కల్పించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పైసా చెల్లించని ప్రభుత్వం
జిల్లాలో 7.65 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం రైతులకు దాదాపు రూ.1515 కోట్లు చెల్లించాలి. మే మొదటి వారానికే జిల్లాలో 4.25 లక్షల టన్నులు సేకరించారు. రైతులకు వారం రోజుల వ్యవధిలోనే రూ.842 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్క పైసా చెల్లించకపోగా గడువు పెంచింది. టీడీపీ ప్రభు త్వ హయాంలో విక్రయించిన 48 గంటల్లోనే సొమ్ములు జమ అయ్యేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 రో జులకు పెంచింది. అయినా గడువులోగా ఇవ్వలేక పోయింది. ఇప్పుడు దానిని 21 రోజులకు పెంచింది. పౌర సరఫరాల కార్పొరేషన్‌కు మిల్లర్లు ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీ మేరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. మరో 3.40 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే లక్ష్యం పూర్తవుతుంది. ప్రభుత్వం గడిచిన ఖరీఫ్‌లో 1:3 ప్రాతిపదికన బ్యాంక్ గ్యారంటీకి అవకాశం కల్పించింది. అప్పట్లోను రైతులు నష్టపోయిన తర్వాతే ప్రభు త్వం మేల్కొంది. ప్రస్తుతం రబీలోను స్పందన లేదు.
దళారులదే రాజ్యం
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు గ్రామస్థాయిలో దళారులను ఆశ్రయిస్తున్నారు. మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. అధికార పార్టీలో కాస్త పలుకుబడ్డి ఉన్న నాయకులు మాత్రం ప్రభుత్వానికి అమ్మకం జరిపేలా దళారులతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆర్‌బీకేల్లో తమ పేరుతో నమోదు చేసుకుంటున్నారు.
ముందస్తు సాగేనా..
జూన్ ఒకటో తేదీ నుంచే కాల్వలకు నీటిని సరఫరా చేయ నున్నారు. ముందస్తు ఖరీఫ్‌కు వ్యవసాయశాఖ ప్రణాళిక రచించింది. ఖరీఫ్ సాగాలంటే రైతులకు పెట్టుబడి అవసరం. ప్రభుత్వం సొమ్ములు చెల్లిస్తేనే ఇది సాధ్యం. మూడేళ్ల నుంచి ప్రభుత్వం సొమ్ములు చెల్లింపులో చేతులెత్తేస్తోంది.
ఎఫ్‌సీఐ పైనే ఆధారం
రైతులకు సొమ్ములు చెల్లించడానికి ప్రభుత్వం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)పై ఆధారపడుతోంది. రబీలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగిస్తోంది. ఎఫ్‌సీఐ బిల్లులు చెల్లిస్తే ఆ సొమ్మును రైతులకు జమ చేస్తోంది. ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించడంలోనూ ప్రభుత్వం ఈ ఏడాది విఫలమ వుతోంది. విద్యుత్ కోతలు రైస్ మిల్లింగ్ పరిశ్రమను అస్త వ్యస్తం చేసింది. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం విధానాలతో అన్నదాతకు నష్టం వాటిల్లుతోంది.
వానొచ్చి తడిపేసింది..
ఆచంట / తాడేపల్లిగూడెం రూరల్ మే 19: వాతావరణంలో మార్పుల కారణంగా గురువారం ఉదయం ఆకస్మాత్తుగా మబ్బులు మేఘాలు కమ్ముకుని జిల్లాలోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన కురిసింది. ఆచంట, తాడేపల్లిగూడెం, తణుకు తదితర మండలాల్లో వర్షం పడింది. ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులు రాశులుగా చేసి బరకాలు కప్పారు. కొన్ని చోట్ల ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. మరలా మధ్యాహ్నం నుంచి ఎండ కాయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
రైస్‌మిల్లుల ఆకస్మిక తనిఖీ
పాలకోడేరు/పాలకొల్లు రూరల్, మే 19 : పాలకోడేరు మండలం శృంగవృక్షంలోని శ్రీవీరవెంకట సత్యనారాయణ మోడరన్ రైస్‌మిల్లును గురువారం జేసీ మురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్‌బీకేల నుంచి వచ్చిన ధాన్యం దిగుమతి, ధాన్యం ప్రాసెస్, బియ్యం ఏవిధంగా వస్తున్నాయి, గ్రేడింగ్ తదితర అంశాలను పరిశీలించారు. ఆయన వెంట ఏఎస్‌వో ఎం.రవిశంకర్, డీటీ కె.సుబ్బారావు, ఆర్‌ఐ వై.రూజ్‌వెల్ట్ ఉన్నా రు. పాలకొల్లు దిగమర్రులోని విజయలక్ష్మీ రైస్ మిల్లును గురువారం నరసాపురం సబ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. లంకల కోడేరు, ఉల్లం పర్రుల్లోని రైస్ మిల్లులను సివిల్ సప్లయిస్ డీఎస్‌వో ఎన్.సరో జిని, ఎస్‌ఎఫ్‌వో రవి శంకర్ తనిఖీ చేశారు. తహసీల్దార్ జి.మమ్మి, ఆర్‌ఐ పి.త్రిమూర్తులు, వీఆర్వోలు ఉన్నారు.