అప్పు తీర్చలేక..
ABN , First Publish Date - 2022-12-31T00:56:23+05:30 IST
భీమవరం బీసీ కాలనీ సమీపంలో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి జరిగిన రౌడీషీటర్ హత్య కేసును పోలీసులు చేధించి ఏడుగురు యువకులను అరెస్టు చేశారు.
భీమవరం క్రైం, డిసెంబరు 30 : భీమవరం బీసీ కాలనీ సమీపంలో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి జరిగిన రౌడీషీటర్ హత్య కేసును పోలీసులు చేధించి ఏడుగురు యువకులను అరెస్టు చేశారు. శుక్రవారం భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్ తెలిపిన వివరాలివి.. రాయలం గ్రామానికి చెందిన రౌడీ షీటర్ రౌతుల ఏసు(32) వద్ద గొల్లవానితిప్ప రోడ్డుకు చెందిన టైల్స్ మేస్ర్తీ వడ్డి దుర్గారావు గతంలో వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. బాకీ తీర్చకపోవడంతో ఒత్తిడి తెచ్చి తన అప్పు తీర్చడానికి మరొకరి దగ్గర దుర్గారావుకు అప్పు ఇప్పిం చాడు. ఆ డబ్బుతో ఏసు అప్పు తీర్చి మిగిలిన డబ్బుతో దుర్గారావు గొల్లవానితిప్ప రోడ్డులో నివాసం ఉండేందు కు ఒక రేకుల షెడ్ కొన్నాడు. షెడ్ కొన్న సమయంలో మళ్లీ ఏసు వద్దే కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. ఆపై అప్పు తీర్చమని ఏసు ఒత్తిడి చేయడంతోపాటు కొంతమందితో కలసి దుర్గారావు ఇంటికి వెళ్లి గొడవ చేయడమే కాకుండా తక్కువ ధరకు రేకుల షెడ్‌ను అమ్మించి వేశాడు. అయినా దుర్గారావు బాకీ తీర్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఏసుపై కక్ష పెంచుకుని చంపాలని నిర్ణయించుకున్నాడు. గతంలో తన వద్ద పనిచేసిన బీసీ కాలనీకి చెందిన బెవర గోవిందరావు, బెవర విజయబాబు (గాలోడు), ప్రకాశ్‌నగర్‌కు చెందిన ద్రోణాద్రి సాయివంశీ(జంగాలు), ఈదా మోషేన్(బన్ని), బలుసుమూడికి చెందిన నక్కా డేవిడ్, బీసీ కాలనీకి చెందిన తాడి దుర్గాప్రసాద్‌లతో కలసి హత్యకు ప్లాన్ వేశారు. ఒక గొడ్డలి, రెండు మాంసం కత్తులు కొన్నారు. ఏసు కదలికలపై నిఘా పెట్టారు. బీసీ కాలనీలో అతను సహజీవనం చేసే మహిళ వద్దకు రాత్రివేళ వెళ్లడాన్ని గుర్తించారు. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి ప్లాన్ అమలు చేశారు. దారికాచి ఏసుపై దాడి చేసి కళ్ళలో కారం కొట్టి ఇనుప రాడ్డుతో కొట్టి కత్తులు, గొడ్డలితో నరికి చంపారు. గొడ్డలి, కత్తులను గోనె సంచులలో కట్టి చెత్త కుప్పలో పడేసి ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. ఈ ఘటనపై ఎస్పీ రవిప్రకాష్, భీమవరం డీఎస్పీ శ్రీనాధ్ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. టూటౌన్ సీఐ కృష్ణకుమార్, ఎస్‌ఐలు అప్పారావు, రాంబాబు శుక్రవారం గొల్లవానితిప్ప రోడ్డులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.