విలీనం.. విభేదం

ABN , First Publish Date - 2022-12-10T00:13:50+05:30 IST

గణపవరం మండలాన్ని విలీనం చేసేందుకు ప్రభుత్వం గతంలోనే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

విలీనం.. విభేదం

గణపవరంపై అధికార పార్టీలో చిచ్చు

భీమవరంలో కలపాలంటూ సంతకాల సేకరణ

అంతర్గతంగా కొందరు ఏలూరులోనే ఉండాలని పట్టు

ఎవరి వాదన వారిదే

సీఎం హామీ నిలబెట్టుకుంటాం.. ఎమ్మెల్యే వాసుబాబు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

గణపవరం మండలాన్ని విలీనం చేసేందుకు ప్రభుత్వం గతంలోనే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిపై నెల రోజుల్లో మండల ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను తెలపాలని సూచించింది. అభిప్రాయాలు తెలిపేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు శనివారంతో ముగియనుంది. అంతా అనుకూలంగా ఉంటే గణపవరం పశ్చిమ గోదావరిలో విలీనం అవుతుంది. కానీ ఇక్కడ అధికార పార్టీలోనే విలీనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విలీనం వద్దని ఒకరు.. కావాలని మరికొందరు రెండు వర్గాలుగా విడిపోయి సంతకాల సేకరణ చేపట్టారు.. ఇలా మండలంలో అధికార పార్టీ రెండుగా చీలినట్టయ్యింది.

గణపవరం మండలం పశ్చిమలో విలీనానికి అంతా అనుకూలంగానే ఉన్నారని భావించారు. అయితే అధికార పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎవరి అభిప్రాయం వారు స్వేచ్ఛగా తెలుపు కోవచ్చంటూ నియోజక వర్గ నేత నుంచి అధికార పార్టీ శ్రేణులకు సంకేతాలు వెళ్లాయి. దీంతో గణపవరం మండలం ఏలూరు జిల్లాలోనే ఉండాలంటూ అధికార పార్టీలోని ఓ వర్గం పావులు కదిపింది. గుట్టుచప్పుడు కాకుండా సంతకాలు సేకరించి కలెక్టర్‌కు సమర్పిం చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది కాస్త అధికార పార్టీలోని అలజడికి దారితీసింది. గణపవరం మండలాన్ని భీమవరంలో విలీనం చేయకుండా కుట్రలు పన్నుతున్నారంటూ మరో వర్గం తెరపైకి వచ్చింది. మండల పరిషత్‌ అధ్యక్షుడు, పలువురు సర్పంచ్‌లు బహిరంగంగా గణపవరం మండలం విలీనానికి మద్దతు ప్రకటించారు. సంతకాలు సేకరించి ఏలూరు కలెక్టర్‌కు సమర్పించేందుకు కసరత్తు చేశారు. విలీనానికి అనుకూలంగా అభిప్రాయాలతో కూడిన నివేదికను సమర్పించారు. ఏలూరులోనే ఉండాలంటూ ప్రయత్నాలు చేసిన వర్గం ఏమి చేసిందనే విషయమై అంతా గోప్యంగా ఉంచారు. పార్టీలో కొందరు సర్పంచ్‌లు, ఇతర నాయకులు ఏలూరులోనే మండలం ఉండాలన్న దృక్పథంతో ఉన్నారు.

జిల్లా పునర్‌వ్యవస్థీకరణ నుంచే..

జిల్లా పునర్‌వ్యవస్థీకరణ తెరపైకి వచ్చినప్పటినుంచే గణపవరం మండలం ఎటు ఉండాలన్న ఊగిసలాట ప్రారంభమైంది. భీమవరం వైపు అనేకమంది మొగ్గు చూపారు. అప్పట్లో వినతి పత్రాలను సమర్పిం చారు. అప్పట్లో గణపవరం మండలం పశ్చిమగోదావరి జిల్లాలో ఉండాలన్న ప్రయత్నాలు ఫలించలేదు. ఏలూరు జిల్లాలోనే ఉంచుతూ జిల్లా పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. అయినా గణపవరం మండలం పశ్చిమగోదావరి జిల్లాలో కలపాలన్న ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ దృష్టికి నియోజకవర్గ అధికార పార్టీ నేత తీసు కెళ్లారు. అందుకు అనుగుణంగానే గణపవరం పర్యటనలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. పశ్చిమలో గణపవరం మండలాన్ని విలీనం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నెల రోజుల వ్యవధిలో దీనిపై మండల ప్రజలు తమ అభిప్రాయాలను, సలహా లను ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఇదంతా లాంఛన ప్రాయమేనన్నట్టు అందరూ భావించారు. ఇక విలీనం చేస్తూ తుది ఉత్తర్వులు జారీ అవుతాయని భావిం చారు. అంతలో మండలంలోని అధికార పార్టీలో భిన్నాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. లోపాయికారీగా ఓ వర్గం ఏలూరులోనే గణపవరం ఉండేలా పావులు కదిపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మరోవర్గం బహిరంగంగా పశ్చిమగోదావరిలో విలీనానికి మద్దతు తెలిపింది. సంతకాలను సేకరించి ఏలూరు జిల్లా కలెక్టర్‌కు తమ మనోభీష్టాన్ని లిఖితపూర్వకంగా సమర్పించారు.

ఎవరి వాదన వారిదే

వాస్తవానికి గణపవరం మండలంలోని గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లాకు సమీపంలో ఉన్నాయి. అన్ని గ్రామాలు అటు భీమవరం లేదంటే ఇటు తాడేపల్లిగూడెం పట్టణానికి దగ్గరగా ఉన్నాయి. దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలోనే గ్రామాలన్నీ విస్తరించి ఉన్నాయి. ఏలూరుకు వచ్చేసరికి పలు గ్రామాల ప్రజలు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గణపవరం మండల ప్రజలకు భీమ వరంతో, తాడేపల్లిగూడెంతో అనుబంధం ఉంది. మార్కెట్‌ అవసరాలు, వైద్య సేవల కోసం ఈ రెండు పట్టణాల పైనే ఆధారపడుతుంటారు. బస్సు సౌకర్యం దృష్ట్యా రాకపోకలకు అనుకూలం. దీనిని దృష్టిలో ఉంచుకుని గణపవరం మండలాన్ని భీమవరం కేంద్రంగా ఏర్పాటైన పశ్చిమగోదావరిలో విలీనం చేయాలన్న డిమాండ్‌ తొలినుంచి ముందుకొచ్చింది. పాలనపరంగా కొత్త సమస్య వస్తుందని మరో వర్గం అభిప్రాయ పడుతోంది. ప్రస్తుతం ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఏలూరు జిల్లాలో ఉన్నాయి. ఏలూరు రెవెన్యూ డివిజన్‌లో గణపవరం మండలం కూడా ఉంది. పాలన అంతా ఏలూరు అధికారులతోనే సాగుతోంది. భీమవరంలో విలీనమైతే రెవెన్యూ అవ సరాలకు మళ్లీ ఇక్కడ ఆధారపడాల్సి వస్తుంది. అదే ఏలూరులో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికార పార్టీలో ఓ వర్గం భావిస్తోంది. మొత్తంపైన తుది నిర్ణయం ప్రభుత్వం పైనే ఆధారపడి ఉంటుంది.

విలీనానికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే

గణపవరం, డిసెంబరు 9: గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డివిజన్‌లో విలీనం చేస్తామని ఇచ్చిన నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు స్పష్టం చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పుప్పాల మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా పునఃవిభజనలో భాగంగా మండలాన్ని భీమవరం డివిజన్‌లో కలిపాలని గడిచిన మే 16న గణపవరం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కోరానన్నారు. పశ్చిమలో విలీనం చేస్తామని సీఎం సభాముఖంగా ప్రకటి ంచారని గుర్తు చేశారు. ఈ నెల 10వ తేదీలోగా వ్యక్తిగత అభ్యంతరాలు, ఉంటే గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం తెలపాలని కోరారన్నారు. అయితే ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలతో పార్టీకి కానీ, తనకు కానీ ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. భీమవరం డివిజన్‌లో విలీనం జరిగితే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. విలీనం తథ్యమని ఎటువంటి అపోహలకు గురికావల్సిన అవసరం లేదని అన్నారు.

Updated Date - 2022-12-10T00:13:50+05:30 IST

Read more