మసాజ్‌..ఉచ్చు!

ABN , First Publish Date - 2022-11-25T00:07:48+05:30 IST

జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో మసాజ్‌ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు, స్పాల పేరుతో విచ్చల విడిగా వెలుస్తున్నాయి.

మసాజ్‌..ఉచ్చు!

యువకులే టార్గెట్‌

మసాజ్‌ పేరుతో వీడియో చిత్రీకరణలు

గతంలో డీజీపీకి ఫిర్యాదు

పోలీస్‌ అధికారి హస్తం ఉందంటూ

ఆరోపణలు.. సదరు అధికారిపై వేటు

జిమ్‌లలోనూ డ్ర గ్స్‌ దందా

మహిళలను ట్రాప్‌ చేస్తున్న వైనం

జిల్లాలోని ఒక పట్టణంలో మహిళ ఆత్మహత్య

ఫిర్యాదుల్లేక చర్యలు తీసుకోని పోలీసులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో మసాజ్‌ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు, స్పాల పేరుతో విచ్చల విడిగా వెలుస్తున్నాయి. అసభ్యకర పనులకు తావిస్తున్నాయి. యువతను పెడదోవ పెట్టిస్తున్నాయనడానికి కొన్నిచోట్ల జరిగిన ఘటనలే నిదర్శనం. ఇతర జిల్లాల నుంచి యువతులను రప్పించి బ్యూటీ పార్లర్ల పేరుతో యువకులను ఆకర్షిస్తూ వీడియోలు చిత్రీకరణ చేస్తూ అనంతరం బ్లాక్‌మెయిల్‌తో పెద్ద మొత్తంలో సొమ్ములు దండుకుంటున్నారు. కొన్ని జిమ్‌లలో మహిళలను డ్రగ్స్‌కు అలవాటు చేస్తూ అనంతరం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఘటనలున్నాయి. వీటిపై పోలీస్‌ యంత్రాంగం స్పందించి తగిన చర్యలు తీసుకుని యువత ఆ ఉచ్చులో పడకుండా రక్షించాలి.

భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని ఓ మసాజ్‌ సెంటర్‌కు ఓ పదహేరేళ్ల యువకుడు వెళ్లాడు. కాలి మడం నొప్పి తగ్గించుకోవడానికి తల్లిదండ్రుల అనుమతితోనే మసాజ్‌ సెంటర్‌కు వెళ్లిన ఆ యువకుడికి ఊహించని అనుభవం ఎదురైంది. బ్యూటీ పార్లర్‌ బోర్డు పెట్టుకుని నిర్వహిస్తున్న మసాజ్‌ సెంటర్‌లో 20 ఏళ్ల యువతి ప్రత్యక్షమైంది. కొద్దిసేపు కాలికి మసాజ్‌ చేసింది. ఆ తర్వాత యువకుడిపై దుస్తులు తీసివేసింది. యువకుడ్ని ప్రేరేపించింది. దీనిని వీడియో తీశారు. సదరు వీడియో బయటకు వెళ్లకూడదంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంత మొత్తాన్ని చెల్లించి యువకుడు మసాజ్‌ సెంటర్‌ నుంచి బయటపడ్డాడు. బ్యూటీ పార్లర్‌లో జరిగిన తంతును యువకుడు తల్లిదండ్రులకు వివరించగా వారు కంగుతిన్నారు. రాష్ట్ర డీజీపీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సదరు బ్యూటీ పార్లర్‌కు ఓ ఎస్‌ఐ ప్రోత్సాహం కూడా ఉండేది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆలస్యం గానైనా పోలీసులు స్పందించారు. ప్రోత్సహిస్తున్న ఎస్‌ఐపై ఉన్నతాధికారులు వేటు వేశారు. బ్యూటీ పార్లర్‌లో మసాజ్‌ సెంటర్‌ను సీజ్‌ చేశారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. వారం రోజుల క్రితం భీమవరం సమీపంలోని చినఅమిరంలోని మరో బ్యూటీ పార్లర్‌పై పోలీ సులు దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని పార్లర్‌ను మూసి వేశారు. జంట్స్‌ బ్యూటీ పార్లర్‌ పేరుతో మహిళలతో యువకులను ఉచ్చులోకి లాగి ఆపై బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఘటనలు పెరుగు తున్నాయి . జిల్లాలోని ఇతర ముఖ్య పట్టణా ల్లోనూ ఇటువంటి దందా సాగుతోంది. ఈ చీకటి దందాపై భీమవరంలో పోలీసులు నిఘా పెట్టారు. అయినా పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతు న్నారు. కొద్దినెలల వ్యవధి లోనే రెండు బ్యూటీపార్లర్‌ లలో చీకటి కోణాలు బయటపడడం చర్చనీ యాంశంగా మారింది. ఇతర జిల్లాలైన కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి యువతు లను రప్పించి బ్యూటీ పార్లర్‌లను నిర్వహిస్తున్నట్టు సమాచారం.

అక్కడ మహిళలే టార్గెట్‌..

ఇదిలా ఉంటే కొన్ని జిమ్‌లలో మహిళలను ట్రాప్‌ చేసే ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉన్న పట్టణంలో నిర్వహిస్తున్న ఓ జిమ్‌లో మహిళలు వ్యాయామం చేసే సౌకర్యాలు కల్పించారు. ఉదయం, సాయంత్రం జిమ్‌ నిర్వహిస్తు న్నారు. అక్కడ మహిళ లకు డ్రగ్స్‌ అలవాటు చేస్తూ నిర్వాహకుడు తన ట్రాప్‌లోకి తీసుకుని ఆపై మహిళలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిమ్‌కు వెళుతున్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు ఎటువంటి ఫిర్యాదులు వెళ్లకపోవడంతో చర్యలు తీసుకోలేని పరిస్థితి. జిమ్‌లో డ్రగ్స్‌కు అలవాటు పడ్డ మరో మహిళ పూర్తిగా సన్నబడిపోయింది. ఒకరోజు కళ్లు తిరిగి కిందపడి ఆస్పత్రి పాలైంది. పట్టణంలో దీనిపై చర్చ నడుస్తోంది. అయితే ఫిర్యాదులు అందకపోవడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. జిల్లా లోని ప్రధాన పట్టణాల్లో ఇటువంటి చీకటి కోణాలు అనేకం ఉంటున్నాయి. బ్యూటీ పార్లర్‌, స్పాల పేరుతో యువకులను పెడదోవ పట్టిస్తున్నారు. జిమ్‌ల పేరుతో మహిళలను డ్రగ్స్‌కు అలవాటు చేస్తున్నారు. దీనిపై అధికార యం త్రాంగం దృష్టి సారించాల్సి ఉంది.

–––––––––

Updated Date - 2022-11-25T00:08:00+05:30 IST