నేతే.. చేను మేస్తే..!

ABN , First Publish Date - 2022-11-17T00:10:14+05:30 IST

తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ భూమిపై అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్నుపడింది.

నేతే.. చేను మేస్తే..!
ప్రభుత్వ భూమిలో నిర్మాణం

ఏడాదిన్నర క్రితం వారసుల పేరిట పన్ను

తాజాగా నిర్మాణ పనులు.. క న్నెత్తి చూడని అధికారులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ భూమిపై అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్నుపడింది. ఇంకే ముంది కబ్జాకు తెరతీశారు. బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌లోని అత్యంత విలువైన భూమిలో ప్రస్తుతం నిర్మాణం వెలుస్తోంది. మార్కెట్‌లో గజం స్థలం రూ.40 వేల వరకు ఉంది. మార్కెట్‌లో ఉల్లి, కూరగాయలు, పండ్ల వ్యాపారం జోరుగా సాగుతుంటాయి. అనాదిగా వ్యాపారులు షెడ్లు, నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారు. సుమారు 9 ఎకరాల్లో మార్కెట్‌ విస్తరించింది. అందులో సంత మార్కెట్‌తో కలిపి సుమారు మూడున్నర ఎకరాలు ఖాళీ భూమి ఉంది. ఆ భూమి ఆక్రమణకు గురికాకుండా గడిచిన ఆరేళ్ల నుంచి మునిసిపాలిటీ చర్యలు తీసుకుంటూ పరిరక్షించింది. అయితే ప్రస్తుతం అధికార పార్టీ నేత కనుసన్నల్లోనే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

మార్కెట్‌లోని ఆ భూమిపై ఏడాదిన్నర నుంచి దీనిపై పక్కా ప్రణాళిక వేశారు. నేత వారసుల పేరుతో పన్ను వేయించుకున్నారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు ఉంటే మునిసిపల్‌ రెవెన్యూ శాఖ పన్ను వేస్తుంది. కానీ అధికార పార్టీ నేత అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేకపోయినా దాదాపు 400 గజాల స్థలానికి పన్ను వేయించుకున్నారు. ఒత్తిళ్లు తాళలేక మునిసిపాలిటీ పన్ను వేసింది. ఇప్పుడు అదే స్థలంలో షెడ్డులు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌లో ప్రభుత్వ భూమి గతంలో జిల్లా పరిషత్‌ ఆధీనంలో ఉండేది. కాలక్రమేణ దానిని మునిసిపాలిటీకి దాఖలు పరిచారు. అప్పటి నుంచి ఆక్రమణలపై మునిసిపాలిటీ పన్ను వేస్తూ వస్తోంది. యాజమాన్య హక్కులు మాత్రం మునిసిపాలిటీకే ఉంటు న్నాయి. నిర్మాణాలు ఉంటేనే పన్ను వేయాల్సి ఉంటుంది. ఖాళీ స్థలాలు ఉంటే మునిసిపాలిటీ పరిరక్షించాలి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఖాళీ స్థలాల్లో ఆక్రమణలు లేకుండా చూశారు. కొత్తగా నిర్మాణాలు చేపట్టినా తొలగించారు. ప్రస్తుతం దీనికి విరుద్ధంగా ఆ ఖాళీ స్థలంలో నిర్మాణం వెలుస్తోంది. అధికార పార్టీ నేతే నిర్మాణం చేపడుతుండడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రైవేటు నిర్మాణాల్లో అతిక్రమణలకు పాల్పడ్డా రంటూ భవనాలను కూల్చివేసిన ఘటనలు తాడేపల్లిగూడెంలో ఉన్నాయి. ఆ స్థలానికి ఆనుకుని ఒక వైపు ఉల్లి మార్కెట్‌ ఉంది. మరోవైపు మునిసి పల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉంది. బ్రహ్మానంద రెడ్డి మార్కెట్‌లో ఖాళీ స్థలం లో నిర్మాణాలు చేపట్టకూడదు. ఇదివరకే నిర్మాణాలు ఉంటే ఆక్రమిత పన్ను వసూలు చేసే అధికారం మునిసిపాలిటీకి ఉంది.

ప్రభుత్వ స్థలాలకు కొత్త పన్నా!

ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు ఉంటే ఆక్రమిత పన్ను వేయాలి. పట్టణం లో విమానాశ్రయ భూములు, మార్కెట్‌లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు ఉన్నాయి. వాటిపై మునిసిపాలిటీ రెవెన్యూ విభాగం పన్ను వేసింది. ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉంటే వాటిపై పన్ను వేయకూడదు. కొత్తగా పన్ను వేయడం మరీ తప్పిదం. అయినాసరే అధికార పార్టీ నేత ఒత్తిడి చేసి బ్రహ్మానంద రెడ్డి మార్కెట్‌లోని 400 గజాల స్థలంలో తన వారసుల పేరుతో ఏడాదిన్నర క్రితం పన్ను వేయించుకున్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధం. ప్రభుత్వ స్థలంలో కొత్తగా పన్ను వేసే అధికారం ఎవ్వరికీ లేదు. ఇప్పుడు ఏకంగా నిర్మాణం చేపట్టినా అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడలేకపోతోంది. గతంలో బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌లో పండ్ల దుకాణ సముదాయంలో ఓ వ్యాపారి తనకు ఉన్న భవనాన్ని పడగొట్టి దాని స్థానం లో పక్కా నిర్మాణాన్ని చేపడితే అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేసి పై అంతస్తును పడగొట్టారు. ఇప్పుడు ప్రభుత్వ స్థలంలో పక్కా నిర్మాణాన్ని చేపడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

క్రమబద్ధీకరణకు చెక్‌

నిజానికి బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌లో ఆక్రమిత స్థలాలను క్రమబద్ధీకరిం చాలన్న ప్రయ త్నాలు జరిగాయి. అత్యంత విలువైన భూమిని క్రమబద్ధీక రిస్తే ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుందన్న వాదన బలంగా వినిపించింది. మరోవైపు ఆక్రమిత నిర్మాణాల్లో అద్దెకు ఉంటున్న వ్యాపారులు దెబ్బతింటారన్న అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో క్రమబద్ధీకరణ అంశం మరుగున పడింది. కేవలం వ్యాపారాలు నిర్వహించుకునేందుకే మునిసిపా లిటీ అవకాశం కల్పిం చింది. ఖాళీ స్థలాలు ఉంటే వాటిని పరిరక్షించుకునే బాధ్యత మునిసిపాలిటీదే. కానీ అధికార పార్టీ నేతే ఇప్పుడు నిర్మాణానికి పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2022-11-17T00:10:21+05:30 IST