పంటు ఎవరికి దక్కేనో?

ABN , First Publish Date - 2022-12-15T00:34:08+05:30 IST

రాష్ట్రంలోనే నరసాపురం– సఖి నేటిపల్లి రేవు అతి పెద్దది. నిత్యం ఐదువేల నుంచి పదివేల మంది ఈ రెండు రేవుల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.

పంటు ఎవరికి దక్కేనో?

ఫిబ్రవరిలో మాధవాయిపాలెం రేవు పాట

నరసాపురం, డిసెంబరు 14: రాష్ట్రంలోనే నరసాపురం– సఖి నేటిపల్లి రేవు అతి పెద్దది. నిత్యం ఐదువేల నుంచి పదివేల మంది ఈ రెండు రేవుల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వానికి ఏటా రేవు పాట ద్వారా ఆదా యం లభిస్తుంది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.2.60 కోట్లు అదాయం వచ్చింది. ఇదే అల్‌టైం రికార్డు. దీంతో అందరి చూపు వచ్చే ఏడాది నిర్వహించే రేవు పాటపై పడింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రేవు పాట నిర్వహణకు అధికారులు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. గడిచిన మూడేళ్ల ఆదాయా న్ని పరిగణలోకి తీసుకుని పాట ప్రారంభ ధర నిర్ణయించి ప్రతి పాదనలు ప్రభుత్వానికి పంపే పనిలో పడ్డారు. ఆమోదం రాగానే వచ్చే నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చి ఫిబ్రవరిలో పాట పెట్టేందుకు సన్నద్ద మవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు ఎంపీడీవో ప్రసాద్‌ యాదవ్‌ బుధవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. రేవు పాట గడిచిన వందేళ్లలో కొన్ని కుటుంబాల మధ్యే సాగింది. ఆ తర్వాత రాజకీయ రంగు పులుముకుంది. గతేడాది అధికార పార్టీ నాయకులు హెచ్చు మొత్తంలో పాడి దక్కించుకున్నారు. సొసైటీ ల పేరుతో పాటలో పాల్గొన్నప్పటికీ తెర వెనుక నడిపేందంతా పార్టీ నేతలే. దీంతో ఈసారి కూడా పోటీ హెచ్చుగానే ఉంటుంద న్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో రేవు నిర్వహించిన పాట దారులు ఈసారి ఎలాగైనా టెండర్‌ దక్కించుకునేందుకు సిండికే ట్‌గా ఏర్పడి రేవుకు టెండర్‌ వేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహా రచనలు చేస్తున్నట్టు తెలిసింది.

Updated Date - 2022-12-15T00:34:17+05:30 IST