కంటితుడుపు..

ABN , First Publish Date - 2022-05-22T05:49:13+05:30 IST

ఓవైపు పడిపోయిన రొయ్యల ధరలు.. మరోవైపు విద్యుత్‌ సబ్సిడీ కోతలు..

కంటితుడుపు..


ఆక్వా మేతల్లో 15 శాతం పెరుగుదల ఉంటే కేవలం 2 శాతం తగ్గింపా..?
 ఫీడు ధరల మోత.. విద్యుత్‌, సబ్సిడీ కోత..
తగ్గిన రొయ్య ధర.. పెట్టుబడులు రావడం లేదు
ఆక్వా రైతుల ఆవేదన.. ప్రభుత్వం తీరుపై నిట్టూర్పు


భీమవరం, మే 21 : ఓవైపు పడిపోయిన రొయ్యల ధరలు.. మరోవైపు విద్యుత్‌ సబ్సిడీ కోతలు.. ఇంకోవైపు అడ్డుగోలు విద్యుత్‌ కోత.. పెరిగిన ఫీడ్‌ ధరలు.. నిర్వహణ వ్యయం.. వేసవి ఎండలతో ప్రతికూల వాతావరణంతో  ఆక్వా రైతును సమస్యలు నిలువెల్లా చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన ఆక్వా మేతల ధరలపై 2 శాతం తగ్గించాలని ప్రభుత్వం ఆదేశిస్తూ తీసుకున్న నిర్ణయం రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

ఇటీవల గణపవరం వచ్చిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వాసుబాబుతో పాటు పలువురు రైతు లు ఆక్వా ఫీడ్‌ ధరలు, విద్యుత్‌ సబ్సిడీ, రొయ్య ధరల నియంత్రణ వంటి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దీంతో రెండు రోజు ల కిందట మంత్రి సిదిరి అప్పలరాజు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు, మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించి, కేవలం మేతల ధరలపై 2శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి కేవలం కార్పొరేట్‌ సాగు రైతు నాయకులు ఐపీఆర్‌ మోహన్‌రాజు, గాదిరాజు సుబ్బ రాజు, లక్ష్మీపతిరాజు, అప్సర చైర్మ న్‌ వడ్డెర రఘురాం, చేపల రైతు సంఘం నాయకుడు రామచంద్రరాజు తదితరులు హాజరయ్యారు. గత రెండేళ్లలో 15 శాతం వరకు పెరిగిన ధరలను కేవలం రెండుశాతం మాత్రమే తగ్గించాలని తీసుకున్న నిర్ణయంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు ఆక్వా సాగు చాలా బాగుందంటూ మత్స్యశాఖ యం త్రాంగం కితాబు ఇవ్వడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  నెలరోజులుగా పెరిగిపోయిన విద్యుత్‌ కోతకు తోడు ప్రస్తుతం యూనిట్‌కు వసూలు చేస్తున్న 1.50 పైసలను 5 నుంచి 10 ఎకరాల లోపు వారికి ఇస్తామని నిర్ణయం తీసుకున్నా రైతులకు పెద్దఎత్తున ఆదాయం పడిపోయింది. ఈ సబ్సిడీ రాష్ట్రవ్యాప్తంగా రూ.960 కోట్లు ఉంది.  జిల్లాలో ఆక్వా చెరువులకు నెలవారీగా 8,95,18,222 యూనిట్లు వినియోగిస్తున్నట్టు ఏపీ ట్రాన్స్‌కో ప్రకటించింది. ఈ వినియోగం చూస్తే సబ్సిడీ భారీగానే రైతులకు నష్టాన్ని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. సబ్సిడీ తగ్గించడం వల్ల ఒక రైతుకు కిలో రొయ్యల దిగుబడికి రూ.40 భారం పెరిగింది.
 
2020 తర్వాత మేతల ధరలు పెరుగుదల.
.
మేతల ధరలు 2020 తర్వాత పెరుగుతూ వస్తున్నాయి. రైతులు 27 కంపెనీల మేతలు వాడుతున్నారు. 2021లో కిలో మేత రూ.60 ఉండగా 100 కౌంట్‌ రూ.240 కొంటుంటే దిగుబడి ఖర్చు రూ.270 అవుతోంది. తాజాగా కిలో రూ.93 పలుకుతున్నప్పుడు రొయ్యల ధర అదే విధంగా ఉండడం చూస్తే రైతుల పరిస్థితి గమనించవచ్చు. నాలుగు నెలలు కాలంలో కిలో ఆహారం రూ.20లకు పైగా పెంచారు. దీనికి కారణం సోయాబీన్స్‌ ధర పెరిగిందని ఫీడు కంపెనీ యాజమాన్యాలు ప్రకటించారు. ఇటీవల సోయా బీన్స్‌ ధర తగ్గిన రేట్లు మాత్రం ఆ స్థాయిలో తగ్గలేదు. దీనిపై గతనెలలో రైతు సంఘాల నాయకులు మత్స్యశాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలో తాజాగా కేవలం 2 శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం కంటితుడుపు చర్యగా వాపోతున్నా రు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రంగం ద్వారా కార్మిక రంగానికి ఉపాధిగా నెలకు 25 వందల కోట్లను వేతనాలుగా చెల్లిస్తున్నట్టు రైతుల గణాంకాలు వివరిస్తున్నాయి.  

పెట్టుబడులకు పొంతన లేదు..
 పెన్మెత్స సత్యప్రసాదరాజు, ఆక్వా రైతు, పెదఅమిరం, కాళ్ళ మండలం.
మేతలపై ప్రభుత్వం దృష్టికి వెళ్లకపోవడం వల్ల ప్రస్తుతం రైతులు ఎకరానికి పెట్టుబడులు పెట్టే ఖర్చు, వచ్చే ఆదాయానికి ఏ మాత్రం సరిపోవడం లేదు.   రాష్ట్ర ప్రభుత్వం 2 శాతం మేత ధరలు తగ్గిస్తూ ప్రకటించినా పెద్దగా మేలు  జరగదు. విద్యుత్‌ కోతలు, సడ్సిడీలపై దృష్టి పెడితే నష్టాలు తగ్గుతాయి.

మేతల విషయంలో  మాఫియా...

కోళ్ళ నాగేశ్వరరావు, ఆక్వా రైతు, రాయలం
2019 ఏఫ్రిల్‌లో ఫీడు టన్ను రూ.68వేలు ఉండేది. ఇప్పుడు 86 వేలకు పెరిగింది. మెడిసిన్‌ ధరలు రూ.50 వరకు పెరిగాయి. సీడు 24 పైసలు నుంచి 36 పైసలకు పెరిగింది. ఇవి నాణ్య త లేవు. మేతల విషయంలో కొందరు మాఫియాలా మారారు. 100 కౌంట్‌ కేజీ రూ.260 పలికే ధరను సిండికేట్‌ మాఫియా ప్రభుత్వ పెద్దలకు కావాల్సింది ఇస్తూ 180 – 200 మధ్య ధరను నియంత్రిస్తూ రైతును మోసం చేస్తున్నారు.

సాధారణ స్థితిలో (100 కౌంట్‌) కిలో రొయ్యల దిగుబడికయ్యే పెట్టుబడి..
చెరువు సిద్ధం    రూ.20
రొయ్యల పిల్లలు    రూ.40,
ఆహారం        రూ.135
భూమి లీజు    రూ.30
మినరల్స్‌, మెడిసిన్‌    రూ.15
సబ్సిడీ విద్యుత్‌    రూ.20
కూలీలు, నిర్వహణ    రూ.10
––––––––––––––––
మొత్తం        రూ.270
–––––––––––––––––––––––––––––––––––
 ప్రస్తుతం మార్కెట్‌లో 100 కౌంట్‌ రొయ్య ధర కిలోకు రూ.200–240. తాజాగా విద్యుత్‌ సబ్సిడీ రద్దుతో రూ.20 తగ్గించారు. ఇటీవల కిలో కు పెరిగిన మేత ధర రూ.2.40 పైసలు. మినరల్స్‌, మెడిసిన్స్‌ 20 శాతం పెంచారు.

Updated Date - 2022-05-22T05:49:13+05:30 IST