ఒక్క క్షణం..

ABN , First Publish Date - 2022-09-10T06:41:05+05:30 IST

ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో అధిక శాతం మంది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలే కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఒక్క క్షణం..

ఆలోచిస్తే చాలు.. కొత్త జీవితం
జీవితం ఒక వరం.. ఒత్తిడిని జయిద్దాం
ప్రతీ ఒక్కరికి సమస్యలున్నాయ్‌
వీటికి పరిష్కార మార్గాలూ ఉన్నాయ్‌
అవివేకంతో నిర్ణయాలు తీసుకోవద్దు
బలవన్మరణాలకు పాల్పడవద్దు
నేడు ఆత్మహత్యల నివారణ దినం


ఏలూరు క్రైం/భీమవరం క్రైం, సెప్టెంబరు 9 :
పేరు మామిళ్ల దుర్గారావు.. ఊరు కొండపల్లి, వయసు 35 ఏళ్లు.. గ్రామంలోని కొందరు దొంగ అంటూ ముద్ర వేశారు. అది తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గూట్ల సత్యానందం.. ఊరు ఆకివీడు.. వయసు 36 ఏళ్లు.. భార్యా పిల్లలపై బెంగతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఓ వైపు భర్త మరణం.. మరోవైపు అనారోగ్యంతో తీవ్ర ఒత్తిడికి గురై వెంకటాపురానికి చెందిన 27 ఏళ్ల పుష్పాంజలి, అత్తింటి వేధింపులు తాళలేక 22 ఏళ్ల శ్రీజ, కడుపునొప్పి తాళలేక 24 ఏళ్ల తేజ, తనతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో భర్త 30 ఏళ్ల లోవరాజు, భార్యతో గొడవ పడి.. భర్త 35 ఏళ్ల ఏసు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో నిత్యం  ఎవరో ఒకరు, ఎక్కడో ఒకచోట చిన్న చిన్న కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాము చనిపోతే సమస్య నుంచి శాశ్వతంగా పరిష్కరించు కోవచ్చని భావిస్తున్నారు.
ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో అధిక శాతం మంది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. కాలంతోపాటు మారుతున్న జీవన శైలి, ఆర్థిక ఎడబాటు పరిస్థితులను ఒక్కసారిగా తారుమారు చేస్తున్నాయి. ఒకప్పుడు సమస్య ఏర్పడితే కుటుంబసభ్యులు భరోసా కల్పించేవారు. నేడు  ఆ పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబాలు పోయి.. చిన్న కుటుంబాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో.. అప్పటి నుంచి ఎవరి సమస్య వారిదే..! మానసిక బలహీనతలు హెచ్చుమీరాయి. ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు కరువయ్యాయి. ఏలూరు జిల్లాలో 2021లో వివిధ కారణాలతో 260 మంది బలవన్మరణాలకు పాల్పడగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 140 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో కారణం. మానసిక,  శారీరక అనారోగ్యం, కుటుంబ కలహాలు, ఆర్థిక పరిస్థితులు, గృహహింస, చదువులో వెనుకబాటు, ప్రేమ వైఫల్యం ఇలా సమస్యలు ఎదురైనప్పుడు వీటి పరిష్కారాలను అన్వేషించడం కంటే శాశ్వత పరిష్కారం చావే అని నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఇక వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఎక్కువగా 15 నుంచి 40 ఏళ్ల వారే ఉంటున్నారు. చాలా ఆత్మహత్యలకు కారణం కడుపు నొప్పి అని పోలీసులు రికార్డులు చెబుతున్నా.. అసలు కారణం వేరే ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. గత నెలలో వీరవాసరం, తణుకులో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు క్షణికావేశంలో ఉరేసుకుని  ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉండి మండలం చిలుకూరు, పాలకోడేరు మండలం పెన్నాడలలో కట్నం కోసం వేధిస్తున్నారంటూ మరో ఇద్దరు వివాహితలు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

సమస్య వయసు చిన్నదే

ఎవరి సమస్య వారిది పెద్దదిగా కనిపించడం సహజమే. అయితే గోలీని కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. విశాల ప్రపంచంలో చిన్న సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఆత్మీయుల మోసం, పరీక్షల్లో పరాజయం, ర్యాంకు రాకపోవడం, ఆలోచనలేమి కార్యరూపంలోకి రాకపోవడం, ఉద్యోగం రాకపోవడం, దాంపత్యంలో వ్యథలు.. ఇలా ఏదైనా జీవితంపై విరక్తి కల్గించవచ్చు. ముందు వారు నా అనుకున్న వారితో మనసు విప్పి మాట్లాడాలి. వారి వద్ద తనివి తీరా ఏడ్వాలి. గుండెల్లో భారం దించేసుకోవాలి. వీరికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు జీవితంపై ఆశ కలిగించే మంచి స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పాలి. విజేతల గురించి మాట్లాడాలి. ఓడిపోయిన వారి అనుభవం ముందు అదేమంత పెద్దది కాదని వివరించాలి. ప్రతి విజేత ఓటమిని చవి చూసినవాడే. అందరినీ ప్రేమిస్తే మన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన చేసిన వారే. ఆ ఆలోచన ఎంత తప్పో వారికి తర్వాత కాలంలో వారు సాధించిన విజయాలు చూసి తెలిసి వచ్చింది.

ఆత్మ స్థైర్యం కావాలి
 –  దేవ్‌మనోహర్‌ కిరణ్‌, పీహెచ్‌సీ  డాక్టర్‌, చాటపర్రు
చాలా మంది ఆత్మస్ధైర్యం కోల్పోయి చిన్న చిన్న సమస్యలకు మనస్థాపానికి గురై క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటు న్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్య చేసుకోవద్దు. ప్రతి సమస్యకు  పరిష్కారం ఉంది. అవసరమైతే మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.

చిన్న కుటుంబాల వల్లే ఆత్మహత్యలు
– డాక్టర్‌ ఎం.వీరాస్వామి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌, భీమవరం
గతంలో పెద్ద కుటుంబాల వల్ల ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వారే సర్దిచెప్పి సరిచేసేవారు. ప్రస్తుతం చిన్న కుటుంబాలు కావడం, జీవితం మీద అవగాహన లేక క్షణికావేశంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. గతంలో పాఠ్య పుస్తకాల్లో జీవిత కథలు బోధించేవారు. ప్రస్తుతం అలాంటి పాఠాలు కనుమరుగవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చదువు, కుటుంబం, స్నేహితులతో ఎక్కువగా గడుపుతుండాలి.
 

సమస్యలకు చావు పరిష్కారం కాదు
ఏలూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 9 : ‘సమస్యలకు చావు పరిష్కా రం కాదు. ఇది అందమైన జీవితం. ఆశయంతో బతకాలి’ అని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సూచించారు. శుక్రవారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినాన్ని పురస్కరించుకుని, ప్రజలకు జీవితంపై నమ్మకాన్ని కల్పిద్దామన్న పోస్టర్లను ఎస్పీ తన కార్యాలయంలో ఏలూరు జిల్లా సైక్రియాట్రిక్‌ అసోసియేషన్‌ వైద్యులతో సంయుక్తంగా ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ దిగులు, బాధ, ఆవేదన ఆత్మహత్యలకు మూలకారణమన్నారు. ఆత్మహత్యలకు పాల్పడే వారు ఒక్క క్షణం ఆలోచించాలని, నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను జీవిత భాగస్వామి గురించి ఆలోచించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీతో పాటు అధికారులు, ఆశ్రం ఆసుపత్రి సైక్రియాట్రిక్‌ పోస్టుగ్రాడ్యుయేషన్‌ విద్యార్థులచే మానసిక వైద్యులు డాక్టర్‌ నాగభూషణం ప్రతిజ్ఞ చేయించారు. వైద్యులు హర్షియా, ఫిర్‌దోష్‌, అదనపు ఎస్పీ చక్రవర్తి, ఎఆర్‌ఆర్‌ అదనపు ఎస్పీ శేఖర్‌, డీటీసీ డీఎస్పీ కె.ప్రభాకరరావు, మానసిక వైద్యులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-10T06:41:05+05:30 IST