కోళ్ల దొంగకు దేహశుద్ధి.. చికిత్సపొందుతూ మృతి

ABN , First Publish Date - 2022-09-19T07:05:34+05:30 IST

కోళ్ళ దొంగతనానికి వచ్చిన వ్యక్తికి దేహశుద్ధి చేయడంతో తీవ్రగాయాలపాలై మృతిచెందిన సంఘటన నూజివీడు పట్టణంలో చోటుచేసుకుంది.

కోళ్ల దొంగకు దేహశుద్ధి.. చికిత్సపొందుతూ మృతి
అవినాష్‌ మృతదేహం

నూజివీడు టౌన్‌, సెప్టెంబరు 18: కోళ్ళ దొంగతనానికి వచ్చిన వ్యక్తికి దేహశుద్ధి చేయడంతో తీవ్రగాయాలపాలై మృతిచెందిన సంఘటన నూజివీడు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఎమ్మార్‌ అప్పారావు కాలనీలోని ఓ తోటను సయ్యద్‌ గయుద్దీన్‌ అనేవ్యక్తి కౌలుతీసుకుని అందులో నాటుకోళ్ళ పెంపకాన్ని చేపట్టాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు తోటలో కోళ్ళను దొంగతనం చేసేందుకు రాగా గయుద్దీన్‌, అలెగ్జాండర్‌ అనేవ్యక్తులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇద్దరు పరారీ కాగా, నూజివీడుకు చెందిన ఎల్‌.అవినాష్‌(20) అనేవ్యక్తి వారికి దొరకడంతో చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. నూజివీడు పోలీసులకు సమాచారం రాగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అవినాష్‌ తీవ్రగాయాలతో ఉండటంతో  పోలీసులు నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, పట్టణ సీఐ మూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Read more