టెన్త్‌ ప్రీ ఫైనల్‌ ప్రశ్నపత్రం లీక్‌..

ABN , First Publish Date - 2022-04-10T05:33:35+05:30 IST

టెన్త్‌ ప్రీఫైనల్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు సోషల్‌ మీడియాలో ముందుగానే లీక్‌ అవుతుండడంపై జిల్లా విద్యాశాఖ స్పందించింది.

టెన్త్‌ ప్రీ ఫైనల్‌ ప్రశ్నపత్రం లీక్‌..

స్పందించిన జిల్లా విద్యాశాఖ.. పోలీసులకు ఫిర్యాదు

విచారణ చేపట్టిన ఇంటెలిజెన్స్‌ విభాగం 


ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 9 : టెన్త్‌ ప్రీఫైనల్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు సోషల్‌ మీడియాలో ముందుగానే లీక్‌ అవుతుండడంపై జిల్లా విద్యాశాఖ స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోను సైబర్‌ క్రైం కింద పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇంటెలి జెన్స్‌ విభాగం పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా శుక్రవారం జరిగిన గణితం పరీక్ష ప్రశ్నపత్రం సోషల్‌ మీడియాలో గురువారమే వైరల్‌ కాగా, అసలు ప్రశ్నపత్రంతో అది సరిపోలినట్టు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. శనివారం జరిగిన ఫిజికల్‌ సైన్స్‌ ప్రశ్నపత్రం మాత్రం సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైన దానితో సంబంధంలేదని గుర్తించారు. ఆ మేరకు సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రశ్నపత్రాలను నమ్ముకున్న విద్యార్థులు మాత్రం శనివారం అవాక్కయ్యారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు ఎటువంటి వెయిటేజి, ప్రయోజనం లేకపోయినా భవిష్యత్తులో సోషల్‌ మీడియా నుంచి వచ్చే సవాళ్ళను, లీక్‌ వీరులను గుర్తించి చట్టప్రకారం వారిని శిక్షించేందుకే సైబర్‌ నేరం కింద పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

Read more