ఉలుకెందుకు సార్‌..!

ABN , First Publish Date - 2022-11-23T00:14:31+05:30 IST

తెలుగుదేశం, జనసేన పార్టీల పేరు మార్చేలా ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలు చేయడంపై ఆ రెండు పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి ‘‘మా పార్టీ జనం మధ్య దూసుకుపోతోంది. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపేందుకు అనువైన ప్రజాదరణ రాబట్టుకుం టున్నది. ప్రభుత్వ వ్యతిరేకతను నిగ్గు తేలుస్తోంది. అందుకే సీఎం జగన్‌కి ఈ ఉలికిపాటు.. కాకపోతే ప్రజామోదం కలిగిన పార్టీలను బూతుల పార్టీ, రౌడీసేన అంటూ మాట్లాడటమేంటి.. మీ పార్టీ బలహీనపడుతుందనేగా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు..’’ అంటూ టీడీపీ, జనసేన విరుచుకుపడుతున్నాయి.

ఉలుకెందుకు సార్‌..!
శిక్షణ తరగతుల్లో పాల్గొన్న టీడీపీ నేతలు

మా పార్టీలపై అక్కసు ఎందుకంటూ

టీడీపీ, జనసేన మండిపాటు

ఇదేం ఖర్మని మేమంటున్నది ఇందుకే కదా : టీడీపీ

రౌడీ సేన అంటారా : జనసేన ఆగ్రహం

అటో ఇటో తేల్చుకుంటామంటూ విపక్షాల దూకుడు

వైసీపీలోనూ తాజా కామెంట్లపై తికమక

మనకే నష్టమంటూ విశ్లేషణలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

తెలుగుదేశం, జనసేన పార్టీల పేరు మార్చేలా ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలు చేయడంపై ఆ రెండు పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి ‘‘మా పార్టీ జనం మధ్య దూసుకుపోతోంది. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపేందుకు అనువైన ప్రజాదరణ రాబట్టుకుం టున్నది. ప్రభుత్వ వ్యతిరేకతను నిగ్గు తేలుస్తోంది. అందుకే సీఎం జగన్‌కి ఈ ఉలికిపాటు.. కాకపోతే ప్రజామోదం కలిగిన పార్టీలను బూతుల పార్టీ, రౌడీసేన అంటూ మాట్లాడటమేంటి.. మీ పార్టీ బలహీనపడుతుందనేగా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు..’’ అంటూ టీడీపీ, జనసేన విరుచుకుపడుతున్నాయి. నరసాపురంలో సీఎం జగన్‌ చేసిన కామెంట్లు స్థానికంగా రాజకీయ పార్టీల్లో అగ్గి రాజేస్తున్నాయి తెలుగుదేశం ‘ఇదేం ఖర్మ’ పేరిట ఓ ప్రజాదరణ కార్యక్రమానికి నాంది పలికితే దానికి మరింత ప్రాచుర్యం కలిగించేలా సీఎం జగన్‌ జనం ముందు కామెంట్లు చేయడం, అంతకంటే మించి తమ పార్టీని కించపరిచేలా మాట్లాడటంపై టీడీపీ మండిపడుతోంది. మమ్మల్ని రౌడీసేన అంటారా అంటూ జనసేన ఆగ్రహంతో ఊగిపోతూనే బలమైన సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు ఈ కామెంట్లపై తలలూపటంతో దాని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. రాజకీయ చైతన్యానికి, సామాజిక వర్గాల సమీకరణలో ముందుండే పశ్చిమలో ఇప్పుడు రసవత్తర రాజకీయానికి అన్ని పార్టీలు పదునుపెడుతున్నాయి.

సరికొత్త వ్యూహంతో ప్రజల ముందుకు టీడీపీ..

తమ పార్టీని బూతుల పార్టీగా నరసాపురంలో జరిగిన సభలో సీఎం జగన్‌ అనడంపై తెలుగుదేశం తీవ్రస్థాయిలోనే విరుచుకుపడింది. ఇప్పటిదాకా చంద్రబాబు, పవన్‌లపై బహిరంగ వేదికలపై ఏదో కామెంట్‌ చేసే సీఎం జగన్‌ ఈసారి ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడం దుమారానికి దారితీస్తోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమలో రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించింది. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా టీడీపీ ప్రజా పోరాటాలకు నాంది పలికింది. దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ ఈ కార్యక్రమానికి ప్రజాదరణ లభించింది. ప్రత్యేకించి నాయకత్వలేమి ఎదుర్కొంటున్న చింతలపూడిలో కూడా ఎవరంతట వారుగా మండలాల్లో బాదుడే బాదుడును నిర్వహించారు. ఇదే క్రమంలో మిగతా నియోజకవర్గాల్లో లభించే అనూహ్య స్పందన అధికార పార్టీ వైసీపీని ఇరకాటాన పెట్టేసింది.ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలే నిలదీయ డానికి వెనుకంజ వేయడం లేదనే సంకేతాలు బాదుడే బాదుడు ద్వారా అందరికీ తెలిసేలా చేసిందని కాస్తంత సంతోషంతోనే ఉన్నారు. దీంతో ఈసారి గ్రామస్థాయిలో మరింత పట్టు సాధించేందుకు తెలుగుదేశం సరికొత్త వ్యూహం పన్నింది. వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేయడం, జగన్‌ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఘోరాలు నేరుగా జనాలకు వివరించడం, దీనికి వ్యతిరేకంగా ప్రజా మద్ధతు పొందడానికి వీలుగా ‘ఇదేం ఖర్మ..ఈ రాష్ర్టానికి’ పేరిట సరికొత్త జనామోద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలోనూ గుర్తించిన వారికి ప్రత్యేక శిక్షణను ఏలూరులో మంగళవారం నుంచి ఆరంభిం చింది. టీడీపీ సంకల్పించిన ‘ఇదేం ఖర్మ’ పేరిట సీఎం జగన్‌ పదేపదే నామస్మరణ చేయటం, ఒకవైపు టీడీపీని ఎద్దేవా చేస్తూనే మరోవైపు విమర్శలు ఎక్కుపెట్టారు.ఇది కూడా తెలుగుదేశంకు కొంత లాభించినట్టే భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఒక నినాదం పేరిట ప్రజాందోళనకు దిగుతున్నప్పుడు దానినే పదేపదే ప్రస్తావించి సీఎం పాపులర్‌ చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ నేరుగా ఉలిక్కి పడుతుందన డానికి ఇదే నిదర్శనమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

గడపగడపకు మార్కులు తగ్గాయా

ప్రజలతో ముఖాముఖి కలిసేందుకు వీలుగా వైసీపీ చేపట్టిన గడపగపడ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆశించినట్టుగా ప్రోగ్రెస్‌ మార్కులు సాధించలేకపోవటం వైసీపీలోనూ కొందరిని తికమకపెడుతోంది.వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఈ కార్యక్రమం ప్రోగ్రెస్‌ మీదే ఆధారపడి ఉందని తేల్చేశారు. ఉమ్మడి పశ్చిమలో రెండు నెలల క్రితం కాస్తంత కాలు కదపడానికి ఇష్టపడని వారంతా ఇప్పుడు నియోజకవర్గంలో గిరగిరా తిరుగుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో అంతర్గత అసంతృప్తి, పేరుకు పోయిన అనేక సమస్యలు ఉండగానే పూల జల్లు మధ్యే ఎమ్మెల్యేల యాత్ర సాగడం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. కాని సీఎం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా జనం మెడమీద కత్తి పెట్టి సమీకరణ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కాసేపు సభల్లో ఉండి ఆ తరువాత వెనుతిరుగుతూనే ఉన్నారు. సంక్షేమ పథకాలు చేజారతాయంటూ పరోక్షంగా హెచ్చరించి మరీ వీరందరినీ సభలకు రప్పిస్తున్నారు. అదే ప్రక్రియ గడపగడపలోనూ చూపెడుతున్నారు.

జనసేన సై అంటే సై

జనసేన.. రౌడీసేన అంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కేడర్‌ను రెచ్చగొట్టేలా ఉన్నాయి. జనసేన కేడర్‌ ఆవేశంతో ఊగిపోతోంది. ఇప్పటికే వైసీపీలో ఉన్న కాపు సీనియర్లను దీనిపైనే ప్రశ్నిస్తోంది. మేము రౌడీలమైతే మరి మీ మాటేంటి అంటూ నేరుగానే గళం విప్పటంతో వైసీపీ ఇరకాటంలో పడింది. జనసేన ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. నూజివీడు, కైకలూరు వంటి నియోజకవర్గాలకు కన్వీనర్లు లేకపోయినా ఉమ్మడి పశ్చిమలో బలమైన కేడర్‌ కలిగి ఉండటం తమ పార్టీకి అతి గొప్ప బలంగానే ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమను రెచ్చగట్టే విధంగా సీఎం జగన్‌ వ్యాఖ్యలు చేశారని, దీనికి తగ్గట్టుగానే వైసీపీలో కొందరు నేతలు సైతం తలలూ పారని, దీని పర్యావసానం వచ్చే ఎన్నికల్లో ఉంటుందంటూ నేరుగానే విరుచుకుపడుతున్నారు. జిల్లాలో మంగళవారం ఎక్కడికక్కడ పార్టీ నేతలు భేటీ అయ్యారు. తమ పార్టీపై రాళ్ళు విసిరేలా వ్యాఖ్యలు చేయటంపై భగ్గుమన్నారు. వచ్చే నెలలో జనసేనాని పవన్‌కళ్యాణ్‌ జిల్లా పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు భారీ జన సమీకరణతో తగు రీతిలోనే వైసీపీకి సమాధానం ఇవ్వాలని భావిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చినబాబు పార్టీ కేడర్‌ ఎక్కడా గీత దాటకుండా క్రమశిక్షణతో ముందుకు సాగేలా చూస్తున్నారు.

1 నుంచి ‘ఇదేం ఖర్మ’ ఈ రాష్ర్టానికి..

ఏలూరు టూటౌన్‌, నవంబరు 22:‘‘ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి వెళ్లి వివరించండి.. ప్రజల సమస్యలు తెలుసు కోండి. ప్రజా సమస్యలను టీడీపీ నెరవేరుస్తుందని భరోసా కల్పించండి’’ అని టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ నియో జకవర్గ కన్వీనర్‌ గన్ని వీరాంజనేయులు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పార్టీ కార్యకర్తలకు, నాయకులు దిశానిర్దేశం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యదర్శి పాలి ప్రసాద్‌ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం శిక్షణా తరగ తులు మంగళవారం జరిగాయి. గన్ని మాట్లాడుతూ డిసెం బరు 1వ తేదీ నుంచి ఇదేం ఖర్మ కార్యక్రమం ద్వారా నియో జకవర్గ, క్లస్టర్‌, డివిజన్‌ ఇన్‌చార్జిలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. అదే సమయంలో స్థానిక సమస్యలు తెలుసుకోవా లన్నారు. ప్రతీ నియోజకవర్గంలో రూ.30 వేల ఇళ్లను సందర్శించాలన్నారు. ప్రజల నుంచి విన్న సమస్యలను టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలన్నారు. దెందులూరు నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ చింత మనేని ప్రభాకర్‌, పోలవరం ఇన్‌చార్జి బొరగం శ్రీనివాస్‌, కైకలూరు ఇన్‌చార్జి జయమంగళ వెంకట రమణ, రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, డివిజన్‌ ఇన్‌ఛార్జిలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:14:31+05:30 IST

Read more