సూపర్‌స్టార్‌ గురుతులు

ABN , First Publish Date - 2022-11-16T01:09:29+05:30 IST

సూపర్‌స్టార్‌ కృష్ణ మృతితో ఆయన అభిమానులే కాక యావత్‌ తెలుగు ప్రజల హృదయాలు బరువెక్కాయి.

సూపర్‌స్టార్‌ గురుతులు
కలిదిండిలో సాక్షి సినిమా షూటింగ్‌ జరిగిన మీసాల కృష్ణుడి ఆలయం

అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్న పలువురు

సూపర్‌స్టార్‌ కృష్ణ మృతితో ఆయన అభిమానులే కాక యావత్‌ తెలుగు ప్రజల హృదయాలు బరువెక్కాయి. కార్డియాక్‌ అరెస్టుతో మంగళవారం తెల్లవారుజామున ఆయన హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో మృతి చెందిన విషయం విదితమే. తన నటనతో ఆకట్టుకోవడమే గాక పలు సందేశాత్మక చిత్రాలను సూపర్‌స్టార్‌ నిర్మించారు. పలు గ్రామాల్లో ఆయన షూటింగ్‌కు వచ్చిన సందర్భాన్ని గ్రామస్థులు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు.

ఆగిరిపల్లి, నవంబరు 15: సూపర్‌ స్టార్‌, నటశేఖర కృష్ణతో ఆగిరిపల్లి ప్రజలకు అనుబంధం ఉంది. ఆయన విజయనిర్మలతో కలసి నటించిన గాలి పటాలు చిత్ర నిర్మాణం ఎక్కువభాగం ఆగిరిపల్లిలోనే జరిగింది. అప్పట్లో షూటింగ్‌ కోసం వచ్చిన వీరిని చూసేందుకు చుట్టపక్కల నుంచి ఎంతో మంది వచ్చారని నాటి తరం వారు చెబుతున్నారు. చిత్రంలో కృష్ణ, విజయనిర్మల పాల్గొన్న సన్నివేశాలను, పాటలను ఆగిరిపల్లి శోభనాచలస్వామి సన్నిధిలో, పెద్దకొఠాయిలో, పూలతోటలో, వరాహ పుష్కరిణి వద్ద షూట్‌ చేసిన సందర్భం గా కృష్ణ నెలరోజులకు పైగా గ్రామంలో గడిపారని గుర్తు చేసుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

మీసాల కృష్ణుడి గుడిలో సాక్షి చిత్రం షూటింగ్‌

కలిదిండి, నవంబరు 15: సూపర్‌ స్టార్‌ కృష్ణ, విజయ నిర్మల హీరో హీరోయిన్లుగా నటించిన ‘సాక్షి’ సినిమా షూటింగ్‌ 1950లో కలిదిండిలోని మీసాల కృష్ణుడి ఆలయంలో జరిగిందని అర్చక స్వామి సీతారామచార్యులు తెలిపారు. చిత్రంలో హీరో హీరోయిన్ల పెళ్లి సన్నివేశం ఈ ఆలయంలోనే చిత్రీకరించారు. ఈ పెళ్లి సన్నివేశంలో హాస్యనటుడు రాజబాబు తన బాణీలో మాట్లాడుతూ సాధారణంగా కృష్ణుడికి మీసాలు ఉండవని, కలిదిండి ఆలయంలో కృష్ణుడికి మీసాలు ఉన్నాయి కాబట్టి ఈ గుడిలో జరిగిన మీ ఇద్దరి పెళ్లి నిజ జీవితంలో పెళ్లి చేసుకుని భార్యభర్తలవుతారని పలు ఇంటర్వ్యూల్లో విజయనిర్మల ప్రస్తావించారని అర్చక స్వామి తెలిపారు. ప్రస్తుతం కలిదిండిలో ఉన్న ఆలయాన్ని మీసాల వేణు గోపాలస్వామి ఆలయంగా పిలుస్తున్నారు. కృష్ణ మృతితో కలిదిండి ప్రజలు ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు.

సంతాపాలు..

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. టీడీపీ మం డల అధ్యక్షుడు పోకల జోగిరాజు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ వల్లభనేని శ్రీనివాస్‌ చౌదరి, మాజీ జడ్పీటీసీ నున్న రమాదేవి, భగవాన్లు, కేశిరెడ్డి బలరా మ్‌, చెన్నంశెట్టి మురళీకృష్ణ వలవల రమేష్‌ సంతాపం తెలిపారు. కోరుకొల్లులో అభిమానులు కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ముదినేపల్లి: సినీ హీరో కృష్ణ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. దర్జా చిత్ర నిర్మాత పైడిపాటి శివశంకర్‌, బీజేపీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణారావు, పీసీసీ సభ్యుడు మంగినేని బాబ్జి, జనసేన నాయకుడు వర్రె హనుమాన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ వెండి తెరకు కళ తెచ్చిన నటుడు కృష్ణ అని, ఆయన పోషించిన పాత్రలు మరువలేనివని అన్నారు.

Updated Date - 2022-11-16T01:09:29+05:30 IST

Read more