బీచ్‌లో అనధికార నిర్మాణాలు తొలగించాం

ABN , First Publish Date - 2022-12-12T00:02:03+05:30 IST

ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకే పేరుపాలెం బీచ్‌లో అనధికార నిర్మాణాలు తొలగించామని సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజ స్పష్టం చేశారు.

బీచ్‌లో అనధికార నిర్మాణాలు తొలగించాం
విలేకరులతో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజ

ప్రభుత్వ భూములు పరిరక్షించేందుకే : సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజ

నరసాపురం/మొగల్తూరు, డిసెంబరు 11 : ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకే పేరుపాలెం బీచ్‌లో అనధికార నిర్మాణాలు తొలగించామని సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజ స్పష్టం చేశారు. ఆదివారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సముద్రానికి 200 మీటర్ల వరకు సీఆర్‌జడ్‌ పరిధితో పాటు అన్‌సర్వేడ్‌, ప్రభుత్వ భూమి కిందకు వర్తిస్తుందన్నారు. ఇటువంటి ప్రాంతంలో ఎటువంటి నిర్మాణం చేపట్టకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కొంతమంది పక్కా నిర్మాణాలు చేపట్టారన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని బీచ్‌లో నిర్మాణాలు తొలగించామని, అనంతరం ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించిందేనని తెలుపుతూ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. తొలగింపులో ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదన్నారు. కొంతమందికి సమయం ఇచ్చి వాటిని పూర్తిగా తీసుకున్న తరువాతే గోడలను ధ్వంసం చేశామన్నారు. రానున్న రోజుల్లో బీచ్‌లో మళ్లీ ఆక్రమణలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడతామన్నారు.

ప్రసాదరాజుపై విమర్శలు అర్ధరహితం..

స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ముదునూరి ప్రసాదరాజుపై మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మిడి నాయకర్‌ చేస్తున్న విమర్శలు అర్ధరహితమని వైసీపీ మండల నాయకులు ఖండించారు. మొగల్తూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకుడు అందే భుజంగరావు, సొసైటీ చైర్మన్‌ మోటుపల్లి రామభాస్కరరావు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ కటికల సూర్యారావు తదితరులు మాట్లాడారు. తీరంలో పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు అద్దె వసూలు చేసేందుకు నిర్మించిన అద్దె గదుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని అధికారులుకు ఫిర్యాదులు అందాయన్నారు. అధికారుల ఆదేశాల మేరకే శాశ్వత కట్టడాలు తొలగింపులో ఇదొక అంశమన్నారు.

దుకాణాల తొలగింపుపై విమర్శలు..

తీరం వెంబడి డబుల్‌ రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక తాత్కాలిక పాకలు వేసుకుని వర్తకులు వ్యాపారాలు కొనసాగించవచ్చని వైసీపీ నాయకులు వివరించారు. పొంతన లేని ఈ వివరణతో మీడియా ప్రతినిధులు, స్థానికులు ఖంగుతిన్నారు. సీఆర్‌జడ్‌ పరిధిలో కేపీపాలెం, పేరుపాలెం సౌత్‌ గ్రామాల పరిధిలో రెండు ప్రభుత్వం అతిథిగృహలు, కోటి రూపాయలతో మత్స్యనారా యణస్వామి ఆలయాలు ప్రభుత్వం శాశ్వత కట్టడాలుగా ఎందుకు నిర్మించిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేవాలయాల పరిస్థితి ఎలా ఉన్నా శాశ్వత కట్టడాలుగా ఉన్న ప్రభుత్వ అతిఽథి గృహాలను శనివారం అధికారులు ఎందుకు తొలగించలేదని జీవనభృతి పొందేవారి దుకాణాలు మాత్రమే కనీస సమయం ఇవ్వకుండా తొలగించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.

Updated Date - 2022-12-12T00:02:03+05:30 IST

Read more