నిమిషం ఆలస్యమైతే..?
ABN , First Publish Date - 2022-08-16T06:44:02+05:30 IST
టీచర్లపై ముప్పేటదాడికి విద్యాశాఖ సిద్ధమైంది.

ఉపాధ్యాయులపై ఒత్తిడి కత్తి
నేటి నుంచే టీచర్లకు ఆన్లైన్ హాజరు
ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే హెచ్‌ఎంలపై చర్యలు
పలు స్కూళ్లలో వెంటాడుతున్న నెట్వర్క్ సమస్య
సిమ్స్–ఏపీ యాప్‌పై ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన
ఏలూరు ఎడ్యుకేషన్, ఆగస్టు 15 : టీచర్లపై ముప్పేటదాడికి విద్యాశాఖ సిద్ధమైంది.ఇప్పటికే సచివాలయ సిబ్బందితో పాఠశాలల్లో సమస్యలు, పర్యవేక్షణ పేరిట పెత్తనం చేయిస్తోన్న విద్యాశాఖ, ఇప్పుడు మరిన్ని చర్యలతో ఇబ్బందులు పెట్టడానికి పట్టుదలతో వున్నట్టు ఉపాధ్యాయవర్గాల్లో భయాందోళనలు వ్యక్తమ వుతున్నాయి. పలు యాప్‌లతో సతమవుతోన్న ఉపాధ్యాయులు తాజాగా ఇంటి గ్రేటెడ్ అటెండెన్స్ మొబైల్ అప్లికేషన్ యాప్ (సిమ్స్–ఏపీ)తో ఒకింత ఒత్తిడికి లోనవడం ఖాయమని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బయోమెట్రిక్ విధా నంలో ఉపాద్యాయులు హాజరును నమోదు చేస్తుండగా, దానిస్థానంలో ఇంటి గ్రేటెడ్ అటెండెన్సు నమోదు పద్ధతిని మంగళవారం నుంచే అమల్లోకి తెస్తు న్నారు. నూతన విధానంలో టీచర్లు, విద్యార్థుల హాజరునమోదుపై మార్గ దర్శకాలను వెలువరించారు. ఆ ప్రకారం ఉపాధ్యాయులు ఇకమీదట స్కూలు పని దినాల్లో ఉదయం 9 గంటలకల్లా ఖచ్చితంగా నిర్ణీతయాప్లో హాజరు వేయాల్సిందే. గ్రేస్ పీరియడ్ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిర్ధేశిత సమ యానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అంటే ఉదయం 9.01 గంటలకు వచ్చినా ఆ యాప్ పనిచేయదు. అందులో హాజరునమోదు సాధ్యం కాదు. ఆప్రకారం సంబంధిత ఉపాధ్యాయుడు ఈఎల్ (క్యాజువల్ లీవు) తీసుకు న్నట్టుగా పరిగణిస్తారని చెబుతున్నారు. ఇంతకు ముందు గరిష్టంగా అరగంట వరకు గ్రేస్ పీరియడ్ ఉండేది. ఈ వెసులుబాటు ఇకమీదట ఉండదు. అలాగే సెలవుల విషయంలోను కఠినతరం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా లీవ్ మేనేజి మెంట్ మాడ్యూల్‌ను అభివృద్ధి చేశారు. సెలవుకోసం ఉపాధ్యాయులు ఖచ్చి తంగా దీనినుంచే తమ డీడీవోలకు దరఖాస్తు చేయడం, వారినుంచి ఆమోదం లేదా తిరస్కరణ వంటివి జరిగేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల హాజరు కూడా ఈ యాప్‌లోనే నమోదు చేసేలా వెసులుబాటు కల్పించారు. ఉదయం 10 గంటలకల్లా విద్యార్థుల హాజరు నమోదుచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే టీచర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకమీదట మాన్యువల్ హాజరును వేయ రాదని స్పష్టం చేశారు. నూతన జిల్లాలో మొత్తం 10,860 మంది వర్కింగ్ టీచర్లు ఉండగా, సోమవారం నాటికి దాదాపు 6 వేల మందికిపైగా సిమ్స్–ఏపీ యాప్‌లో రిజిస్టర్ అయినట్టుగా జిల్లావిద్యాశాఖకు సమాచారం అందింది.
పాఠశాలల్లో కంప్లెయింట్ బాక్స్‌లు
పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్లయింట్ బాక్సులను కొద్దిరోజుల్లోనే అమర్చనున్నారు. విద్యార్థులు తమ ఇబ్బందులను టీచర్ల సమక్షంలో చెప్పేం దుకు భయపడుతున్నట్టు కొందరు తల్లితండ్రులు స్పందనలోను, రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఫిర్యాదుపెట్టెల ఏర్పాటు చేయనున్నారు.ఇప్పటివరకు కొన్ని పాఠశాలల్లో అట్టపెట్టెలను ఫిర్యాదు పెట్టెలుగా వినియోగిస్తుండటం వాటిని సంబంధిత స్కూలు హెచ్ఎంలే తెరిచి చూడటం వల్ల ఫలితం ఉండటం లేదని అధికారులు గుర్తించారు. తాజాగా ఏర్పాటుచేస్తున్న ఫిర్యాదుపెట్టెలను ఐరన్, అల్యూమినియం లోహంతో తయారు చేయిస్తున్నారు. ఇకమీదట ఈ ఫిర్యాదు పెట్టెల్లో విద్యా ర్థులు, వారి తల్లితండ్రులు, ఇతరులు వేసే ఫిర్యాదులను సంబంధిత సచి వాలయ మహిళా పోలీసు వారానికోసారి తెరిచి, అందిన ఫిర్యాదులను నేరుగా ఎంఈవోకు పంపిస్తారు. వాటి పరిష్కారానికి ఎంఈవో స్కూల్ హెచ్ఎం ద్వారా చర్యలు తీసుకుంటారు. ఈ ఫిర్యాదు పెట్టెల నిమిత్తం ఒక్కో స్కూలు నుంచి రూ.400 నేరుగా పెట్టెల తయారీదారు బ్యాంకు ఖాతాకు జమయ్యేలా చర్యలు తీసుకున్నారు.
వ్యతిరేక వార్తలు వస్తే హెచ్‌ఎందే బాధ్యత
ఇటీవల కాలంలో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తున్న నేపథ్యంలో నియం త్రించే చర్యలను విద్యాశాఖ చేపట్టింది. ఈ క్రమంలో పాఠశాలల్లో నేలపై విద్యార్థులు కూర్చున్న ఫొటో పత్రికల్లో రావడం, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే సంబంధిత స్కూలు హెచ్ఎంలనే బాధ్యులుగా చేయడంతో పాటు అవసరమైతే సస్పెండ్ కూడా చేస్తామని జిల్లావిద్యాశాఖ హెచ్చరించింది.
పలు స్కూళ్లలో నో నెట్వర్క్
జిల్లాలో పలు స్కూళ్ల పరిధిలో ఇంటర్నెట్ పనిచేయడం లేదని ఉపాధ్యా యులే చెబుతున్నారు. జిల్లాకేంద్రం ఏలూరుకు సమీపంలోనే వున్న పెదవేగి మండలంలోని ఓ మారుమూల గ్రామంలోని స్కూలు పరిధిలో సిగ్నల్స్ అం దడం లేదని గుర్తుచేస్తున్నారు. ఇక ఏజెన్సీ మండలాలైన కుక్కునూరు, వేలేరు పాడు, పోలవరం మండలాల్లోని సుమారు 15 పాఠశాలలకు పైగా ఇప్పటికీ ఇంటర్నెట్ పనిచేయని విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కొన్ని పాఠశాలలైతే కొండ ప్రాంతాల్లో వున్నందున నెట్సిగ్నల్స్ అందే అవకాశం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా కేటగిరి–3లో వున్న మారుమూల ప్రాంత పాఠశాలల్లోని ఉపాధ్యా యులు సిమ్స్–ఏపీ యాప్‌లో హాజరు నమోదు ఇబ్బందేనంటున్నారు.
ప్రభుత్వమే పాఠశాలల్లో డివైజ్‌లు ఏర్పాటు చేయాలి
ఈనెల 16 నుంచి మొబైల్‌ఫోన్ ద్వారా ఉపాధ్యాయులు ఫేస్ సెల్ఫీలతో ఆన్లైన్ హాజరును నమోదు చేయాలన్న నిర్ణయంపై విద్యాశాఖ సముచిత నిర్ణయం తీసుకోవాలని ఏపీటీఎఫ్–1938 జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంబాబు, కృష్ణ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఆన్లైన్ హాజరును స్వాగతిస్తున్నామని అయితే అందుకు అవసరమైన నాణ్యమైన డివైజ్‌లను, ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరారు. నెట్ సౌకర్యం లేనిచోట, సర్వర్ సమస్యలు, ఆండ్రాయిడ్ ఫోన్లులేని ఉపాధ్యా యులు ఆన్లైన్ హాజరును ఎలా నమోదు చేస్తారని ప్రశ్నిం చారు. దీనిపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యమించిక తప్పదని హెచ్చరించారు.