బడి.. బహుదూరం
ABN , First Publish Date - 2022-07-06T06:16:04+05:30 IST
పాఠశాలల విలీనం, విద్యార్థుల తర లింపులపై నోడల్ ఆఫీసర్, ఏలూరు జిల్లా డీఈవో ఆర్ఎస్ గంగాభవాని మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

మరో 4,880 మంది బాలలకు కష్టాలే
యూపీ స్కూళ్ళలో 6,7,8 చదువుతున్న పిల్లలకు మూడు కిలోమీటర్ల భారం
విద్యార్థుల తరలింపు, పాఠశాలల విలీనంపై విద్యా శాఖ ఉత్తర్వులు జారీ
మొత్తం 16,981 మందికి స్కూళ్లు చాలా దూరం
ఆరంచెల పాఠశాలల విధానం తాజాగా మరికొందరు విద్యార్థులకు కష్టాలు తెచ్చి పెట్టింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల బాల బాలికలను కిలోమీటరు దూరంలోని హైస్కూళ్లకు తరలించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ పరిధిని ఏకంగా మూడు కిలోమీటర్లకు పెంచి ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతులు చదువుతున్న విద్యార్థులపై కూడా దూరాభారాన్ని మోపింది. ఉమ్మడి జిల్లాలో 43 ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతులు చదువుతున్న 4,880 మంది విద్యార్థులను మూడు కిలోమీటర్ల దూరంలోవున్న 29 హైస్కూళ్లలోకి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏలూరు ఎడ్యుకేషన్, జూలై 5 : పాఠశాలల విలీనం, విద్యార్థుల తర లింపులపై నోడల్ ఆఫీసర్, ఏలూరు జిల్లా డీఈవో ఆర్ఎస్ గంగాభవాని మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 208 ప్రాథ మిక పాఠశాలల్లో 3,4,5 తరగతులు చదువుతున్న బాల బాలికలను 123 హైస్కూ ళ్లలోకి, మరో 60 ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతులు చదువు తున్న విద్యార్థులను 48 ప్రాథమికోన్నత పాఠ శాలల్లోకి కలిపి మొత్తం 12,101 మంది బడికి వెళ్లడానికి కిలోమీటరు దూరాన్ని నిర్ధేశించిన విషయం విధితమే. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో తాజా తరలింపుతో 16,981 మంది విద్యార్థులు ఇకమీదట స్థానికంగావున్న పాఠశాలలను వదిలి ఇతర ప్రాంతాల్లోని కొత్త పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ మేరకు సంబంధిత తరలింపు విద్యార్థుల హాజరు, ఇతర రికార్డులను విలీన హైస్కూళ్ల హెచ్ఎంలకు అప్పగించాలని ఉత్తర్వుల్లో డీఈవో ఆదేశించారు.
మిగులు టీచర్లలో..
మ్యాపింగ్ చేసిన పాఠ శాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని 1:30గా లెక్కించి మిగులు (సర్ ప్లస్) టీచర్లుగా గుర్తించిన వారిలో సీనియర్లను వారి విద్యార్హతల ఆధారంగా విలీన హైస్కూళ్లకు తాత్కాలికంగా డిప్యూ టేషన్లపై నియమిం చాలని డీఈవో ఆదేశించారు. ఈ బాధ్యతలను ఎంఈవో లకు అప్పగించారు. జిల్లాలో సుమారు 225 మంది ఎస్జీటీలు హైస్కూ ళ్లకు డిప్యూటేషన్లపై వెళ్లే అవకాశం ఉంది. కాగా హేతుబద్ధీకరణ ఉత్తర్వుల జీవో 117ను ఎటువంటి సవరణలు లేకుండా యధాతథంగా అమలు చేస్తే ఉమ్మడి జిల్లాలో దాదాపు 1,567 టీచరు పోస్టులు (ప్రస్తుతం వేకెన్సీలు) రద్దయ్యే ప్రమాదం ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ
జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలు.. 10,049 మంది విద్యార్థులు
భీమవరం ఎడ్యుకేషన్, జూలై 5 : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 10,049 మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఉదయం 8:30 గంట లకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని డీఈవో వెంకటరమణ సూచించారు. ఈ నెల 15వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు సంబంధించిన ఫిర్యాదులు చేయాలంటే భీమవరంలో ఎస్ఎస్సీ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఫోన్ నెంబరు 90147 54354కు సంప్రదించాలని డీఈవో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన టెన్త్ పరీక్షల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 47,038 మంది బాల బాలికలు హాజరు కాగా, వీరిలో 27,072 మంది (57.55 శాతం)మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల నుంచి మొత్తం 31,254 మంది విద్యార్థులు హాజరు కాగా కేవలం 13,274 మంది పాస్ కా గా, 17,980 మంది ఫెయిల్ అయ్యారు. అత్యధికులు గణితం, సైన్సు, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫెయిలైన విద్యార్థులకు సంబంధిత సబ్జెక్టు టీచర్లతో ప్రత్యేక శిక్షణా తరగతులను మంగళవారం వరకు నిర్వహించారు.
విద్యార్థులకు ఉచిత ప్రయాణం
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ పాస్లు ఇస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి ఎ.వీరయ్యచౌదరి తెలిపారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు పరీక్ష హాల్ టికెట్ చూపించి, తమ ఇంటి నుంచి ఎగ్జామినేషన్ సెంటర్కు వరకు బస్సులో ఉచితంగా వెళ్లి రావచ్చునని చెప్పారు.