తగ్గుతున్న సంక్రాంతి శోభ
ABN , First Publish Date - 2022-01-13T05:39:56+05:30 IST
తెలుగు పండుగలలో సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది.
జూద క్రీడలకు పెరిగిన ప్రాధాన్యం
ఊరూవాడా కోడి పందేలు, పేకాట, గుండాటలకు సన్నద్ధం
పెంటపాడు, జనవరి 12: తెలుగు పండుగలలో సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండుగ సమీపిస్తుందంటే నెల రోజుల ముందు నుంచే గ్రామాలలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. హరిదాసుల కీర్తనలు, గంగిరెడ్ల నృత్యాలు, బుడబుక్కల వేషధారుల విన్యాసాలు, ఇంట ముంగిట గొబ్బిమ్మల సందడి, గ్రామాలలో పల్లకీలపై గోదామాత అమ్మవార్ల గ్రామోత్సవాలు, ఇళ్ళ ముంగిట ఆడపడుచులు పోటీలు పడు తూ వేసే రకరకాల ముగ్గులు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజెప్పేవి. కానీ తరాలు మారుతున్నకొద్దీ సంక్రాంతి పండుగ సోభ తగ్గుతూ వస్తున్నది. అక్కడక్కడ మాత్రమే హరిదాసు కీర్తనలు, గంగిరెడ్లు, బుడబ్కుల వేషధారణాలు తారస పడుతున్నాయి. ఊరూ రా నడిచే ఓపిక లేక కొంత మంది హరిదాసులు మోటర్‌సైకిళ్ళ పై గ్రామాలలో పర్యటిస్తున్నారు.
మార్కెట్లో భోగి పిడకలు
తణుకు, జనవరి 12: సంక్రాంతి కోసం నెల ముందు నుంచి ప్రతి ఇంట్లో భోగి పిడకలు తయారు చేసేవారు. ఇంటి పరిసరాల్లోని గోడలు, చెట్లు, ఖాళీ స్థలాల్లో పిడకలు వేసి భోగి పండుగ నాటికి సిద్ధం చేసేవారు. భోగి పండుగ రోజున తెల్లవారు జామున వీఽధుల్లో వేసిన భోగి మంటలో పిడకలు వేసి సందడి చేసేవారు. ప్రస్తుతం ఎక్కడా పిడకలు చేస్తున్న పరిస్థితి లేదు. అన్నీ రెడీమేడ్‌గా మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. వంద పిడకలు వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. మరికొంత మంది ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నారు.
కాళ్లు దువ్వుతున్న పందెం కోళ్లు
గణపవరం: సంక్రాంతి బరికి సై అంటూ పందెం కోళ్ళు కాళ్ళు దువ్వుతున్నాయి. పలు గ్రామాల్లో కోడిపందేల కోసం రహస్యంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. పందెం పుంజులను సిద్ధం చేస్తున్నారు. పందేలు నిర్వహించేందుకు వీలు లేదంటూ పోలీసులు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఏటా పందేలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈసారి కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్ళతో సంక్రాంతి పండుగ మూడు రోజులు పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తారని పందేల నిర్వాహకులు భావిస్తున్నారు.
