వడ్డనకు రెడీ

ABN , First Publish Date - 2022-12-13T01:15:48+05:30 IST

నాలుగు నెలలకోసారి జరగాల్సిన ఏలూరు నగర పాలక సంస్థ సమావేశం ఏడాది వెనక్కి వెళ్లింది. ప్రజాకర్షక అంశాల తో నిండాల్సిన అజెండా వసూళ్ల జాబితాకు చిరునామాగా తయా రైంది.

వడ్డనకు రెడీ

చాలా కాలం తర్వాత మీటింగ్‌.. మునిసిపల్‌ చట్టాల నిబంధనలకు తిలోదకాలు

65 అంశాలతో భారీ అజెండా

కార్పొరేటర్లు, మేయర్‌ జీతం పెంపుదల !

ప్లాస్టిక్‌ నిషేధం పాటించకుంటే వడ్డనే..

విలీన గ్రామాల్లో యూజీడీ, ఇంటి పన్నుల వసూళ్లు

కార్పొరేషన్‌ ఆధారంగా ఇంటి నెంబర్ల మార్పు

నాలుగు నెలలకోసారి జరగాల్సిన ఏలూరు నగర పాలక సంస్థ సమావేశం ఏడాది వెనక్కి వెళ్లింది. ప్రజాకర్షక అంశాల తో నిండాల్సిన అజెండా వసూళ్ల జాబితాకు చిరునామాగా తయా రైంది. పాలవర్గం సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ కౌన్సిల్లో అడుగు పెడుతోంది. 2021 డిసెంబర్‌ తర్వా త బడ్జెట్‌, అత్యవసర సమావేశాలు పెట్టినా తూతూ మంత్రంగా ముగిం చారే తప్ప ప్రజారంజక కార్యక్రమాల కు తావివ్వలేదు. ప్రజోపయోగ అంశాలస్థానే సొంత వ్యవహారాలకే పాలక వర్గం పెద్ద పీట వేసింది.

కార్పొరేటర్లకు జీతాలు పెంచుకోవడం, ప్లాస్టిక్‌ నిషేధం పేరిట జరిమానాల విధింపు, విలీన గ్రామాల్లో ఇంటి పన్నులు, యూజీడీ చార్జీల విధింపు అంటూ వరుసగా వసూళ్ల పర్వానికే కార్పొరేషన్‌ అధికార వర్గాలు మొగ్గు చూపుతున్నాయి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

పేరుకు 47 మంది కార్పొరేటర్లతో అవసరానికి మించి బలమున్నా అధికార వైసీపీ పాలక వర్గం ఏడాదికోసారి మాత్రమే కౌన్సిల్‌ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉంది. ఉన్నది ముగ్గురే అయినా ప్రతిపక్షం, ప్రజాపక్షాన సమస్యలను ఏకరువు పెట్టడంలో టీడీపీ కార్పొరేటర్లు వెనక్కి తగ్గడంలేదు. అత్యధిక బలం ఉన్నా కార్పొరేటర్ల అభిప్రాయాలను కౌన్సిల్‌ సమక్షంలో ప్రతిబింబించడానికి మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ చొరవ తీసుకోవడం లేదని ఈ నిర్ణయాల ద్వారా తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ 1955 మునిసిపల్‌ చట్టం నిబంధనల రీత్యా ఒక్కో కౌన్సిల్‌ సమావేశాన్ని ప్రతీ 3–4 నెలలకోసారి చొప్పున ఏడాదిలో కనీసం మూడుసార్లు నిర్వహించాలి. ప్రత్యేక సందర్భంలో మాత్రమే కౌన్సిల్‌ లేదా స్టాండింగ్‌ కమిటీ సమావేశాలను నిలిపి వేయాలే తప్ప ఇష్టారాజ్యంగా చేయడం అనేది ఉల్లంఘనే. ఈ క్రమంలో 2021 డిసెంబర్‌ తర్వాత బడ్జెట్‌ సమావేశం, అత్యవసర సమావేశం పేరిట రెండుసార్లు సమావేశాలను పెట్టి మమ అని పించారు. కానీ, సర్వసభ్య సమావేశ నిర్వహణ కు మాత్రం ఏడాదిగా ముహూర్తం కుదరని క్రమంలో 2022 డిసెంబర్లో మరోసారి కౌన్సిల్‌ మీటింగ్‌ పెట్టబోతున్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతూ కౌన్సిల్‌ హాల్లో సమస్య అనే పేరు వినబడకుం డా చేయాలన్న వ్యూహంలో భాగంగానే ఏలూరు కార్పొరేషన్‌ పాలక వర్గం ఈ తరహా విధి విధానాలకు తెరతీస్తోంది. 65 అంశాలతో కూడిన భారీ అజెండాను రూపొందించారు.

ఒక్కొక్కరికి రూ.21 వేలు

ఏలూరు కార్పొరేషన్లో పేద కార్పొరేటర్లు అధికంగా ఉన్నారనో లేదా మరేదైనా కారణమో తెలీదు. కానీ, ఉన్నట్లుండి కార్పొరేటర్ల జీతాలపై పాలక వర్గం గురిపెట్టింది. గత ప్రభుత్వాలు ప్రకటించిన జీతాలు చాలవని సూచిస్తూ, కొత్త పాలక వర్గం మరో రూ.15 వేలు పెంచి మరీ జీతాలు ఇచ్చేందుకు కార్యరంగం సిద్ధం చేస్తోంది. ఈ అంశాన్ని అజెండాలో పొందుపరుస్తూ జరగబోయే సమావేశం ద్వారా ఆమోదం పొందబోతోంది. తద్వారా ఇక నుంచి ఒక్కో కార్పొరేటర్‌ నెలకు రూ.21 వేలను గౌరవ వేతనంగా కార్పొరేషన్‌ నుంచి డ్రా చేయబోతున్నారు. గత ప్రభుత్వ హయాం(2016)లో కార్పొరేటర్‌కు రూ.6 వేలు, మేయర్‌కు రూ.10 వేలు అని నిర్ణయించారు. కానీ, ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని మారుస్తూ ప్రస్తుత వేతనంపై రూ. 15 వేలను పెంచుతూ నేడు జరగబోయే సమా వేశం ద్వారా పాలకవర్గ సభ్యులు తమ జీతా లను పెంచుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి, తీర్మానం చేయాల్సిందిగా కౌన్సిల్‌ ద్వారా ఆమోదం పొందబోతున్నారు.

ఇవి కాకుండా కమర్షియల్‌ డొనేషన్ల కింద గ్రూపు హౌస్‌ లేదా అపార్ట్‌మెంట్లకు ఒక్కో ప్లాటుకు రూ.5 వేలు, బి.షాపులు, కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, స్కూళ్లు, హాస్పిటళ్లు, ఇండస్ర్టీస్‌ మొదలైన వాటికి 1/2 సైజ్‌ – 30 వేలు, 3/4 సైజ్‌ రూ.50 వేలు, 1 సైజ్‌ రూ.70 వేలను ప్రతిపాదిత టారిఫ్‌ రేట్లను నిర్ణయిస్తూ కౌన్సిల్‌ ఆమోదం కోరుతున్నారు.

ప్లాస్టిక్‌పై జరిమానాలు

ప్లాస్టిక్‌ వ్యర్థాలను విరివిగా ఉపయోగించడం వల్ల, రోడ్లు, డ్రైన్లలో పారేయడం వల్ల మైనర్‌ మొదలు మేజర్‌ డ్రెయిన్ల కదలిక ప్రశ్నార్థకంగా మారుతోంది. పైగా డంపింగ్‌ యార్డుకు తరలించడంలోనూ నిత్యం కష్టతరమవుతోంది. ఈ క్రమంలో అమల్లోకి వచ్చిన ప్లాస్టిక్‌ నిషేధాజ్ఞలను నగరంలో ఎక్కడా సీరియస్‌గా అమలు చేయడం లేదు. దీంతో ఏలూరు కార్పొరేషన్‌ అధికారులు జరిమానాల వడ్డింపులకు రంగం సిద్ధం చేశారు. అమలు చేయని వారిలో రీటైల్‌ అండ్‌ హోల్‌సేల్‌ వ్యాపార సంస్థలకు రూ.2,500–రూ.5 వేల వరకు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే వారికి రూ.250–500 వరకు జరిమానాలు విధించబోతున్నారు. 2016 సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనల ప్రకారం గతంలో చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఏలూరు పరిధిలో ప్లాస్టిక్‌తో కూడిన ఇయర్‌ బడ్స్‌, ప్లాస్టిక్‌ జెండాలు, మిఠాయి కర్రలు, బెలూన్ల కోసం ప్లాస్టిక్‌ కర్రలు తదితరాల దిగుమతి, ఎగుమతితోపాటు నిల్వ, విక్రయం, పంపిణీలను నిషేధించారు. ఈ జరిమానాల అంశాన్ని అజెండాలో పొందుపరచి, ఆమోదం పొందడానికి కార్పొరేషన్‌ అధికారులు సన్నద్ధమవుతున్నారు.

విలీన గ్రామాల్లో వడ్డన

ఏలూరు నగర పరిధిలోని శనివారపుపేట, సత్రపాడు, తంగెళ్లమూడి, వెంకటాపురం, కొమడ వోలు, చొదిమెళ్ల, పోణంగి గ్రామాలను కొన్నాళ్ల క్రితమే కార్పొరేషన్లో విలీనం చేశారు. అక్కడి ఇంటి పన్నుల ఆధారంగా ట్యాప్‌ కనెక్షన్ల ధరలను, నెల వారీ చార్జీలను ఇక నుంచి పంచాయతీ తరహాలో కాకుండా కార్పొరేషన్‌ మాదిరిగా వసూలు చేసేందుకు అధి కారులు రంగం సిద్ధం చేశారు. పాత టారిఫ్‌ ప్రకారం జనరల్‌ కేటగిరీలో నెలకు రూ.50, మీటర్‌ కనెక్షన్ల కింద నెలకు రూ.100 లను నెలకు వసూలు చేస్తుండగా, ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం జనరల్‌ కేటగిరీలో నెలకు రూ.125, బీపీఎల్‌ కింద రూ.వంద, మీటర్‌ కనెక్షన్లకు రూ.25 కేఎల్‌ చొప్పున ప్రతీ నెలా వసూ లుచేస్తారు. జనరల్‌, ఓవైటీ రెసిడెన్షియ ల్‌ కింద అర్ధ సంవత్సరపు ఇంటి ప న్ను ఆధారంగా డొనేషన్‌ చార్జీలు, సెక్యూరిటీ చార్జీలను జత చేర్చి వసూలు చేస్తారు. ఆ వివరాలివి.

అర్ధ సంవత్సర డొనేషన్‌ సెక్యూరిటీ మొత్తం

పన్ను చార్జీ చార్జీ (రూపాయల్లో..)

1–500 3వేలు 750 3,750

501–1000 5వేలు 750 5,750

1001–2000 7వేలు 750 7,750

2001–ఆ పై 10వేలు 750 10,750

Updated Date - 2022-12-13T01:15:48+05:30 IST

Read more