ఉత్సాహంగా వాహనాల్లో వచ్చి.. వెనుదిరిగారు

ABN , First Publish Date - 2022-07-05T05:43:14+05:30 IST

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆజాది కా అమృత్సోవ కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్రమోదీ పట్టణంలో అల్లూరి కాంస్య విగ్రహావిష్కరించారు.

ఉత్సాహంగా వాహనాల్లో వచ్చి.. వెనుదిరిగారు
వాహన సంచారం తగ్గిన భీమవరం పట్టణంలో ప్రధాన రోడ్డు

వాహనాలను పట్టణంలోకి అనుమతించని పోలీసులు

బస్సుల అడ్డగింత.. కాలినడకన పట్టణంలోకి..

పట్టణంలో దుకాణాల మూసివేత


భీమవరం టౌన్‌, జూలై 4: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆజాది కా అమృత్సోవ కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్రమోదీ పట్టణంలో అల్లూరి కాంస్య విగ్రహావిష్కరించారు. మోదీ పర్యటన నేపథ్యంలో పట్టణంలోని దుకాణాలు మూసివేయడం, ట్రాఫిక్‌ను మళ్లించడంతో పట్టణం నిర్మా నుష్యంగా కనిపించింది. పాలకొల్లు వైపు నుంచి వచ్చిన వాహనాలను బైపా స్‌ రోడ్డు మీదుగా మళ్లించడంతో పట్టణంలోకి వాహనాలను పోలీసులు అనుమతించలేదు. నిత్యం రద్దీగా ఉండే ప్రకాశంచౌక్‌, జువ్వలపాలెం రోడ్డు, ఉండి రోడ్లలో జనసంచారం పెద్దగా కనిపించలేదు. మోదీ సభకు బయలు దేరిన బస్సులు మార్గమధ్యలో ఆగిపోయాయి. వీరవాసరం మీదుగా వచ్చిన బస్సులను ఆర్టీసీ డిపోవద్ద పోలీసులు నిలిపి వేశారు. పట్టణంలోకి ఆర్టీసీ బస్సుల రాకను క్రమబద్ధీకరించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్ర యాణికులు బస్సు దిగి పట్టణంలోకి కాలినడకన వెళ్లారు. మధ్యాహ్నం నుం చి బస్సులు పూర్తిస్థాయిలో నడిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.


యువత మోటార్‌ సైకిల్‌ ర్యాలీ


అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ముందుగా యువత బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వందల సంఖ్యలో యువకులు అల్లూరి టీ షర్టులు, జెండాల తో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.


సభకు వెళ్లకుండానే వెనుదిరిగిన వాహనాలు

ప్రధాని బహిరంగ సభకు వెళ్ళిన ఎన్నో వాహనాలు భీమవరం చేరకుండానే వెనుదిరిగాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గ్రామాల నుంచి బహిరంగ సభకు వాహనాలలో జనాన్ని తరలించారు. వాహనాలు భీమవరం పట్టాణానికి 6–7 గంటల సమయానికే చేరుకున్నాయి. మోదీ ప్రసంగం ప్రారంభించిన తర్వాత కూడా పలు వాహనాలు భీమవరం వైపు వెళ్లాయి. అవి పట్టణంలోనికి వెళ్లే అవకాశం లేకపోవడంతో కొన్ని బస్సులు విస్సాకోడేరు నుంచి వెనుదిరిగాయి. చాలా వాహనాలు విస్సాకోడేరు, గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం నుంచే వెనుదిరిగాయి. ప్రధాని మోది సభకు వెళ్లేందుకు వచ్చిన జనం సమయం మించిపోవడం అల్లూరి విగ్రహావిష్కరణ, మోదీ ప్రసంగం ప్రారంభం కావడంతో ఉన్నచోటి నుంచే వెనుదిరిగారు. తూర్పుగోదావరి, ఆచంట, పెనుగొండ, మండలానికి చెందినవారు తిరిగి వెళుతూ మార్గమధ్యలో నందమూరుగరువు భక్తాంజనేయస్వామి ఆలయం వద్ద బస్సులను దర్శనం చేసుకున్నారు.


భారీ సంఖ్యలో పోలీసులు


ప్రధాని నరేంద్ర మోదీ సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. చాలా మంది మహిళలు సభ దగ్గరకు వెళ్ళకుండానే వెనుదిరిగారు. పోలీసులు కూడా అక్కడ ఖాళీ లేదంటూ చెప్పడంతో వెనక్కి వెళ్ళిపోయారు. పోలీసులు కూడా భారీగా బందోబస్తులో పాల్గొన్నారు. బొంబాయి స్వీట్‌ సెం టర్‌, అడ్డంతెన, ఆదర్శనగర్‌, పెదఅమిరం పుంత రోడ్డు దగ్గర భారీగా మోహరించారు. వీఐపీ వాహనాలను మాత్రమే లోపలికి పంపించారు. 

మోదీ సభకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లలో భాగంగా ఉండి–చేబ్రోలు రహదారిలో సుమారుగా 2వేల మంది పోలీసులు పహారా కాశారు. ఉండి ప్రధాన సెంటర్‌, ఉండి–ఆకివీడు రహదారిలో, ఉండి–గణపవరం రహదారి, ఉండి బస్టాండ్‌ సమీపంలో పెద్దసంఖ్యలో పోలీసులు మొహరించారు. ఆరే డు, కోలమూరు, పాములపర్రు, మహదేవపట్నం సెంటర్లలో ప్రత్యేకంగా పో లీసులు గస్తీ ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా బీజేపీ నేతలు  40 బస్సులలో సుమారుగా 7వేల మంది వారికి ఇచ్చిన రూట్‌ ప్రకారం బయలు దేరారు. ఉండి వచ్చేసరికి సమయం ఉదయం 10 గంటలు కావడంతో పోలీ సు అధికారులు వాహనాలను పట్టణంలోనికి అనుమతించలేదు. వాహనాలు దిగి అక్కడి నుంచి కాలినడకన ప్రధాని సభకు వెళ్లారు.

Updated Date - 2022-07-05T05:43:14+05:30 IST