పామాయిల్ ధర అదుర్స్
ABN , First Publish Date - 2022-06-05T05:20:13+05:30 IST
ఆయిల్‌పామ్ సాగు రైతులకు అదృష్టయోగం పట్టింది. గతంలో ఊహించి నంతగా గిట్టుబాటు ధర దక్కకపోయినా పెంచిన మొక్కలు ఇస్తున్న కొద్దిపాటి ఆదాయాన్నే నమ్ముకునే వారు.
అంతర్జాతీయంగా డిమాండ్
టన్ను ధర రూ.23,373
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
పామాయిల్ రైతుల పంట పండింది. ఇన్నాళ్ల కష్టానికి ఫలితం దక్కింది. పెరిగిన ధరలతో ఆనందం వెల్లివిరుస్తోంది. కొన్ని నెలలుగా ధరలు పెరుగుతూ టన్ను రూ.23,373తో ఆల్ టైం రికార్డు ధరకు చేరింది. ఎన్నడూ చూడని ధరలతో రైతులు మురిసిపోతున్నారు. మిగిలిన రైతులను పామాయిల్ సాగు వైపు మొగ్గు చూపేలా పరిస్థితులు మారుతున్నాయి.
జంగారెడ్డిగూడెం, జూన్ 4 : ఆయిల్‌పామ్ సాగు రైతులకు అదృష్టయోగం పట్టింది. గతంలో ఊహించి నంతగా గిట్టుబాటు ధర దక్కకపోయినా పెంచిన మొక్కలు ఇస్తున్న కొద్దిపాటి ఆదాయాన్నే నమ్ముకునే వారు. మూడేళ్ల్ల క్రితం టన్ను రూ.8890 ఉంటే దానిని రూ.10 వేలు చేయాలంటూ ఆందోళన బాట పట్టారు. అప్పటి నుంచి ధరలు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది జనవరి నెలలో టన్ను రూ.17 వేలు ఉండగా ఏప్రిల్‌లో రూ.19,300కు చేరింది. ప్రస్తుతం ఆల్‌టైం రికార్డు ధర రూ.23,373 సొంతం చేసుకుంది. అంతర్జాతీ యంగా వంట నూనెల ధరలు పెరగడం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, థాయిలాండ్ దేశం పామాయిల్ ఎగుమతులను నిషేదించడం వంటి పరిణామాల నేపఽథ్యంలో ఆయిల్ పామ్‌కు ఈ దశ పట్టింది. 76,860 హెక్టార్లలో సాగు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 76,860 హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఎకరానికి 9,10 టన్నుల దిగుబడి సాధిస్తే ప్రతీ ఏడాది 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఏలూరు జిల్లాలోని కామవరపుకోట, టి.నరసాపురం, ద్వారకాతిరుమల, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, చింతలపూడి తదితర మండలాల్లో ఎక్కువగా పామాయిల్ సాగు ఉంది. కాగా ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లి వద్ద గోద్రేజ్ ప్రాసెస్ యూనిట్, పెదవేగిలో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ, యర్నగూడెంలో ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ కంపెనీ, చింతలపూడిలో రెండు ప్రాసెస్ యూనిట్‌లు జంగారెడ్డి గూడెంలో నవభారత్, కృ
ష్ణా జిల్లాలో రుచి ఫ్యాక్టరీ తదితర కంపెనీలు రైతుల నుంచి పామాయిల్ కొంటున్నారు.
నష్టాల ఊబి నుంచి..
పామాయిల్ రైతులకు రెండు, మూడేళ్లుగా గిట్టుబాటు ధరలు అందలేదు. దీంతో వచ్చిన ఫలసాయంతోనే కాస్త సాగు చేసుకుంటూ వచ్చారు. చాలా మంది రైతుల సొంత సాగు చేయలేక కౌలుకు ఇచ్చేసేవారు. కొంతమంది తోటలను తొలగించేశారు. ప్రత్యామ్నాయ సాగుకు దిగారు. రెండేళ్ల నుంచి అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు పెరుగు తుండటంతో దేశీయంగా ఆయిల్‌పామ్ కంపెనీలు కొనుగోలు ధరలు పెంచుతూ వస్తున్నాయి. 2020 మార్చిలో టన్నుకి రూ.9,043 ఉంటే ఆ తరువాత తగ్గి మే నెలలో రూ.8447 ధర పలికింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెరుగుతూనే ఉంది.
ఆశాజనకంగా ధరలు
సందేపూడి పినాకపాణి, టి.నరసాపురం, పామాయిల్ రైతు
20 సంవత్సరాలుగా 20 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నాను. ఎన్నో ఒడి దుడుకులు పడ్డాం. ఒక్కో సీజన్‌లో పెట్టుబడులు కూడా వచ్చేవి కావు. గిట్టుబాటు కాని సాగుతో ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. కానీ ప్రస్తుతం ధరలు ఆశా జనకంగా ఉన్నాయి. ఇదే ధరలు కనుక ఉంటే పామాయిల్ రైతులు గట్టెక్కుతారు.