ఎక్కడి ధాన్యం.. అక్కడే!

ABN , First Publish Date - 2022-12-29T01:01:53+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు అంతంత మాత్రంగా జరుగుతుండగా, కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతుండటంతో ఈ ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతున్నది.

ఎక్కడి ధాన్యం.. అక్కడే!
అల్లూరు రైసు మిల్లు వద్ద బారులు తీరిన ధాన్యం లోడు వాహనాలు

ముదినేపల్లి మండలంలో బ్యాంక్‌ గ్యారంటీలు పూర్తి

ముదినేపల్లి, డిసెంబరు 28 : ధాన్యం కొనుగోళ్లలో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు అంతంత మాత్రంగా జరుగుతుండగా, కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతుండటంతో ఈ ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతున్నది. ఆర్బీకేలు కేవలం తేమ శాతం నిర్ధారించి, రైతు వారీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు పరిమితం కావటం, ధాన్యం కొనుగోళ్లకు రైసు మిల్లర్లు ఇచ్చిన బ్యాంక్‌ గ్యారంటీలు పూర్తి కావటంతో కొనుగోళ్లు గత మూడు రోజులుగా మందగించాయి. ముదినేపల్లి మండలంలో సుమారు 18 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయగా, 14 వేల ఎకరాల విస్తీర్ణంలో మాసూళ్లు పూర్తి చేశారు. మిగిలిన 4 వేల ఎకరాల్లో వరి కుప్పలు వేశారు. మాసూళ్లు పూర్తయిన 14 వేల ఎకరాల నుంచి సుమారు 37 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, ఇప్పటి వరకు సుమారు 14 వేలమెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. మిగిలిన 23 వేల టన్నుల ధాన్యం కల్లాల్లో, ఇళ్ల వద్ద రాశులుగా పడి ఉన్నాయి. తేమ శాతం తేడాలతో రైతులు ధాన్యం అమ్మకాల్లో సతమతమవుతూ నష్టాలకు గురవుతున్నారు.

బ్యాంక్‌ గ్యారంటీల సమస్య...

ముదినేపల్లి మండలంలో ఏడు రైసుమిల్లులు ధాన్యం కొనుగోళ్లకు ఇచ్చిన బ్యాంక్‌ గ్యారంటీలు పూర్తయ్యాయి. గ్యారంటీ లేకుండా ధాన్యం కొనుగోళ్లకు ఆన్‌లైన్‌ అనుమతించదు. పక్క మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనటంతో ఏలూరు జిల్లా సివిల్‌ సప్లయిస్‌, ఆన్‌లైన్‌కు ముదినేపల్లి మండలాన్ని అనుసంధానం చేశారు. దీంతో మండలంలో ధాన్యం తూకం వేశాక ఆన్‌లైన్‌లో ఏలూరు జిల్లాలోని వివిధ రైసు మిల్లులకు కేటాయింపులు వస్తున్నాయి. దూర ప్రాంతం వెళ్లేందుకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో మండలంలోని రైసు మిల్లుల్లో ధాన్యం కొనుగోళ్లు గత రెండు రోజులుగా స్తంభించిపోయాయి.

ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పించాలి

తేమ శాతం లెక్క గట్టే ప్రక్రియ నుంచి ధాన్యాన్ని మిల్లుకు తోలే వరకు ఇబ్బందిగానే ఉంది. నిబంధనలు ఎత్తేసి రైతు తమకు ఇష్టమొచ్చిన విధంగా ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి కల్పించాలి.

–నవుడు సాంబశివరావు, రైతు ఉప్పర గూడెం

చర్యలు తీసుకుంటున్నాం

ధాన్యం కొనుగోళ్లకు రైస్‌ మిల్లులకు బ్యాంక్‌ గ్యారంటీలు కల్పించే విషయమై చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

–తహసీల్దార్‌ శ్రీనివాస్‌

Updated Date - 2022-12-29T01:02:01+05:30 IST