రైతులపై ప్రేమంటే ఇదేనా..?

ABN , First Publish Date - 2022-08-08T05:47:00+05:30 IST

ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభమై నెలలు గడుస్తున్నాయి. కాని గత రబీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.350 కోట్లకు పైబడి ఇంకా పూర్తిగా రైతుల ఖాతాల్లో జమకాలేదు.

రైతులపై ప్రేమంటే ఇదేనా..?

ధాన్యం సేకరణలో ఆపసోపాలు

ప్రతీ ఏటా వందల కోట్ల బకాయిలు

విడతల వారీగా చెల్లింపులు

ఈ ఏడాది రైతుల నెత్తిపై మరో పిడుగు

ఇ–క్రాప్‌ వెరిఫికేషన్‌ అంటూ భారీ పెండింగ్‌

సివిల్‌ సప్లయి మంత్రి జిల్లాలోనే ఈ కష్టాలు

పైపైకే ప్రేమ.. రైతు నెత్తిన కష్టాల మూట

ఉమ్మడి పశ్చిమలో జగన్‌ సర్కార్‌ చోద్యం


ఎన్నికల ముందు రైతు పక్షపాత ప్రభుత్వం వస్తుం దంటూ ఊదరగొట్టేశారు. వెన్నుముకలా ఉంటా మంటూ ప్రగల్భాలు పలికారు. తీరా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఆ సీనంతా రివర్స్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల్లో రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఏదొక కొర్రీ పెట్టి చెల్లింపుల్లో జాప్యం జరిగేలా ప్రయత్నిస్తున్నారు.  రబీ ధాన్యం సొమ్ములు ఇప్పటకీ పూర్తిగా ఇవ్వలేదు.. మూడేళ్లుగా ఇలా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు..


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) 

ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభమై నెలలు గడుస్తున్నాయి. కాని గత రబీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.350 కోట్లకు పైబడి ఇంకా పూర్తిగా రైతుల ఖాతాల్లో జమకాలేదు. దాదాపు 40 వేల మంది రైతులు చేతిలో పెట్టుబడులు లేవు. భారీగా పడుతున్న వర్షాలతో వ్యవసాయ అక్కడక్కడ దెబ్బతిని ముందుకు కదల్లేకుండా చేస్తున్నది.   ఎన్నాళ్ళిలా రైతులతో ఆడుకుంటారంటూ రైతు సంఘాలు నేరుగా విరుచుకుపడు తున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు ఇదే జిల్లాకు చెందిన వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలోనూ కూడా రైతుకు తిప్పలు తప్పడం లేదు.


అప్పుడెంతో ప్రేమ..ఇప్పుడెంతో నరకం 

ఎన్నికలకు ముందు, ఆ తరువాత కూడా వైసీపీ సర్కార్‌ రైతులపై ప్రేమ వలగబోసింది. మీరే సర్వస్వం అంటూ ప్రకటనలు చేసింది. ధాన్యం కొనుగోలు చేస్తే 24 గంటల్లోనే చెల్లింపులు ఉంటాయంటూ భరోసా ఇచ్చారు.మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరుకు ముఖ్యమంత్రి కూడా ధాన్యం సేకరణ విషయంలో పదేపదే ఇదే విషయం చెబుతూ వచ్చారు. గడిచిన మూడేళ్లుగా ప్రతీ సీజన్‌లోనూ సాఫీగా సేకరణ జరగలేదు.. చెల్లింపులకు అంతకంటే గతిలేదు. మొదటి సంవత్సరం కాస్తంత తడబాటు అనుకున్నారు. రెండో సంవత్సరం పోనీలా దిద్దుబాటు అంటూ సరి పెట్టుకున్నారు. ఆఖరుకు మూడో సంవత్సరం వచ్చినా ఖరీఫ్‌ రబీలో రైతులకు అవే కష్టాలు, ధాన్యం సేకరణ ఏమైందంటూ ప్రశ్నలు.. నాలుగు రోజులు ఓపిక పట్టండి అంతా మీ ఖాతాలో చేరుతుందంటూ అధికారులు దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఒకే పాట. ఈ ఏడాది విషయానికొస్తే గడిచిన రబీలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు పది లక్షల టన్నుల వరకు ధాన్యం సేకరించారు. వీటి నిమిత్తం రైతులకు భారీ ఎత్తున చెల్లింపులు చేయాల్సి ఉంది. ఏలూరు జిల్లాలో 3.49 లక్షలు, పశ్చిమ గోదావరిలో 6.85 లక్షల టన్నులు ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించగలిగింది. ఈ రెండింటిలో కలిపి దాదాపు 45 వేల మందికిపైగా రైతులకు ఒకానొక దశలో 1600 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటిదాకా విడతల వారీగా.. రైతులు డిమాండ్‌ చేసినప్పుడల్లా కాస్తంత విదిలిస్తూ వచ్చారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే ఇప్పటిదాకా 24,900 మంది రైతులకుగాను మరో 150 కోట్లు జగన్‌ సర్కార్‌ బకాయి పడింది. సరాసరిన మూడొంతులు చెల్లింపులు చేసేశామని, ఇంకా కాస్తంత బకాయి మాత్రమే మిగిలిందంటూ ఇప్పుడు అధికారులు లెక్కలు తేల్చకుండా ఇంకా గోప్యంగానే ఉంచుతున్నారు. రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న కపట ప్రేమకు ఈ రూపంలో తెర కడుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి మాత్రం అధ్వా న్నంగా మారింది. దీనికితోడు పశ్చిమ గోదావరి జిల్లాలోను దీనికి రెండింతలు ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆ జిల్లాలో అయితే చెల్లింపుల వ్యవహార మంతా గందరగోళంగా మారింది. అనుభవం లేని అధికారులు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలగిలిపి ఇప్పుడు ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది.  


 రూ.మూడు లక్షలైతే.. మూడింది 

ఇప్పటికే ధాన్యం సేకరణపై వైసీపీలోనే గడిచిన కొన్నాళ్ళుగా రకరకాల భిన్నాభిప్రాయాలు తొంగి చూశాయి. ధాన్యం సేకరణలో ఏదో మతలబు ఉన్నట్టుగా ప్రత్యేకించి దళారుల పాత్రపైనా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ గతంలోనే పెదవి విప్పారు. ఆ తరువాత దీనిని పెద్దగా పట్టించు కోకుండా అప్పట్లో కలరింగ్‌ ఇచ్చారు. కాని తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న ధాన్యాన్ని ఇక్కడి రైతుల ఖాతాల్లో చూపించి అమ్మకాలు చేస్తున్నార న్నట్టుగా అనేక ఆరోపణలు చేశారు. ఇదే తరుణంలో ఇప్పుడు తాజాగా వరి పండించిన రైతులకు కొత్త షాక్‌ ఇచ్చారు.ఎక్కడైతే మూడు లక్షలకుపైగా ధాన్యం కొనుగోలుకు సొమ్ములు చెల్లించాల్సి వస్తుందో ఆ ఖాతాలన్నింటినీ వెరిఫికేషన్‌ చేసేందుకు నిర్ణయించారు. ఉమ్మడి పశ్చిమలో సాధారణ రైతులకంటే కౌలు రైతులే అధికం. వీరంతా రక్తాన్ని చెమటగా మార్చి ధాన్యాన్ని పండిస్తారు. ఇ–క్రాప్‌ పేరిట ఎప్పటికప్పుడు ధాన్యం ఎన్ని ఎకరాల్లో పండించింది, ఏ రైతు పేరిట చేశారనే అంశంపై క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ఆరా తీసి నమోదు చేస్తూ వచ్చారు. ఇ–క్రాప్‌ నివేదికలో పండించిన పంట, విస్తీర్ణం, ఇతరత్ర రైతుల వివరాలను నమోదు చేస్తారు. ఇంత వరకు బాగానే ఉంది. కాని ఇప్పుడు రైతులకు  కొత్త కష్టం వచ్చింది. సరాసరిన ఇంత విస్తీర్ణంలో మాత్రమే  రైతులు ధాన్యం పండిస్తారని, దిగుబడి ఇంత వస్తుందని ఎకరాకు లెక్కకడుతూ వచ్చారు. ఈ లెక్కన సరాసరిన ఎకరాకు 40 బస్తాలు పండితే క్వింటాకు రూ.1470 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తారు. ఒక రైతు పది ఎకరాల్లో పండిస్తే అప్పటి దిగుబడి ప్రకారం వచ్చే పంట దిగుబడి, విలువను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ లెక్కన మూడు లక్షలకుపై ఏ రైతు నుంచైనా కొనుగోలు చేస్తే తిరిగి ఈ–క్రాప్‌ వివరాలను వెరిఫై చేసేందుకు రంగం లోకి దిగుతున్నారు. దీంతో రైతుల నెత్తిన పిడుగు పడింది. ఈ వెరిఫికేషన్‌ పూర్తయిన తరువాత మీ ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని అధికారులు పైపైకి చెబుతున్నారు. 


 మంత్రి సొంత జిల్లాలోనే ..

రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇదే జిల్లాకు చెందిన వారు. అయినా రైతులకు ధాన్యం కష్టాలు మాత్రం తప్పడం లేదు. మిల్లర్లు, దళార్లు ఎవరికి తోచినట్టుగా వారు వ్యవహరిస్తుండగా, ఆ భారాన్ని రైతులపై నెడుతు న్నారు. ఇప్పటికే ఖరీఫ్‌ ఆరంభంలోనే భారీ వర్షాలతో నష్టాలు తొంగి చూస్తున్నాయి. చేలన్నీ వేల ఎకరాల్లో నీట ముని గాయి. మరిన్ని కొట్టుకుపోయాయి. ఇలాంటి నష్టాలు, ఒడిదుడుకులను రైతులు ఎదుర్కొంటూనే, చేతిలో చిల్లిగవ్వలేక, కొత్త పెట్టుబడికి అవకాశం లేక విలవిలలాడుతున్నారు.


Updated Date - 2022-08-08T05:47:00+05:30 IST