దేవుడా.. ఎంత పనిచేశావ్‌..!

ABN , First Publish Date - 2022-09-27T06:24:00+05:30 IST

చేతికి అందివచ్చిన కొడుకు, అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మనుమలు విగత జీవులుగా పడి ఉండటంతో ఆ వృద్ధ దంపతుల వేదన వర్ణనాతీతంగా మారింది.

దేవుడా.. ఎంత పనిచేశావ్‌..!
ప్రమాదంలో మృతి చెందిన కుటుంబం (ఫైల్‌)

కొడుకు, కోడలు, మనుమల మృతితో వృద్ధ దంపతుల రోదన

అడ్డరోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ తల్లిదండ్రులు మృతి

కుటుంబాన్ని బలిగొన్న రోడ్డు ప్రమాదం..

మీర్జాపురంలో విషాద ఛాయలు

పోలీసుల అదుపులో కారు డ్రైవర్‌


జంగారెడ్డిగూడెం/నూజివీడు, సెప్టెంబరు 26 : చేతికి అందివచ్చిన కొడుకు, అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మనుమలు విగత జీవులుగా పడి ఉండటంతో ఆ వృద్ధ దంపతుల వేదన వర్ణనాతీతంగా మారింది. అమ్మ వారి మొక్కులు తీర్చుకొని వద్దామనుకున్న ఆ కుటుంబం రోడ్డు ప్రమాదం బారిన పడి మృతి చెందిన దుర్ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురంలో విషాదాన్ని నింపింది. శ్రీకాకుళానికి చెందిన నూక గణపతి, లక్ష్మీలకు ఒక్కగానొక్క కుమారుడు ఉమామహేశ్వరరావు. ఆయన కుటుంబం ఆరేళ్ల క్రితం ఉద్యోగ రీత్యా మీర్జాపురం వచ్చి స్థిరపడింది. ఉమామహేశ్వరరావు రేపల్లె మోహన్‌ స్పిన్టెక్స్‌లో క్వాలిటీ డిపార్టుమెంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రేవతి, కుమారుడు దుర్గాప్రసాద్‌, కుమార్తె షర్మిల ఉన్నారు. ఉద్యోగం పర్మినెంట్‌ అవడంతో తల్లిదండ్రులను తన వద్దకు తీసుకుని వచ్చేశాడు. గణపతి స్థానిక హోటల్లో పనిచేస్తుంటాడు. వీరిద్దరూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఏ శుభకార్యం జరిగినా, ఎక్కడికి వెళ్లినా మొత్తం ఆరుగురు హాజరవుతారు. ఎంతో సంతోషంగా రోజులు గడుస్తున్న క్రమంలో పశ్చిమ ఏజెన్సీలోని గుబ్బల మంగమ్మ తల్లి దర్శనార్ధం ఆదివారం ఉదయం ఆరు గంట లకు మీర్జాపురం నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై బయలుదేరి అమ్మవారిని దర్శించుకుని అక్కడే భోజనాలు చేసి తిరుగు ప్రయాణంలో కామవరపుకోట మండలం బొర్రంపాలెం అడ్డరోడ్డు సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యారు. ఘటనా స్థలంలోనే చిన్నారులు షర్మిల, దుర్గాప్రసాద్‌ మృతి చెందగా అర్ధరాత్రి సమయంలో ఉమామహేశ్వరరావు ఏలూరు ఆసుపత్రిలోను, సోమవారం ఉద యం రేవతి విజయవాడ ఆసుపత్రిలోను మృతి చెందారు. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కొడుకు, కోడలు, మనుమల మృతితో తాము అనాథలమయ్యామని గణపతి, లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. 


పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాల అప్పగింత


చిన్నారులు షర్మిల, దుర్గాప్రసాద్‌ మృతదేహాలకు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఉదయం పోస్టుమార్టం పూర్తి చేసి వాటిని తాత గణపతికి అందజేశారు. వారి మృతదేహాలను చూసి గణపతి పడ్డ ఆవేదన అక్కడున్న వారిని కలిచివేసింది. ఇక్కడ పిల్లలు, ఏలూరు ఆసుపత్రిలో కొడుకు, విజయవాడ ఆసుపత్రిలో కోడలి మృతదేహాలను తీసుకుని తమ గ్రామం వెళ్లాల్సి వస్తోందని తీవ్రంగా విలపించాడు. దేవుడా..? ఎంత పనిచేశావ్‌..! తమకు తలకొరివి పెట్టాల్సిన కొడుకు, తమ చేతుల్లో పెరిగిన మనుమలు విగత జీవులుగా మారటంతో గుండెలవిసేలా విలపిస్తున్న వృద్ధ దంపతులను ఓదార్చటం ఎవరికి సాధ్యం కావటం లేదు. మద్యం సేవించి కారును నడుపుతూ రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవ్‌ చేసిన వ్యక్తి ఆదివారం రాత్రే తడికలపూడి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్టు తెలిసింది. 

Read more