నూతన సంవత్సర సందడి

ABN , First Publish Date - 2022-12-31T22:48:03+05:30 IST

జిల్లా వ్యాప్తంగా న్యూఇయర్‌ సందడి నెలకొంది. పట్టణ, గ్రామాల్లో షాపుల వద్ద కేక్‌లు, బిర్యానికి డిమాండ్‌ పెరిగింది. పలు షాపుల వద్ద ముగ్గులు వేసేందుకు కావాల్సిన రంగులు అమ్మకాలు జరిపారు.

నూతన సంవత్సర సందడి

పువ్వులు, కేక్‌లు, బిర్యానిలకు డిమాండ్‌ 8 ఆఫర్ల జోరు

యువత జోష్‌

ఆచంటలో ముగ్గుల పోటీలు

జిల్లా వ్యాప్తంగా న్యూఇయర్‌ సందడి నెలకొంది. పట్టణ, గ్రామాల్లో షాపుల వద్ద కేక్‌లు, బిర్యానికి డిమాండ్‌ పెరిగింది. పలు షాపుల వద్ద ముగ్గులు వేసేందుకు కావాల్సిన రంగులు అమ్మకాలు జరిపారు. యువత కేక్‌లు కట్‌ చేసేందుకు, న్యూఇయర్‌ శుభాకాంక్షలు తెలుపుకునేందుకు పలు సెంటర్లలో ఏర్పాట్లు చేస్తూ సందడి చేశారు.

పాలకొల్లు, డిసెంబరు 31 : జనవరి నెల ప్రారంభం అందరికీ సందడిగా ఉంటుంది, ఒకరికొకరు బొకేలు, పండ్లు, స్వీట్లు, పువ్వులు అందజేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, బంధువులు, మిత్రులకు న్యూఇయర్‌ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ నేపథ్యంలో పట్టణంలో శనివారం మార్కెట్‌ అంతా రద్దీగా కనపడింది. పువ్వుల ధరలకు సాధారణం కన్నా 50 శాతం అధికంగానూ. స్వీట్లు, కేక్‌లు గత ఏడాది కన్నా రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. ఇక బొకేలు, పండ్లకు గిరాకీ పెరిగింది, వస్త్ర దుకాణాలు, ఫ్యాన్సీ గృహోపకరణ వస్తువుల షాపుల్లో రద్దీ కనపడింది. పోలీసులు నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని హెచ్చరించినప్పటికీ వేడుకలు నిర్వహించుకునేందుకు పలువురు పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక స్వీట్ల షాపులు, బిర్యాని షాపులు రోడ్ల పక్కన వెలిశాయి. బిర్యాని కొనుగోలుదార్లకు పలు రకాల ఆఫర్లను ఎరవేస్తున్నారు. కొంతమంది సనాతన వాదులు ‘జనవరి ఒకటి వద్దు ఉగాది ముద్దు’ అనే నినాదంతో ప్రచారం చేస్తున్నారు. దీనికి తమ తమ ఇళ్ల ముందు మహిళలు ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఓ అపార్టుమెంటు ముందు జనవరి ఒకటి వద్దు ఉగాది ముద్దు అంటూ ముగ్గు వేశారు.

ఆచంట, డిసెంబరు 31 : మండలంలోని పలు గ్రామాల సెంటర్లలో ఏర్పాటు చేసిన కేక్‌లు, బిర్యానిలకు డిమాండ్‌ పెరిగింది. ఆయా షాపులు వద్ద సందడి నెలకొంది. వ్యాపారులు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నారు. 2022 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2023కు స్వాగతం పలుకుతూ పలువురు కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆచంటలో వైట్ల కిషోర్‌ కేక్‌ కట్‌ చేసి అనంతరం శ్రీకారం షార్ట్‌ ఫిలిమ్‌ రిలీజ్‌కు సంబంధించి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆచంట వేమవరంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్‌ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. భవ్యభారతి విద్యానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ కేవీవీ తాతారావు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్యసంఘం నాయకుడు కొల్లేపర వెంకన్నబాబు ఆధ్వర్యంలో శనివారం మండలంలోని కరుగోరుమిల్లిలోని స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయ సన్నిధి వద్ద ముగ్గుల పోటీ లు నిర్వహించారు. పోటీల్లో అనేక మంది మహిళలు, బాలికలు పాల్గొని పలు రకాల ముగ్గులు వేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. విజేతలకు వెంకన్నబాబు బహుమతులు అందజేశారు.

పెనుగొండ, డిసెంబరు 31 : పెనుగొండ భాష్యం పాఠశాలలో న్యూయర్‌ వేడుకలను ఘనంగా శనివారం నిర్వహించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్‌ ఎన్‌. వెంకట అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశామన్నారు. శ్రీ చైనత్య స్కూలులో విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

వేడుకలకు నిమ్మల, కవురు దూరం

పాలకొలు, డిసెంబరు 31 : ప్రతీ ఏడాది మాదిరిగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటానని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్లెక్సీలు, బోకేలు వంటి వాటికి వృథాగా సొమ్ములు ఖర్చు పెట్టకుండా పేదలకు సేవలు చేపట్టాలన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ పెద్ద తిరుపతి వెళుతున్న సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటున్నారు.

Updated Date - 2022-12-31T22:48:05+05:30 IST