జీలుగుమిల్లిలో.. నేవీ ఆయుధాగారం

ABN , First Publish Date - 2022-09-28T05:49:26+05:30 IST

రక్షణ విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నేవీ ఆయుధాగారం (నేవెల్‌ ఆర్మమెంట్‌ డిపో) ఏర్పాటు చేయబోతున్నారు.

జీలుగుమిల్లిలో.. నేవీ ఆయుధాగారం
భూసేకరణ ప్రాంతమిదే (శాటిలైట్‌ చిత్రం)

1200 ఎకరాల్లో భూసేకరణ

సుమారు వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మాణం

స్థానికులకు ఉపాధి కోసమేనంటూ ఊరింపులు


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

రక్షణ విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నేవీ ఆయుధాగారం (నేవెల్‌ ఆర్మమెంట్‌ డిపో) ఏర్పాటు చేయబోతున్నారు. కేంద్ర రక్షణ విభాగం కొద్ది మాసాల క్రితం జీలుగుమిల్లి ప్రాంతమే ఈ ఆయుధాగారం నెలకొల్పేందుకు సురక్షిత ప్రాంతంగా భావించడమే కాకుండా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రా ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న ప్రధాన మార్గానికి సమీపంలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే వందల ఎకరాలు భూసేకరణకు అనువుగా దస్త్రం సిద్ధమవుతోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకే దీనిని ఇక్కడకు వచ్చేలా చొరవ తీసుకుంటున్నామని స్థానిక ఎంపీ కోటగిరి శ్రీధర్‌ చెబుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ తరహా ప్రాజెక్టు రక్షణ విభాగం నుంచి రాబట్టడం అంత సులువైనది కాకపోయినా కొంత సాధించగలిగామని రాష్ట్ర ప్రభుత్వం ధీమాతో ఉంది. దీంతో జీలుగుమిల్లి మండలంలో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.


ఏమిటీ ఎన్‌ఏడీ ?

ఆది నుంచి నేవికా దళం ఎన్‌ఏడీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే పరదీప్‌, వైజాగ్‌, ముంబై, కొచిన్‌ వంటి ప్రాంతాల్లోనూ ఎన్‌ఏడీ ఆయుధాగా రాలు ఉన్నాయి. ఇప్పుడు సరికొత్తగా జీలుగుమిల్లిలో ఏర్పాటుకు కేంద్ర రక్షణ విభాగం ఎంపిక చేసింది. ఆరు మాసాల క్రితం తాజా ప్రతిపాదనలను నేవీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అటు ఖమ్మం జిల్లా, ఇటు ఏలూరు జిల్లా సరిహద్దుల్లో ఆయుధాగారం ఏర్పాటుకు కావాల్సిన భూమి విస్తీర్ణం, వ్యయ పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఆయుధాగారంలో వెయ్యి మందికిపైగా అతి ముఖ్య నేవికాదళ అధికారులే ఉంటారు. నేవికాదళానికి చెందిన ఆయుధాలను ఇక్కడ భద్రపరుస్తున్న కార ణంగా దీనిని వ్యావహారిక భాషలో డిపోగా పిలుస్తారు. అత్యంత భద్రత కలిగి న ప్రాంతంగా ఉంటుంది. ఈ ప్రాంగణమంతా రక్షణ వలయంలోనే ఉంటుంది. రాకపోకలు నేవికా దళంలో ఉన్నవారికే. ఇతరులను అనుమతించరు. 


తొలుత ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ప్రస్తావన

ఖమ్మం, ఏలూరు జిల్లా సరిహద్దున కేంద్ర రక్షణ శాఖ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ తలపెట్టిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీనిని అధికారులు అవునని కాని, కాదని కాని వెల్లడించకుండా ఇప్పటికీ గుంభనంగా ఉంచారు. రక్షణ వ్యవహారం కాబట్టి పరిమిత సంఖ్యలోనే వివరాలు తెలుస్తాయని, ఏవీ బయటకు చెప్పడానికి వీలుండదని స్థానిక అధికారులు దాటవేస్తూ వచ్చారు. కేవలం ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోనే దీని నిర్మాణం సాగబోతుందంటూ ప్రచారం సాగగా అక్కడ భూముల ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. కాని అది ఒట్టిదేనని ఎన్‌ఏడీ ఏర్పాటుతో తేలిపోయింది.


భూసేకరణ ఎలా చేయబోతున్నారు ?

జీలుగుమిల్లిలో ఏర్పాటు చేయబోయే ఆయుధాగారానికి దాదాపు 1,200 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో చాలా భూభాగం ప్రభుత్వపరమైంది. మరోసారి 1200 ఎకరాలు ఎన్‌డీఏకు సేకరించాల్సి రావడంతో రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. 1/70 భూములను సేకరిస్తారా, రైతుల పట్టా భూములనే కొనుగోలు చేస్తారా ? అనే దానిపై అందరిలోనూ సస్పెన్స్‌ నెలకొంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రక్రియ ఆరంభం కానుండడంతో అటు నేవీ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు రైతులకు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Read more