ఆకట్టుకున్న మృత్యుపత్రం

ABN , First Publish Date - 2022-12-04T00:51:03+05:30 IST

తోలేరు సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్‌ జాతీయ స్థాయి నాటిక పోటీల్లో రెండో రోజు శనివారం రాత్రి డాక్టర్‌ యిర్రింకి సూర్యారావు కళాప్రాంగణంలో ప్రదర్శించిన మూడు నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఆకట్టుకున్న మృత్యుపత్రం
మృత్యు పత్రం నాటికలోని ఓ సన్నివేశం

ఆలోచింపజేసిన నాటికలు

వీరవాసరం, డిసెంబరు 3: తోలేరు సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్‌ జాతీయ స్థాయి నాటిక పోటీల్లో రెండో రోజు శనివారం రాత్రి డాక్టర్‌ యిర్రింకి సూర్యారావు కళాప్రాంగణంలో ప్రదర్శించిన మూడు నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిలకలూరిపేటకు చెందిన ముద్దుకూరి క్రియేషన్స్‌ ‘మృత్యుపత్రం’ నాటికలో పల్లెటూరు మహిళ పట్నంలో ఆటో డ్రైవర్‌తో బాడుగ మాట్లాడుకోవటానికి రాగా బ్రతికి ఉన్న మనుషులకైతే రూ. 300, చనిపోయిన వారికి మూడు వేలని ఆటో డ్రైవర్‌ చెబుతాడు. బేరమాడి రెండు వేలకు మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రికి వెడతారు. అక్కడ ఓ కానిస్టేబుల్‌ ఆటోవాడి దగ్గర, ఈ మహిళ వద్ద డబ్బు గుంజుతాడు. తరువాత బిడ్డని ఎలుకలు తింటున్నాయని, రెండు వేలిస్తే శవాన్ని వే రే చోటికి మారుస్తానం టాడు కాంపౌండర్‌. రూ. ఐదువేలిస్తే పోస్టుమార్టం చేస్తానని డాక్టర్‌ చెబుతుంది. ఇలా ఆ మహిళతో డబ్బును ఖర్చు పెట్టిస్తారు. చివరకు పోస్టుమార్టం రిపోర్టులో చేతి మీద పచ్చబొట్టును బట్టి చనిపోయింది ఆటోడ్రైవర్‌ బిడ్డ అని తెలుస్తుంది. పల్లెటూరు మహిళ తన వైద్యానికి తెచ్చుకున్న డబ్బును ప్రమాదంలో మృతి చెందిన తన బిడ్డకు ఖర్చుపెట్టిందని తెలుసుకుని పశ్చాత్తాపంతో ఆమె పాదాలుపై పడతాడు ఆటోడ్రైవర్‌.

తల్లిదండ్రులను వేరుచేయొద్దన్న ‘మనసున మనసై’

మనం చిన్నప్పుడు స్కూల్‌కు వెడితే ఎప్పుడు వస్తామో అని ఎదురు చూస్తారు తల్లితండ్రులు. అదే మనం కాలేజ్‌కు వెడితే ఎలా వస్తామోనని భయం భయంగా ఎదురుచూస్తారు. పెద్దయ్యాక ఉద్యోగానికి దూర ప్రాంతానికి వెడితే బిడ్డ ఈ పండుగకైనా రాకపోతాడా అని ఆశగా ఎదురుచూస్తారు. మరికొందరైతే మార్చురీ బాక్సులో కూడా రోజుల తరబడి ఎదురుచూసే పరిస్థితి. తమ పిల్లలు ప్రయోజకులు కావాలని పేరుప్రతిష్టలు సాధించి సంఘం లో గొప్ప స్థాయికి ఎదగాలని ఆశించి దానికోసం అహర్నిశలు సర్వశక్తులు దారబోసిన తల్లిదండ్రులను కనీసం వృద్ధాప్యంలోనైనా ప్రశాంతంగా ఉండనిద్దాం. మీ పిల్లలతో ఆమ్మానాన్నలను ఆడుకోనిద్దాం... ఆనందం పడతారు . మీ అవసరాల కోసం అమ్మానాన్నలను వాడుకోకండి. వాళ్ళు బాధపడతారు. వృద్ధాప్యంలో వాళ్ళను వేరు చేయకండి కుంగిపోతారు. శరీరాలు రెండైనా మనస్సు ఒక్కటే.. అనే కథాంశంతో మనసున మనసై నాటికను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కలుపు మొక్కలను ఏరివేయాలన్న ‘ప్రక్షాళన’

మనదేశంలో రోజురోజుకీ ఆడవాళ్ళపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రపంచీకరణ సమాజానికేం మేలు చేస్తుందో అర్ధంకాని పరిస్థితి. టెక్నాలజీ మాయలో పడి యువత మొత్తం విలువలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. దీని ఫలితంగా దేశంలో ప్రతి రోజు ఎంతోమంది యువతుల జీవితాలు బలవుతున్నాయి. మహిళల జీవితాలతో ఆటలాడి వారిని బలిగొంటున్న కలుపు మొక్కలను ఏరివేసి ప్రక్షాళన చేయాలన్న సందేశంతో ఈ నాటికను ప్రదర్శించారు.

Updated Date - 2022-12-04T00:51:09+05:30 IST