పాలకొల్లు టు అమరావతి

ABN , First Publish Date - 2022-03-05T06:22:17+05:30 IST

టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లు టు అమరావతి అసెంబ్లీ వరకు సైకిల్‌ యాత్రకు శ్రీకారం చుట్టారు.

పాలకొల్లు టు అమరావతి
ఉండిలో సైకిళ్లపై యాత్ర చేస్తున్న ఎమ్మెల్యేలు నిమ్మల, రామరాజు

టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇవ్వాలని ఎమ్మెల్యే నిమ్మల సైకిల్‌ యాత్ర


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, మార్చి 4 :
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లు టు అమరావతి అసెంబ్లీ వరకు సైకిల్‌ యాత్రకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం పాలకొల్లు టిడ్కో ఇళ్ల నుంచి మొదలైన సైకిల్‌ యాత్ర పాలకోడేరు, వీరవాసరం మీదుగా మధ్యాహ్నం భీమవరం చేరుకుంది. దారి పొడవునా టీడీపీ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఉండిలో ఎమ్మెల్యే రామరాజు జత కలిశారు. అక్కడే ఇరువురు కలిసి భోజనాలు చేశారు. పాములపర్రు, కోలమూరు, ఆరేడు, సరిపల్లి, గణపవరం వరకు 22 కిలోమీటర్లు ఇద్దరూ కలిసి యాత్ర కొనసాగించారు. అనంతరం రాత్రికి నారాయణపురంలో బస చేశారు. శనివారం ఉదయం ఏలూరు, హనుమాన్‌ జంక్షన్‌, విజయవాడ మీదుగా అమరావతికి ఈ యాత్ర కొనసాగిస్తారు. ఈ సందర్భంగా నిమ్మల విలేకరులతో మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల ఆవేదనను అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావించడానికి సైకిల్‌పై వెళుతున్నట్టు తెలిపారు. అసెంబ్లీకి వెళ్లకూడదని టీడీపీ నిర్ణయిస్తే చీఫ్‌ సెక్రటరీకి వినతిపత్రం అందజేసి వస్తాన న్నారు. ‘చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం 90 శాతం పూర్తయ్యింది. జగన్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా మిగిలిన పది శాతాన్ని పూర్తి చేయలేకపోయింది. జగన్‌ పాదయాత్రలో లబ్ధిదారులు 20 ఏళ్ల వరకూ అప్పులు చెల్లిస్తూనే ఉండాల’ని ఎద్దేవా చేశారు. కానీ నేడు ఇదే లబ్ధిదారులను బ్యాంకులకు తీసుకుని వెళ్లి ఎనిమిది లక్షల అప్పు రుద్దుతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించడంలో విఫలమైన సీఎం జగన్‌ ఏ  ముఖం పెట్టుకుని ప్రాజెక్టు సందర్శనకు వచ్చారని ధ్వజమెత్తారు.

Read more