వదలని ముసురు
ABN , First Publish Date - 2022-12-11T00:17:48+05:30 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుఫాన్ వణికిస్తుంది. మూడు రోజులుగా రైతులకు కునుకు లేకుండా చేస్తుంది.
మాండస్ ప్రభావంతో జల్లుల వర్షం
పలు చోట్ల కల్లాల్లోనే ధాన్యం.. ఆందోళనలో రైతులు
వీరవాసరం/పెంటపాడు/ఆచంట/ఇరగవరం, డిసెంబరు 10:బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుఫాన్ వణికిస్తుంది. మూడు రోజులుగా రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. వరికోతలు చేపట్టని రైతులు వర్ష ప్రభావం వల్ల పంటనష్టం సంబవిస్తుందని ఆందోళన చెందుతున్నారు. మాసూళ్లు చేసి రాశులు చేసిన రైతులు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకుంటూ, ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వర్షం ఇదేవిధంగా కొనసాగితే ధాన్యానికి తేమశాతం సమస్యతో పాటు, మొక్కలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ ప్రభావం తేలికపాటి జల్లులు, వర్షం కురుస్తూనే ఉంది. చలిగాలులు పెరిగి చలి తీవ్రత పెరిగింది. పెంటపాడు మండలంలో ఉదయం నుంచి చెదురుమదురుగా జల్లులు పడినప్పటికీ మధ్యాహ్నంనకు వర్షం తగ్గుముఖం పట్టింది. గట్లపైనే ధాన్యం రాశులు ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలుల కారణంగా ఽకల్లాల్లో ధాన్యం బస్తాలపై కప్పిన బరకాలు ఎగిరిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆచంట మండలంలో శనివారం తేలికపాటి వర్షం కురవడంతో ధాన్యం రాశులను బరకాలుతో రైతులు కప్పి తడవకుండా కాపాడుకుంటున్నారు. ఇరగవరం మండలంలో ఉదయం నుంచి చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. వాతావరణ మార్పులతో రైతులు ఎక్కడి ధాన్యాన్ని అక్కడే రాశులుగా వేసి బరకాలు కప్పారు. బరకాలు అందుబాటులో లేని రైతులు గడ్డి, కొబ్బరాకులు కప్పి తడవకుండా ఏర్పాటు చేసుకున్నారు. కోత దశలో ఉన్న వరి చేలలో పలు చోట్ల నీరు చేరి, ఈదురు గాలులకు చేలు నేలనంటాయి.