వీరులారా స్వాగతం..

ABN , First Publish Date - 2022-09-26T05:35:33+05:30 IST

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని.. జై అమరావతి.. జై జైౖ అమరావతి’ వంటి నినాదాల నడుమ అమరావతి మహా పాదయాత్ర కృష్ణా జిల్లాను అధిగమించి ఏలూరు జిల్లాలో అడుగిడింది.

వీరులారా స్వాగతం..
కొణికి వద్ద ఏలూరు జిల్లాలో ప్రవేశిస్తున్న మహాపాదయాత్ర రథం

కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లా  చేరుకున్న మహా పాదయాత్ర

ఏలూరు/పెదపాడు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఒకే రాష్ట్రం ఒకే రాజధాని.. జై అమరావతి.. జై జైౖ అమరావతి’ వంటి నినాదాల నడుమ అమరావతి మహా పాదయాత్ర కృష్ణా జిల్లాను అధిగమించి ఏలూరు జిల్లాలో అడుగిడింది. 14వ రోజు ఆదివారం గుడివాడ పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద నుంచి ప్రారంభమైన పాదయాత్ర 18 కిలోమీటర్లు సాగి పొద్దుపోయాక పెదపాడు మండలం కొణికి వద్ద ఏలూరు జిల్లాలో ప్రవేశించింది. వీరులారా స్వాగతమంటూ ఏలూరు జిల్లా నేతలు పాదయాత్రకు ఎదురెగి స్వాగతం పలికారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి టు అరసవల్లి వరకు మహా పాదయాత్రలో వందలాది మంది రైతులు, రైతు కూలీలు పాలు పంచుకుంటుండగా ఆదివారం వీరికి మరింత మంది మద్దతుగా తోడయ్యారు. ఓ వైపు  పోలీసులు మోహరింపు, మరోవైపు పట్టు వదలకుండా విశ్రమించకుండా అలుపు సొలుపు లేకుండా పాద యాత్రికులు నేరుగా ఏలూరు జిల్లా వైపు కదిలారు. పాద యాత్రికులకు టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు.


 నిర్విరామంగా పాదయాత్ర
ప్రభుత్వ బెదిరింపులు, పోలీసు వత్తిడులు, వైసీసీ సవాళ్లకు వెరవకుండా అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే నినాదంతో పట్టు వీడకుండా వందలాది మంది నిరంతర పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గుడివాడలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏ ఒక్కరిలో భయం కనబడకపోగా ఒక్కింత కసి కనిపించింది. స్థానికులు సాదర స్వాగతం పలకగా రెట్టింపు ఉత్సాహం వీరిలో అడుగడుగునా కనిపించింది. రాత్రి చీకటిలోనే పాదయాత్ర కొణికి వరకూ సాగింది. దారి పొడవునా వీరికి వందలాది మంది సాదర స్వాగతం పలికారు. పాదయాత్రలో పాల్గొన్న వారంతా మరింతగా ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పాదయాత్రలో పాల్గొన్న మహిళలంతా నందివాడ మండలం రామాపురంలో రాత్రి బసచేశారు. పురుషులు మాత్రం కొణికిలో రాత్రి బసకు ఉపక్రమించారు.  వీరి బస ఏర్పాట్లను స్థానికులే దగ్గరుండి పర్యవేక్షించారు. అమరావతి జేఏసీ నేత రాయపాటి శైలజ పాదయాత్ర మహారథాన్ని ముందుకు నడిపిస్తూ మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచారు.

 మాకేమీ అమరావతిలో భూముల్లేవ్‌
 మాజీ ఎమ్మెల్యే చింతమనేని

కొణికి గ్రామానికి చేరుకున్న మహా పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. మహారథాన్ని కొద్దిసేపు అధిరోహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రజా మద్దతు కూడగట్టేందుకే పార్టీలకతీతంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. అంతేకాని అమరావతిలో తమకు భూములు లేవన్నారు. మన జీవితంలో ఇలాంటి పాదయాత్ర మళ్లీ చూడలేమని, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతులు, రైతు కూలీలు, మహిళలు పెద్దఎత్తున స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. గుడివాడలో జరిగిన పాదయాత్ర రాబోయే రోజుల్లో కొందరి నాయకులకు ఒక చెంప పెట్టులాంటిదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పాదయాత్రని, జగన్‌కు కనువిప్పు కోసం కాదని, కనువిప్పు కలగదని చింతమనేని ఎద్దేవా చేశారు. రాజధాని అంశం న్యాయస్థానంలో ఉందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తీర్పు వస్తుందన్నారు. జగన్‌ దయతో బతుకుతున్న మంత్రుల్లో కొందరు మరో రెండేళ్లపాటు జగన్‌ పాటే పాడతారని, ప్రజల కోసం పనిచేయరని అన్నారు.Read more