అదనపు గదుల నిర్మాణం ఎప్పుడో ?

ABN , First Publish Date - 2022-07-15T05:14:31+05:30 IST

కాట్రేనిపాడు జడ్పీ పాఠశాలలో మరో నాలుగు ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయడంతో విద్యార్ధుల సంఖ్య 400కు చేరింది.

అదనపు గదుల నిర్మాణం ఎప్పుడో ?
పాఠశాల స్థలంలో ఉన్న గృహాలు

కాట్రేనిపాడు జడ్పీ పాఠశాలలో విద్యార్థుల అవస్థలు 

గదుల నిర్మాణ స్థలంలో దశాబ్ధకాలంగా 40 కుటుంబాల నివాసం

టీడీపీ హయాంలో నివాసితులకు ఇళ్ల పట్టాలు

పొజిషన్‌ చూపించడంలో రెవెన్యూ అధికారుల జాప్యం 

సమస్య పరిష్కారం కాకపోవడంతో అడ్డంకిగా గదుల నిర్మాణం 


ముసునూరు, జూలై 14 : కాట్రేనిపాడు జడ్పీ పాఠశాలలో మరో నాలుగు ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయడంతో విద్యార్ధుల సంఖ్య 400కు  చేరింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు కూర్చునేందుకు సరిపడ తరగతి గదులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో నాడు–నేడు ఫేజ్‌–2లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.65 లక్షలు మంజూరు చేసింది. అయితే పాఠశాల స్థలంలో దశాబ్ధకాలంగా సూమారు 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ స్థలంలోనే అదనపు తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. నిరుపేదలకు మరోచోట ఇళ్ల స్థలాలు కేటాయిస్తే పాఠశాల స్థలాన్ని ఖాళీ చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. హెచ్‌ఎం సుఽధారాణి, ఉపాధ్యాయులు ఈ సమస్యపై స్పందనలో ఆర్జీ ఇచ్చి నెలలు గడుస్తున్నాయి. విద్యార్థులు కూర్చునేందుకు తరగతి గదులు లేవని, మరుగుదొడ్లు సరిపోవడం లేదని, పాఠశాల స్థలాన్ని ఖాళీ చేయించి, నూతన గదులు నిర్మించేలా చూడా లని మండల ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల దృష్టికి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు. 

టీడీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీ

కాట్రేనిపాడులో అర్హులైన వారితో పాటు పాఠశాల స్థలంలో ఉంటున్న 40 కుటుంబాలతో కలిపి 120 మందికి రెండు సెంట్లు చొప్పున టీడీపీ ప్రభుత్వం 2018లో ఇళ్ల పట్టాలు ఇచ్చింది. లబ్ధిదారులకు పొజిషన్‌ చూపించడంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేయడం, 2019లో ఎన్నికల కోడ్‌ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు చెల్లవు.. తాము చెప్పిన వారికే స్థలాలు ఇవ్వాలని వైసీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని స్థానికులు, టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఏవిధంగా రద్దు చేస్తారని ప్రతిపక్ష నాయకులు, లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన రెవెన్యూ అధికారులు గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలిచ్చిన వారికి పొజిషన్‌ చూపించి పాఠశాల స్థలంలో అదనపు తరగతి గదులను నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు

పాఠశాల స్థలంలో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల రికార్డులను పరిశీలించి, అర్హులకు న్యాయం జరిగేలా చూస్తాం. సమస్య పరిష్కారం కాగానే అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రారంభిస్తాం.

  – సీహెచ్‌ విశ్వనాఽథరావు, ఇన్‌చార్జి తహసీల్దార్‌, ముసునూరు



Updated Date - 2022-07-15T05:14:31+05:30 IST