కైకలూరుతో కైకాల అనుబంధం..
ABN , First Publish Date - 2022-12-24T00:45:33+05:30 IST
సినీ నటుడు కైకాల సత్యనారాయణకు కైకలూరు తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణాన్ని ఆయన అభిమానులు, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ని పాత్రలకు జీవం పోసి తన నటనతో అందరినీ మెప్పించిన నటుడు కైకాల అని పలువురు కొనియాడారు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన మృతి తీరని లోటని టీడీపీ నాయకులు నివాళులర్పించారు.
కైకలూరు, డిసెంబరు 23: సినీ నటుడు కైకాల సత్యనారాయణకు కైకలూరు తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన 1999లో విజయనిర్మల కైక లూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కైకలూరు ప్రజలకు చేరువయ్యారు. 2003లో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు పెద్దకుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. కైకలూరు నియోజకవర్గానికి అత్యంత దగ్గరగా ఉన్న గుడ్లవల్లేరు మండలం కౌతవరం ఆయన స్వగ్రామం కావడం కళాకారుడిగా అనేక నాటకాలను వేయడంతో ఈ ప్రాంత ప్రజల్లో కైకాల గుర్తింపు పొందారు. ఆయన మరణవార్త ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు కైకాలతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. రంగస్థల నటుడిగా ప్రారంభమైన ఆయన జీవితం సినీ, రాజకీయంగా ఎదిగి పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు. ఎన్నికల్లో పరిచయమైన వ్యక్తులను సైతం మరచిపోకుండా కనిపించిన ప్రతి సందర్భంలోను ఆత్మీయంగా పలకరించేవారన్నారు. అలాంటి వ్యక్తి మరణం తీరని లోటుగా ఆయన పేర్కొన్నారు.
ముదినేపల్లి: సినీ నటుడు కైకాల సత్యనారాయణకు ముదినేపల్లితో అనుబంధం ఉంది. ముదినేపల్లి ప్రముఖులు దివంగత ఎర్నేని వెంకటేశ్వరరావు కుటుంబంతో సాన్నిహిత్యం ఉండేది. 1980కు ముందు వరుసగా ప్రతి ఏటా నిర్వహించే యెర్నేని చలమయ్య మెమోరియల్ రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేసేందుకు క్రమం తప్పకుండా మద్రాసు నుంచి ఆయన నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావుతో కలసి వచ్చేవారు. దీంతో కైకాలకు ముదినేపల్లి ప్రముఖులు ఎర్నేని ఉమా ప్రసాద్, డాక్టర్ లక్ష్మణ ప్రసాద్, రామచంద్ర ప్రసాద్‌లతో అనుబంధం ఏర్పడింది. 1996లో ఎంపీగా గెలిచినప్పటి నుంచి టీడీపీ నేతలతో సాన్నిహిత్యం పెరిగింది.
కైకాల మృతి తీరని లోటు..
ఆగిరిపల్లి: ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ మృతి అటు సినీపరిశ్రమకు, ఇటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటని టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు. ఎన్టీఆర్ సమకాలికుడిగా ఆయనతో ఎన్నో చిత్రాల్లో నటించి సినీ సాంగత్యంతో పాటుగా, మచిలీపట్నం ఎంపీగా పోటీచేసి గెలుపొంది రాజకీయ సహచరుడిగా కూడా కొనసాగారన్నారు. సంతాపం తెలిపిన వారిలో చిట్నేని వెంకట శివరామకృష్ణ, కొండా మంగయ్య, మడుపల్లి గోపాల్, మల్లవల్లి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.