ఈ పాపం ఎవరిది ?
ABN , First Publish Date - 2022-11-12T00:07:56+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి జరిగిన బాణసంచా భారీ పేలుడు ప్రమాదంలో కూలీల బతుకులు తెల్లారిపోయాయి.
ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలన
మృతుల కుటుంబాలకు ఆర్డీవో రాజు ఆర్థిక సాయం
తాడేపల్లిగూడెం రూరల్, నవంబరు 11: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి జరిగిన బాణసంచా భారీ పేలుడు ప్రమాదంలో కూలీల బతుకులు తెల్లారిపోయాయి. ఇక ప్రమాదాలకు కారణంపై విచారణ మొదలైంది. దర్యాప్తు చేపట్టారు. అధికారులు ఎవరికి వారే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాణసంచా పేలుడు తయారీ కేంద్రం ధ్వంసమైంది. పరిమితికి మంచి సూర్యకారం, గంధకం నిల్వ ఉండడం వల్లే భారీ ప్రమాదం సంభవించింది. నిల్వలపై అధికారులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. తయారైన బాణసంచా సామగ్రిని పరిగణనలోకి తీసుకోమంటూ చెబుతున్నారు. కేవలం తయారీకి ఉపయోగించే ముడిసరుకును పరిగణనలోకి తీసుకుంటామని చెబుతున్నారు. వాస్తవానికి పదిహేను కిలోలు నిల్వ చేసుకునే విధంగా అధికారులు తయారీదారుడికి అనుమతిచ్చారు. ఆ స్థాయిలో నిల్వ ఉంటే భారీ ప్రమాదం సంభవించేది కాదు. కూలీల ప్రాణాలకు ముప్పు వాటిల్లేది కాదు. మందుగుండు విస్పోటనంతో పది కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించిందంటే ఏ స్థాయిలో ముడిసరుకు నిల్వ ఉందో అర్ధమవుతోంది. ఇవేమి అధికారులకు పట్టినట్టు లేదు. బాణసంచా తయారీకి అనుమతులిచ్చేస్తున్నారు, కొన్నిచోట్ల అనుమతులు లేకుండా తయారు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
చేలల్లో వెతికి గుర్తుపట్టి..
పేలుడు ఘటన స్థలం వద్ద మృతదేహాలు చెల్లా చెదురుగా పడ్డాయి. మృతదేహాల కాలు, కాలుతో ఉన్న మొండెం, మాంసపు ముద్దలు, గుండె, చెవి, వెన్నెముక వంటి విడిభాగాలతో మృతదేహాలను గుర్తించారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన యాళ్ల ప్రసాద్(22) మృత దేహాన్ని గురువారం ఆసుపత్రికి తరలించగా, శుక్రవారం మిగిలిన దెయ్యాల శివ (25)కు చెందిన చేతితో కలిసి ఉన్న మొండెం, దుల్లా వీరవెంకట సత్యనారాయణ (17) సంబంధించిన కాలు, వెన్నెముక లభ్యమవ్వగా వాటిని సమీకరించిన అధికారులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిచారు.
సామగ్రి సర్దినప్పుడే ప్రమాదమా..
ప్రమాద సమయంలో వారితోపాటు అప్పటివరకు ఉండి వెళ్లిన కూలీలను ఆర్డీవో దాసిరాజు విచారించారు. తామంతా ముందే పనిముగించుకుని వెల్లిపోయామని మిగిలిన వారు సామగ్రి సర్వే సమయంలో ఈ పేలుడు సంభవించిందని చెబుతున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలుసుకునేందుకు.. ఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కాలి బూడిద అవ్వ డంతో ప్రస్తుతం గాయాలతో రాజమహేం ద్రవరంలో చికిత్స పొందుతున్న సాల్మన్ రాజు వాంగ్మూలమే కీలకంగా మారనుంది. అయితే సాల్మన్‌రాజును మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలంలో ఇంకా ఆర్డర్‌కు సరిపడా ముందులు లేకపోవడంతో మరికొంత మందులు తయారు చేయించే క్రమంలోనే మంటలు చెలరేగాయని ఆ సమయంలో తాను చెరువులో దూకి ప్రాణాలు కాపాడుకున్నానని తెలిపాడు.
తయారీ కేంద్రానికి అనుమతులు సస్పెండ్
ప్రమాదానికి కారణమైన తయారీ కేంద్రానికి అనుమతులను సస్పెండ్ చేశామని తహసీల్దార్ అప్పారావు తెలిపారు. తయారీ కేంద్రంలో ఇకముందు ఎటువంటి బాణసంచా తయారు చేసేందుకు అవకాశం లేకుండా రద్దు చేస్తామన్నారు. బాణసంచా తయారీ నిర్వాహకుడు పండూరి అన్నవరం పోలీసుల అదుపులో ఉన్నాడని, సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు విచారిస్తున్నట్టు సమాచారం.
మిగిలిన మందుగుండు సామగ్రి ధ్వంసం
పేలుడు కేంద్రానికి సమీపంలో మిగిలిన మందుగుండు సామగ్రిని పోలీసులు ధ్వంసం చేశారు. పేలుడు కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఓ పెంకుటింట్లో చిచ్చుబుడ్డు తదితర మందుగుండు సామగ్రిని పోలీసులు గుర్తించారు. వాటిని నీళ్లతో స్ర్పే చేసి ధ్వంసం చేశారు. ఘటన స్థలాన్ని సీఐ సత్యనారాయణమూర్తి, ఎస్‌ఐ ఎన్ శ్రీనివాస్ పర్యవేక్షించారు.
చేతికి గాయం వల్లే గుర్తుపట్టాం
మేము ఒక అక్క, ఇద్దరు అన్నదమ్ములం. మానాన్న వ్యవసాయం చేసేవారు. నాకు వివాహమైంది. మా తమ్ముడి సంపాదనపైనే ఆధారం. ఇల్లు గడవడం లేదని వారం కిందట పని కోసం వచ్చాడు. నాలుగేళ్ల క్రితం ప్రమాదంలో చేతికి గాయం కావడంతో ఆపరేషన్ చేశారు. అదే ఇప్పుడు వాడిని గుర్తుపట్టేందుకు, చేతితో పాటు మొండెం ఆధారంగా తెలుసుకున్నాం.
– దెయ్యాల దుర్గ, మృతుడు శివ అన్నయ్య
కాలుకు నల్లతాడు వల్ల గుర్తుపట్టాం..
మా అన్నయ్య వాళ్ల అబ్బాయి నాని, వాడికి 16 ఏళ్లు. పదోతరగతి చదివాడు. మా అన్నయ్య లేక పోవడంతో కుటుంబానికి ఆధారం వాడే. ఈ పనికి వచ్చే ముందు కాలుకు నల్ల మొలతాడు కట్టాడు. అదే మాకు ఆధారంగా దొరికిన శరీర భాగాల్లో ఒక కాలు వాడిదని గుర్తుపట్టాం. మా వదిన చూడలేక వెళ్లిపోయింది.
– దుల్లా విష్ణుచక్రరావు, నాని చిన్నాన్న
ఐటీఐ చదువుతూ పనిచేస్తున్నాడు..
మా తమ్ముడు ఎప్పుడూ అందరితో కలిసి పోయేవాడు. వాడు పనిచేసుకుంటూ ఐటీఐ చేస్తున్నాడు. వాడు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు. మా అందరిని వదిలిపెట్టి దూరం వెళ్లిపోయాడు.
– యాళ్ల పెద్దకాపు, ప్రసాద్ అన్నయ్య