అధ్వాన రోడ్లను పట్టించుకోరా..?

ABN , First Publish Date - 2022-07-18T06:37:21+05:30 IST

ముదినేపల్లి మండలంలో రోడ్ల దుస్థితిపై జనసేన గళమెత్తింది.

అధ్వాన రోడ్లను పట్టించుకోరా..?
రమణక్కపేట రహదారిలో నిరసన తెలుపుతున్న జనసైనికులు

పాడైన రహదారుల వద్ద జనసేన ఆందోళన

ముదినేపల్లి, జూలై 17 : ముదినేపల్లి మండలంలో రోడ్ల దుస్థితిపై జనసేన గళమెత్తింది. ఆదివారం ముదినేపల్లి – గుడివాడ జాతీయ రహదారి, ముదినే పల్లి – గుడ్లవల్లేరు రాష్ట్ర రహదారి అధ్వాన్న స్థితిపై సీఎం సార్‌ నిద్ర లేవండి – ఎమ్మెల్యే సార్‌ నిద్ర లేవండి అని నినాదాలు చేస్తూ రోడ్లు అధ్వానంగా ఉన్న ప్రదేశాల్లో బైఠాయించి  నిరసన తెలిపారు.  పార్టీ  మండల అధ్యక్షుడు వీరంకి వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు పోకల దేవేంద్ర కృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, నాయకులు దూసనపూడి బ్రహ్మజీ, వడ్లాని ఆంజనేయులు, అంబుల భరత్‌, అబ్దుల్‌ నజీర్‌, భూపాల నాని తదితరులు మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్ల వల్ల  జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణ  పనులు త్వరగా పూర్తి చేయా లని,   గోతులను పూడ్చాలని డిమాండ్‌ చేశారు.  

చాట్రాయి: సీఎం జగన్‌ అసమర్థ పాలనకు నేటి రహదారుల దుస్థితి అద్దం పడుతోందని జనసేన మండల అధ్యక్షుడు ఆరెల్లి కృష్ణ, ఉపాధ్యక్షుడు తుమ్మలపల్లి పాపారావు ఆరోపించారు.  గుడ్‌ మార్నింగ్‌ సీఎం కార్యక్రమంలో భాగంగా ఆదివారం తుమ్మగూడెం, మర్లపాలెం, పోలవరం గ్రామాల్లో దెబ్బతిన్న రహదారుల వద్ద జనసైనికులు నిరసన తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణంగా రహదారులు దెబ్బతిన్న పరిస్థితి ప్రజలు చూడలేదని,  ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు.  చల్లపల్లి నవీన్‌, సురేష్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

ముసునూరు: రోడ్లు అభివృద్ధిపై ఇప్పటికైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని నూజివీడు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్‌ పాశం నాగబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం రమణక్కపేట – వలసపల్లి ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతల వద్ద నాగబాబు ఆధ్వర్యంలో జనసైనికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ నూజివీడు ఎమ్మెల్యేకు, వారి అనుచరులకు మట్టి, ఇసుక అక్రమాలపై ఉన్న శ్రద్ధ అధ్వానంగా మారిన రోడ్లు మీద లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రహదారులను అభివృద్ధి  చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని లేకుంటే నిరసనలను ఉధృతం చేస్తామ ని నాగబాబు హెచ్చరించారు.  మండల నాయకులు మనురాజు పవన్‌ కళ్యాణ్‌, మట్టా స్వామి, ఉప్పే వంశీ, పవన్‌, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-18T06:37:21+05:30 IST