గందరగోళం

ABN , First Publish Date - 2022-03-18T06:04:54+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న దీవెన నిధులు విడుదలలో గందరగోళం నెలకొంది.

గందరగోళం

అస్తవ్యస్తంగా జగనన్న విద్యా దీవెన అమలు
గతేడాదికి చెందిన ఒక క్వార్టర్‌ బకాయిలు దాటవేత
ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రథమ క్వార్టర్‌ సొమ్ములు విడుదల
ప్రభుత్వం తీరుతో విద్యార్థులు, యాజమాన్యాల్లో ఆందోళన


 (తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న దీవెన నిధులు విడుదలలో  గందరగోళం నెలకొంది. విద్యార్థులకు ఫీజు చెల్లింపులో ఇప్పటికే ఒక ఏడాది జాప్యం చేసింది. మరోవైపు ఒక మూడు నెలల ఫీజును పక్కన పెట్టేసింది.  ప్రభుత్వం తీరుతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు గందరగోళంలో పడ్డాయి. ప్రతి మూడు నెలలకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సొమ్ములు జమచేస్తామని ప్రకటించిన ప్రభుత్వం మాటను నిలబెట్టు కోలేకపోతోంది. ప్రభుత్వం 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి మూడు నెలల (క్వార్టర్‌) ఫీజును బుధవారం విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేసింది. జిల్లాలో రూ.54.96 కోట్లు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌గా చెల్లించింది.  ప్రస్తుతం చెల్లించిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ సొమ్ము 2021 సంవత్సరంలో అక్టోబరు– డిసెంబరు మాసాలకు సంబంధించి చెల్లిం చినట్టు కలెక్టర్‌ తెలిపారు. కళాశాల యాజ మాన్యాలు, విద్యా ర్థుల లెక్కల్లో అది 2021–22 విద్యా సంవత్స రం తొలి త్రైమా సికం ఫీజుగా నిర్ధారించారు.  ప్రతి ఏటా జూలై ఒకటో తేదీ నుంచి మరుసటి ఏడాది జూన్‌ 30వ తేదీ వరకు ఒక అకడమిక్‌ క్యాలెండర్‌ సంవత్సరంగా అమలు చేస్తారు. కరోనా వల్ల గతేడాది అక్టోబరు నుంచి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభ మయ్యాయి. దాంతో అప్పటి నుంచే విద్యా సంవత్సరం ప్రారంభమైనట్టుగా ప్రభుత్వం నిర్ణయించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ చేసింది. అంటే 2021–22 విద్యా సంవత్సరం మొదటి క్వార్టర్‌ను సొమ్మును చెల్లించింది.  
మరోవైపు విద్యార్థులకు 2020–21 విద్యా సంవత్సరానికి చెందిన చివరి  క్వార్టర్‌ సొమ్ములు చెల్లించలేదు. అవికూడా జిల్లాలో దాదాపు రూ. 60 కోట్ల మేర బకాయి ఉంటుందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఫీజు చెల్లించాలనుకుంటే గతంలోని బకాయిలను విడుదల చేయాలి. అలా కాకుండా ఒక క్వార్టర్‌ను చెల్లించకుండా దాటవేసింది.  ఆ ఫీజు ను ప్రభుత్వం చెల్లించకపోతే విద్యార్థులే ఫీజును భరించాల్సి ఉంటుంది.


పీజీ బకాయిల మాటేమిటి..?



జిల్లాలో 2018–19 సంవత్సరానికి సంబంధించి పీజీ బకాయిలు ప్రభు త్వం చెల్లించలేదు. వీరికి విద్యా దీవెన అమలు చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో రూ. 20 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాటిపై  వైసీపీ ప్రభుత్వం  స్పష్టత ఇవ్వడం లేదు.


పేరు మార్చి  ప్రభుత్వం గొప్పలు  


గత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యా సంస్థల ఖాతాలోకి ఫీజును జమచేసేవి. అదే పథకానికి వైసీపీ ప్రభు త్వం జగనన్న విద్యా దీవెన అని నామకరణం చేసి  ఫీజును మాత్రం కళాశాలలకు బదులుగా విద్యార్థుల తల్లుల ఖాతాకే జమ చేస్తోంది. రీయింబర్స్‌ చేసే ఫీజును కళాశాలలకు చెల్లించా లంటూ హైకోర్టు ఆదేశించగా ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ చేసుకుంది. దాంతో మళ్లీ తల్లుల ఖాతాలోనే ప్రస్తుతం సొమ్ములు జమ చేస్తోంది. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకానికి జగనన్న విద్యా దీవెనగా సీఎం పేరిట పథకానికి పేరు మార్చి గొప్పలు చెబుకుంటున్న ప్రభుత్వం వాస్తవానికి ఫీజులు సక్రమంగా చెల్లించకుండా తమ భవిష్యత్‌తో ఆటలాడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-03-18T06:04:54+05:30 IST