ముంచిన వాన

ABN , First Publish Date - 2022-09-10T06:29:27+05:30 IST

వాగులు, వంకల్లోకి భారీగా వర్షపునీరు చేరడంతో పొంగి ప్రవహిస్తున్నాయి.

ముంచిన వాన
పట్టెన్నపాలెంలో రోడ్డు పైనుంచి ప్రవహిస్తున్న జల్లేరువాగు

ఉధృతంగా ప్రవహిస్తున్న డ్రెయిన్లు

 పొంగుతున్న కొండవాగులు

పలు గ్రామాల్లో రాకపోకలు బంద్‌

 చెరువులను తలపిస్తున్న రోడ్లు

కుక్కునూరు: కుక్కునూరు  మండలంలో భారీగా  వర్షం కురిసింది. వాగులు, వంకల్లోకి భారీగా  వర్షపునీరు  చేరడంతో పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, గుం టలు పూర్తిగా నిండాయి. మెట్ట  ప్రాంతంలో విస్తారంగా వేసిన పత్తిపంటకు వర్షంతో తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన  చెందుతున్నారు. వర్షం కారణంగా పూత రాలిపోయి పత్తిపంట నష్టం జరుగుతున్నట్టు  రైతులు  చెబుతున్నారు. 

గణపవరం:  రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయం అవుతున్నాయి. గణపవరం, జల్లికొమ్మర, తాడేపల్లిగూడెం రహదారులు పూర్తిగా జలమయం అయ్యి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా గణపవరం మూడురోడ్ల సెంటర్‌లో మోకాలులోతు గుంత నీటితో నిండి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగుతున్నది. తాడేపల్లిగూడెం నుంచి గణపవరం మీదుగా భీమవరం, భీమవరం నుంచి గణపవరం మీదుగా ఏలూరు రహదారుల మధ్య ఉన్న ఈ పెద్దగొయ్యి ప్రమాదభరితంగా కూడా తయారైంది. 

వేలేరుపాడు: వేలేరుపాడు  మెయిన్‌ రోడ్డులో సుమారు మోకాలు లోతులో  నీరురోడ్డుపై నుంచి  పారింది. బండ్లబోరు గ్రామం  వద్ద  ఉన్నకాజ్‌వేపై నుంచి  సుమారు 4 అడుగుల మేర నీరు ప్రవహించడంతో వేలేరుపాడు–అశ్వారావుపేట మధ్య దాదాపు  మూడు  గంటల  పాటు  ట్రాఫిక్‌ స్థంభించిపోయింది. భారీ వర్షం కారణంగా మండలంలోని వాగులు, వంకలు  పోటెత్తి  పారాయి. 

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం  పరిసర  ప్రాంతాల్లో  శుక్రవారం భారీ  వర్షం  పడింది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. జంగారెడ్డిగూడెం  పట్టణ ంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట  మునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. జంగారెడ్డిగూడెం  పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్డు  గాంధీ బొమ్మసెంటర్‌, పద్మ ధియేటర్‌, అశ్వారావుపేట రోడ్డు, సూర్య కాలేజ్‌రోడ్డు, కొవ్వూరు రోడ్డు, కొత్త పోస్టాపీసు సెంటర్‌లలో ఉన్న  లోతట్టుప్రాంతాలన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే జల్లేరు వాగు  ఉధృతంగా  ప్రవహించడంతో పట్టెన్నపాలెం వద్ద రోడ్డు పైనుంచి ప్రవహించింది. దీంతో కొద్ది సేపు అటుగా రాకపోకలు  బంద్‌ అయ్యాయి. కాలువలు,  జల్లేరు  వాగు  పొంగిపొర్లడంతో  కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంకు వరద నీరొచ్చింది. ఇన్‌ఫ్లో 535 క్యూసెక్కులు  రావడంతో రెండు  గేట్లు ఎత్తి ఇరిగేషన్‌ అధికారులు 535  క్యూసెక్కుల  నీటిని దిగువకు వది లారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 81.85 మీటర్లుగా  నమోదు అయ్యింది.

చింతలపూడి: చింతలపూడిలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు జల్లులు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షం వలన రాబోయే మెట్ట పంటలకు ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు.

పెదవేగి: రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలో రహదారుల్లో గోతులు నీటితో నిండి, వాహనదారులకు కష్టాలు తెస్తున్నాయి. ఎడతెరిపినీ యకుండా వర్షాలు పడుతుండడంతో రహదారులు చిత్తడిగా మారి, బురదమయమై ద్విచక్రవాహనాలపై ప్రజలు ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణాలు చేస్తున్నారు. 

జీలుగుమిల్లి: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు పంటలు దెబ్బతింటున్నా యి. జీలుగుమిల్లి సమీపంలో వారం క్రితం నాటిన వేరుశనగ గింజలు పంట మొలక దశలో వర్షాల వల్ల వరదనీటిలో  కొట్టుకు పోయాయి. ఇదే క్రమంలో పొగాకు బెడ్స్‌(నారు మడులు) వర్షం వల్ల మొలకశాతం తగ్గినట్లు రైతులు వాపోతున్నారు. మండలంలో సుమారు 400 ఎకరాల్లో ప్రస్తుతం వేరుశనగ పంట నాటినట్లు వ్యవసాయ అధికారుల అంచనా. వర్షం నీటికి చెరువులు నిండుగా జలకళ కన్పిస్తోంది. 

ఏజెన్సీలో కుండపోత వర్షం

బుట్టాయగూడెం, సెప్టెంబరు 9: ఏజెన్సీ వ్యాప్తంగా కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు కారణంగా మన్యంలోని కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగు లు పొంగడంతో ఏజెన్సీకి రాకపోకలు స్తంభించాయి. వివిధ అవసరాలు నిమిత్తం బయటకు వచ్చిన జనాలు  వాగులు పొంగడంతో గంటల తరబడి జనాలు వాగుల వద్దనే వేచి ఉండవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. కుండపోత వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపైన గోతుల్లోకి వర్షపునీరు చేరడంతో గోతు లు తెలియక జనాలు ప్రమాదాల బారిన పడుతున్నారు. 




Updated Date - 2022-09-10T06:29:27+05:30 IST