గాంధీజీ.. అడుగుజాడలు

ABN , First Publish Date - 2022-08-08T07:22:47+05:30 IST

దేశ స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జాతిపిత మహాత్మాగాంధీజీ పశ్చిమ గోదా వరి జిల్లా ఏలూరుకు మూడుసార్లు వచ్చారు.

గాంధీజీ.. అడుగుజాడలు
1929లో ఏలూరు బహిరంగ సభ

 ఏలూరులో జాతిపిత 1921,1928, 1934లో  పర్యటన 

స్వాతంత్రోద్యమంలో భాగంగా..


ఏలూరుసిటీ, ఆగస్టు7: దేశ స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జాతిపిత మహాత్మాగాంధీజీ పశ్చిమ గోదా వరి జిల్లా ఏలూరుకు మూడుసార్లు వచ్చారు. దీంతో స్వాతంత్రోద్యమకారుల్లో దేశభక్తి ఇనుమ డింపజేసినట్టయ్యింది. విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్‌ సంఘ సమావేశం నిర్వహించిన తర్వాత ఏపీలోని కొన్ని పట్టణాలను సందర్శించారు. మొదటి సారిగా గాంధీజీ 1921 ఏప్రిల్‌ మూడో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు అనుచరవర్గంతో ఏలూరు రైల్వేస్టేషన్‌లో దిగారు. అప్పటికే స్టేషన్‌ నుంచి పెద్ద వంతెన వరకు రోడ్లపై జనం కిక్కిరిసిపోయారు. ప్లాట్‌ఫారం మీద మోతే గంగరాజు, సోమంచి సీతారామయ్య, వల్లూరి రామారావు, ఎర్రమిల్లి మంగయ్య, వారణాసి శ్రీరామ్మూర్తి, బడేటి వెంకట్రామయ్య నాయుడు వంటి ప్రముఖ నేతలు స్వాగతం పలికి పూల మాలు వేశారు. అనంతరం రెండుగుర్రాల బండిపై బ్యాండు మేళాలతో ఊరేగింపుగా గాంధీజీని పురమందిరానికి తెచ్చారు. 


స్త్రీ సభకు 10 వేల మంది

ఇక్కడ నిర్వహించిన స్త్రీ సభకు 10 వేల మంది మహిళలు హాజరయ్యారు. తర్వాత రామచంద్ర రావుపేటలో సత్తిరాజు శ్యామలాంబ, ఈదర వెం కటసుబ్బమ్మ, కలగర పిచ్చెమ్మ మొదలైన వారిచే నిర్మించబడనున్న స్త్రీ ప్రార్థనా సమాజ భవనానికి గాంధీజీ శంకుస్థాపన చేశారు. ప్రసిద్ధ వేదపండి తులు ఇనుగంటి జగన్నాథ సోమయాజులు గాం ధీజీచే శంకుస్థాపన  జరిపించారు. అనంతరం మా ర్కెండేయస్వామి ఆలయం వద్ద గాంధీజీ కస్తూర్బా ను కలిసి జాతీయ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ విద్యాలయానికి గాంధీ జాతీయ విద్యా లయమని పేరు పెట్టారు. పురమందిరంలో నిర్వ హించిన బహిరంగ సభలో గాంధీజీ గ్రంధి ఆంజనే యులచే బహూకరింపబడిన లోనమాన్య బాలగంగా ధర తిలక్‌ నిలువెత్తు తైలవర్ణ చిత్రపటాన్ని ఆవిష్క రించారు. ఆ మహాసభలో గాంధీజీ తిలక్‌ స్వరాజ్య నిధికి నిర్ణయించిన కోటి రూపాయలు రెండు నెలల వ్యవధిలో వసూలు కావాల్సి ఉన్నదని ప్రభోదించి, ఆ నిధికి సహాయం చేయాల్సిందిగా అర్థించారు. వెను వెంటనే ఆ సభలో అనేక మంది 10 రూపాయల నుంచి 25 రూపాయల వరకు విరాళాలి చ్చారు. కలగర సుబ్బమ్మ 10 కాసుల బంగారపు కడ్డీని, ఒక బంగారు మురుగు మహాత్ము నికి సమ ర్పించగా, వారధి వేలం వేయగా 200 రూపాయలు వచ్చింది. అలాగే చిలుకూరు నరసింహారావు సమర్పించిన చేతికర్రను వేలం వేయగా మోతే గంగరాజు 200 రూపాయలకు కొనుగోలు చేశారు. మహాత్మునికి సమ ర్పించిన ఒక ఖద్దరు కండు వాను గ్రంఽథి రామ్మూర్తి 35 రూపాయలకు కొనుగోలు చేశారు. మహాత్ముని మెడలోని పూలమాలను కందుల రాజయ్య 300 రూపాయలకు కొనుగోలు చేశారు. మరో పూలమాల 45 రూపాయలకు అమ్ముడుపో యింది. ఇంకనూ అనేక గడియారాలు, మొదలైన వస్తువులున్నప్పటికీ వాటిని వేలం వేయుటకు వ్యవధిలేకపోయింది. ఆ సందర్భంలో గాంధీజీకి, జాతీయ విద్యాలయ వ్యవస్థాపనా దీక్షా సంఘం వారు వినతి పత్రం సమర్పిస్తూ విద్యాలయం నిమిత్తం అప్పటికి తాము రూ.62,483లు వసూలు చేయగలిగామని చెప్పటం జరిగింది. ఆ సందర్భంలోనే ఎర్రమిల్లి మంగయ్య తమ వకీలు వృత్తిని విసర్జిస్తున్నానని ప్రకటించటం జరిగింది. విజయవాడ అఖిల భారత కాంగెరస్‌ సమావేశానికి ఏలూరు నుండి కమ్ముల అప్పన్న, కమ్ముల తిరుపతి రాయుడు  శిరిపల్లి శీతారామయ్య హాజరయ్యారు. వారు గాంధీజీని కలుసుకుని ఆనాటి నుండి తామే కాంగ్రెస్‌ సేవ చేస్తామని ఖద్దరు తప్ప ఇతరములు ధరించమని శాఖాహారులుగా జీవిస్తామని ప్రమాణం చేశారు. 


ఖాదీ నిధి వసూలు నిమిత్తం 


గాంధీజీ 1928 ఏప్రిల్‌ 23లో ఖాధీ నిధి వసూలు నిమిత్తం ఆంధ్రదేశమంతా తిరిగినప్పుడు, 1934లో హరిజన యాత్ర చేసినప్పుడు ఏలూరులో గాంధీ జాతీయ విద్యాలయంనందు బస చేశారు. అలాగే అస్పృశ్యత నివారణ నిమిత్తం గాంధీజీ 1933 డిసెంబర్‌ 26లో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించే సమయంలో ఏలూరుకు వచ్చారు. ఏలూరు ప్రయాణమైనప్పుడు దారిలో తాడేపల్లిగూడెం సాహితీ సమితి తరపున 200 మంది స్త్రీలు దామోజీపురపు నరసింహరావు ఇంటివద్ద మహాత్ముని కారు ఆపి 116 రూపాయలు అందించారు. తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు రైలు లో వెళ్తునప్పుడు దారిలో కైకరం, పూళ్ళ, భీమడోలు, దెందులూరు రైల్వే స్టేషన్లలో వేలాది మంది జనం హరిజన నిధికి విరాళాలిచ్చారు. ఏలూరులో డిసెంబరు 3వ తేదీనే గాంధీజీ సన్మాన సంఘం ఏర్పాటైంది. ఏలూరు రైల్వే స్టేషన్‌లో గాంధీజీకి వేలాదిమంది జనం స్వాగతం పలికారు. రైలు దిగగానే తాడేపల్లి సత్యవతీదేవి ( డా. అనంతశాస్త్రి భార్య) 116 రూపాయిలు విలువ గల బంగారు గొలుసును , బంగారు కుంకుమ భరిణి సమ ర్పించారు. గాంధీజీ పురపాలక సంఘ కార్యాల యానికి వెళ్ళారు. అక్కడ పురపాలక సంఘ అధ్యక్షులు మోతే నరసిం హరావు తమ సంఘం తరపున స్వాగత పత్రాన్ని, 116 రూపా యలను, పశ్చిమగోదావరి జిల్లా బోర్డు తర పున అధ్యక్షులు బడేటి వెంకట్రామయ్య నాయుడు సన్మానపత్రాన్ని 116 రూపాయలను, ఒక వెండి గిన్నెను హరిజన నిధికి సమర్పించారు. పౌరుల కోరికపై గాంధీజీ స్వర్గీయ లాలాలజిపతిరాయ్‌ చిత్రప టాన్ని ఆవిష్కరించారు. అదేరోజు సాయంకాలం ఏలూరు వాటర్‌వర్క్స్‌ వద్దనున్న మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు దానికి గాంధీ మైదానంగా పేరు వచ్చింది. రైల్వేస్టేషన్‌ నుంచి మైదానం వరకు స్కౌట్సు, కాం గ్రెస్‌ స్వచ్ఛంధ సేవకులు, దారిపొడగునా నిలబడి గాంధీజీ ప్రయాణాన్ని సజావుగా సాగేలా చేశారు. సభకు దాదాపు 30 వేల మంది హాజరయ్యారు. అక్కడ పలువురు తమ విరాళాలను ఇవ్వటం జరి గింది. గాంధీజీ ఆ సభలో 20 నిమిషాలు ప్రసం గించారు. ఆ బహిరంగసభలో మొత్తం 57 ఉంగరా లు, 26 బంగారు గాజులు, ఒక బంగారు గొలుసు, బంగారు నాగరం, వజ్రంపొదిగిన చామంతి పువ్వు, కొన్ని షరతులు, ప్రాంకులు, నగదు విరాళాలను గాం ధీజీకి సమర్పించారు. అక్కడే చెన్నాబత్తుల వీరా చారి గాంఽధీజీకి ఒక వెండిపళ్లెం, ఒక వెండిగిన్నె , ఒక వెండి గోవుప్రతిమ ఇవ్వటం జరిగింది. సా యంకాలం గాంధీజీ జాతీయ విద్యాలయంలో కొంత తడవు విశ్రాంతి తీసుకుని అనంతరం పెన్నవల్లి వారి పేట హరిజనవాడకు వెళ్లారు. ఆ పేట హరిజ నులు మంగళవాయుద్యాలతో ఎదురేగి గాంధీజీని తీసుకొని రాగా పేట ప్రవేశిస్తుండగా.. 200 మంది హరిజన స్వచ్ఛంద సేవకులు తెల్లని వస్త్రాలు ధరించి గాంధీజీకి గౌరవ వందనం సమర్పించారు. అక్కడ బహిరంగ సభలో చిరకాలం నుంచి హరి జన సేవ చేస్తున్న వెల్లంకి కృష్ణమూర్తి , హరిజన వాడ నాయకులు రాయడు గంగయ్యలతో పాటు అనేక మంది గాంధీజీకి స్వాగతం పలికారు. సభా నంతరం తిరిగి గాంధీజీ జాతీయ విద్యాలయంలో రాత్రి గడిపారు. అక్కడే హిందీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వెండిపతకాలు గాంధీజీ అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆనాడు నిర్వహించిన ఒకరోజు గాంధీజీ పర్యటనలో హరిజన నిధికి రూ. 8181 నగదుకు గాను, రూ.2315 నగల రూపంలో జిల్లా వాసులు సమర్పించారు. ఈ విధంగా గాంధీజీ ఏలూరులో నిర్వహించిన పర్యటనలు స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చాయి. Updated Date - 2022-08-08T07:22:47+05:30 IST