గణపవరం విలీనంపై రగులుతున్న రగడ
ABN , First Publish Date - 2022-12-09T00:18:54+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లాలోకి గణపవరం మండ లం విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఈనెల పదో తేదీతో ముగుస్తుందని, భీమవరం డివిజన్‌లో గణపవరం ఉండేలా సమష్టిగా కృషి చేయాలని ఎంపీపీ దండు వెంకటరామారాజు (రాము) కోరారు.
ఏలూరు జిల్లాలోనే ‘గణపవరం’ ఉంచాలని పలువురు సర్పంచ్‌ల సంతకాల సేకరణ
రేపటితో నోటిఫికేషన్ గడువు పూర్తి.. విలీనంపై భిన్నాభిప్రాయాలు
గణపవరం, డిసెంబరు 8 :పశ్చిమ గోదావరి జిల్లాలోకి గణపవరం మండ లం విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఈనెల పదో తేదీతో ముగుస్తుందని, భీమవరం డివిజన్‌లో గణపవరం ఉండేలా సమష్టిగా కృషి చేయాలని ఎంపీపీ దండు వెంకటరామారాజు (రాము) కోరారు. పశ్చిమలో గణపవరం మండలం విలీనంపై వివాదం రగులుతున్న నేపథ్యంలో గురువా రం గణపవరం దండు మారెమ్మ ఆలయ ప్రాంగణంలో పలు సామాజిక, రాజకీయ పార్టీ నేతలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొంతమంది సర్పంచ్‌లు, రాజకీయ నేతలు గణపవరం మండలాన్ని పశ్చిమలో కాకుండా యథావిధిగా ఏలూరు జిల్లా లోనే ఉంచాలని మండల సర్పంచ్‌లతో సంతకాల సేకరణ నిర్వహిస్తున్నారు. 20 కిలోమీటర్లు దూరంలో భీమవరం డివిజన్‌లోనే గణపవరం ఉండడం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీపీ రాముతో సహా పలువురు పేర్కొన్నారు. విద్యా, వైద్యం, వ్యాపారం మరింత అందుబాటులోకి వస్తాయ న్నారు. ఏలూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉందని దశాబ్ధాకాలంపైగా గణపవరం నుంచి ఏలూరుకు ఆర్‌టీసీ బస్సు సౌకర్యం కూడా లేదన్నారు. భీమవరంలో అయితే గణపవరం మండలానికి ఆర్థికపరంగా ఎంతో సౌలభ్యంగా ఉంటుందని మరికొంతమంది నేతలు పేర్కొన్నారు. నోటిఫికేషన్ గడువు ఒక రోజు మాత్రమే ఉండడంతో ప్రజల నుంచి ఆధార్‌కార్డు సాయంతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సత్వరం నిర్వహించి కలెక్టర్‌కు పంపిణీ చేయాలని సమావేశంలో తీర్మానించారు. గ్రామ ఉప సర్పంచ్ దండు రాము, ప్రముఖులు సరిపల్లె చిన్న, గొట్టుముక్కల మార్రాజు, నంద్యాల రాజశేఖర్‌రాజు. నంద్యాల మదన్, కూసంపూడి సురేంద్రకుమార్‌రాజు, వంకాయల రామారావు, సురేష్, వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.