తొలగని ముంపు సమస్య

ABN , First Publish Date - 2022-07-27T05:54:09+05:30 IST

కూచింపూడిని వరద సమస్య వదలడం లేదు

తొలగని ముంపు సమస్య
కూచింపూడిలో కాల్వను తలపిస్తున్న ప్రధాన రహదారి

కూచింపూడి రహదారిపై మోకాలి లోతు నీరు 

పెదవేగి, జూలై 26 : కూచింపూడిని వరద సమస్య వదలడం లేదు. వర్షం తగ్గినా డ్రెయిన్లు సక్రమంగా లేకపోవడంతో ముంపు సమస్య తొలగలేదు. కొంతమంది చేసే నిర్వాకం అందరినీ నీటిలోనే నాన్చుతోంది. కూచింపూడిలో గోపన్నపాలెం– బాదరాల ప్రధాన రహదారి కిలోమీటరు మేర నిత్యం మోకాలిలోతు నీరు ప్రవహిస్తూ, గుంతలు ఏర్పడి, ప్రమాదకరంగా మారింది. రహదారికి ఎగువ భాగాన కొంతమంది అడ్డుగా మట్టికట్ట వేయడంతో నీరు డ్రెయిన్లను వదిలి రహదారిపైకి చేరుతోంది. రోడ్డు మరింత అధ్వానంగా తయారై ప్రమాదాలకు నిలయంగా మారింది. కూచింపూడి ఎగువ భాగంనుంచి వాడకం నీటితోపాటు మెట్ట ప్రాంతం నుంచి ఊటనీరు నిత్యం వస్తోంది. ప్రజల ఆందోళనల ఫలి తంగా ఐదేళ్లకిందట ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మించారు. కొంతకాలం పాటు వరదనీటి సమస్య కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ రహదారిపై నీరు నిలిచి, రహదారి ఎగువ భాగాన ఉన్న ఇళ్లను ముంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడంతోపాటు ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. దీనికి కారణం రహదారి పక్కన మురుగనీరు, వర్షపునీరు పారడానికి అనువుగా కాల్వ లేకపోవడమే. గతంలో కచ్చా డ్రెయిన్‌ ఉండేది. కానీ అది పూడుకుపోవడంతో రహదారినే నీరు పారుతోంది. రహదారి పక్కన డ్రెయిన్‌ తవ్వకం జరిపితే వర్షపునీరు రహదారిపైకి చేరదని, నేరుగా కల్వర్టునుంచి దిగువునకు వెళ్ళిపోతుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి, రహదారి పక్కన డ్రెయిన్‌ తవ్వించి, వరదనీటి సమస్య నుంచి విముక్తి కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2022-07-27T05:54:09+05:30 IST