వరద బాధితులకు దాతల సాయం

ABN , First Publish Date - 2022-07-18T06:01:00+05:30 IST

జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశాల మేరకు జిల్లా రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో వరద బాధితులకు 500 మిల్క్‌పౌడర్‌ ప్యాకెట్లు, బిస్కెట్‌ ప్యాకెట్లను జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బీవీ కృష్ణారెడ్డి, కార్యదర్శి బి. బెన్సీ ఆదివారం డీఆర్వో కంభంపాటి రాజ్యలక్ష్మికి అందజేశారు.

వరద బాధితులకు దాతల సాయం
మిల్క్‌పౌడర్‌ ప్యాకెట్లను అందజేస్తున్న రెడ్‌క్రాస్‌ సిబ్బంది

వారం రోజలుగా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలు నీట మునిగాయి. కట్టుబట్టలతో ఆయా గ్రామస్థులు పునరావాస కేంద్రాలకు చేరుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. వీరికి సాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. ఆహార పానీయాలు, మిల్క్‌పౌడర్‌ ప్యాకెట్లు, బిస్కెట్‌, వాటర్‌ ప్యాకెట్లు, జామకాయలు, కూరగాయలు అందిస్తూ సాయపడుతున్నారు. మేమున్నామంటూ  నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పరామర్శిస్తూ ఆయా ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.  

ఏలూరు కలెక్టరేట్‌, జూలై 17 : జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశాల మేరకు జిల్లా రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో వరద బాధితులకు 500 మిల్క్‌పౌడర్‌ ప్యాకెట్లు, బిస్కెట్‌ ప్యాకెట్లను జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బీవీ కృష్ణారెడ్డి, కార్యదర్శి బి. బెన్సీ ఆదివారం డీఆర్వో కంభంపాటి రాజ్యలక్ష్మికి అందజేశారు. వీటిని వరద బాధితులకు పంపిణీ చేయనున్నారు. ఫ్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌ఛార్జి ఈ.శ్రీధర్‌, రెడ్‌క్రాస్‌ డిస్ట్రిక్ట్‌ కో–ఆర్డినేటర్‌ బి.నాగరాజు, సతీష్‌ పాల్గొన్నారు. 

జీలుగుమిల్లి హీరో షోరూం వారి ఆధ్వర్యంలో..

జీలుగుమిల్లి: కుక్కునూరులో వరద బాధితులకు జీలుగుమిల్లి హీరో షోరూం నిర్వాహకులు ఆధ్వర్యలో వంద కిలోల బియ్యం, ఇతర వంటకాలు, మంచినీళ్ల ప్యాకెట్లు అందించారు.కక్కిరాల ఉపేంద్ర, సాధు చెన్నారావు, గాడిచర్ల శ్రీను ఉన్నారు

శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో..

కుక్కునూరు : తెలంగాణలోని అశ్వారావుపేటకు చెందిన శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంకు చెందిన  వారు నిర్వాసితులకు పలు రకాల ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. కివ్వాక పునరావాస కాలనీలో వెయ్యి మందికి సాంబారు భోజన ప్యాకెట్‌లు, 500 మందికి కిచిడీ, 15 బాక్స్‌ల బిస్కెట్‌లు, 30 బస్తాల వాటర్‌ ప్యాకెట్‌లు, 250 ప్యాకెట్‌ల పెరుగు, రెండు బస్తాల జామకాయలు, 300 కిట్ల కూరగాయలు బాధితులకు అందజేశారు.

టీడీపీ నేత రావూరి కృష్ణ ఆధ్వర్యంలో..

జంగారెడ్డిగూడెం : వరద బాధితులను జంగారెడ్డిగూడెం టీడీపీ అధ్యక్షుడు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో దుప్పట్లు, ఆహార పదార్థాలను ఆదివారం పంపిణీ చేశారు. వేలేరుపాడు మండలం వసంతవాడ, బండలబోరు, భూదేవిపేట, గాలివారిగుంపు, నాగులగూడెం గ్రామాల్లో వరద బాధితులను పరామర్శించి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలని కోరారు. టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణ, పగడం సౌభాగ్యవతి, రమాదేవి, గొల్లపూడి శ్రీదేవి, గోల్లపూడి రమేష్‌, కోండ్రు నాగరాజు, ముళ్లపూడి శ్రీనివాసరావు, నాయుడు శ్రీను, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆవును రక్షించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

వేలేరుపాడు : ఎంపీడీవో కార్యాలయ సమీపంలో వరదలో చిక్కుకుపోయి వారం రోజులుగా ఇబ్బంది పడుతున్న ఓ ఆవును ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఇతర అధికారులు ఆదివారం మధ్యాహ్నం ముంపునకు గురైన ప్రభుత్వ కార్యాలయాలను చూసేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన రెండు బోట్లలో వెళ్లారు. ఆ సమయంలో ఆవు వరదలో చిక్కుకుపోయి ఉండడాన్ని గమనించి రక్షించి శివకాశీపురానికి చేర్చారు. కలెక్టర్‌ ఆవును పరిశీలించి తక్షణ వైద్యం అందించాల్సిందిగా పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. 






Updated Date - 2022-07-18T06:01:00+05:30 IST