ఆధునిక సాగు పద్ధతులు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-12-31T01:09:32+05:30 IST

ఆయిల్‌ పామ్‌ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను చేపట్టి, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించాలని ఏలూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు కోరారు.

ఆధునిక సాగు పద్ధతులు చేపట్టాలి
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న జేసీ అరుణ్‌ బాబు

ముసునూరు, డిసెంబరు 30: ఆయిల్‌ పామ్‌ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను చేపట్టి, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించాలని ఏలూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు కోరారు. ముసునూరులో గోద్రెజ్‌ కంపెనీ నిర్మించిన వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ సెంటర్‌ ‘సమాధాన్‌’ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిస్తోందని, దేశంలో అత్యధికంగా మన రాష్ట్రంలో 2.43 లక్షల హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగు జరుగుతుండగా, ఏలూరు జిల్లాలో 22 మండలాల్లో సుమారు 50 వేల హెక్టార్లుల్లో సాగవుతోందన్నారు. ఆయిల్‌ పామ్‌పై ఆసక్తి చూపుతున్న రైతులందరికీ సకాలంలో మొక్కలు అందించటంతో పాటు ఇతర ప్రోత్సాహ కాలను అందిస్తామన్నారు. పామాయిల్‌ రైతుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ‘సమాధాన్‌’ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేసీ కోరారు. గోద్రెజ్‌ సీఈవో సౌగతి నియోగి మాట్లాడుతూ ఈ కేంద్రంలో ఆయిల్‌ పామ్‌ మొక్కలు, అన్ని పంటలకు సంబంధించిన ఎరువులు, పురుగు మందులు, బిందు సేద్యం, యంత్ర పరికరాలు రైతులకు అందుబాటులో ఉంటాయన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి సలహాలతో పాటు పామా యిల్‌ సాగుపై రైతులకు శిక్షణ ఇస్తామని వివరించారు. అనంతరం 10 మంది ఆయిల్‌ పామ్‌ రైతులను సంస్థ సీఈవో సన్మానించారు. నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్ష్‌ రాజేంద్రన్‌, ఎంపీపీ కృష్ణకుమారి, జడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్‌, తహసీల్దార్‌ సుధ, ఎంపీడీవో జి.రాణి, మైక్రో ఇరిగేషన్‌ పీడీ రవికుమార్‌, ఏడీహెచ్‌ శాంతి, శాస్త్రవేత్త రామచంద్రన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:09:32+05:30 IST

Read more