రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపండి
ABN , First Publish Date - 2022-06-26T06:03:53+05:30 IST
రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపండి

ఎన్‌హెచ్‌ల అనుసంధాన రోడ్లు పూర్తి చేయండి
అధికారులకు రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కృష్ణబాబు ఆదేశం
భీమవరం, జూన్ 25: జిల్లాలో నేషనల్ హైవే 216, 165ల అనుసంధాన రోడ్లును పూర్తి చేయాలని, దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులకు తక్షణమే ప్రతిపాదనలు పంపించాలని రోడ్లు భవనాలశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంతితో కలిసి శనివారం అధికారులతో ఆయన సమీక్షించారు. భీమవరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రోడ్డు ఎక్కడ పాడైనా వెంటనే వాటిని బాగు చేసేందుకు పత్రిపాదనలు పంపాలన్నారు. జిల్లాలో కొన్ని రోడ్లకు టెండర్లు పిలిచినా స్పందన లేదని ఈఈ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్లతో మాట్లాడి నచ్చచెప్పి టెండర్లు వేసేలా అధికారులు చూడాలని కృష్ణబాబు ఆదేశించారు. జిల్లాలో రోడ్లు పనుల ప్రగతిని ఆయన సమీక్షించారు. జిల్లాలో కొన్ని రోడ్ల పనులు మధ్యలో నిలిచిపోయాయని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ జేవీ మురళి, రోడ్లశాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, భవనాలశాఖ ఛీప్ ఇంజనీర్ పీసీ రమేష్‌కుమార్, రోడ్లు, భవనాల సూపరిండెంట్ ఇంజనీర్ నిర్మల, ఆర్‌డీవో దాసిరాజు, ఈఈ లోకేశ్వరరావు పాల్గొన్నారు.