అక్కడా..ఇక్కడా..?

ABN , First Publish Date - 2022-04-05T05:54:19+05:30 IST

కొత్త జిల్లాల ఆవిర్భావం సోమవారం ఉదయం ఆరంభమైంది. ముహూర్తం ఖరారుకాగా శని, ఆదివారాలనాటికే బదిలీల జాబితాలు లేదా నియామక జాబితాలు అందుతాయని అందరూ నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆది నుంచి ఈ నియామకాలపై తీవ్ర గందరగోళ పరిస్థితిని ఉద్యోగులు చవిచూస్తూనే వచ్చారు

అక్కడా..ఇక్కడా..?

చివరి క్షణాల్లో తీవ్ర గందరగోళం

ఆవిర్భావానికి కొద్ది గంటల ముందే 

బదిలీ జాబితాలు విడుదల

కొన్ని శాఖల్లో అందరిదీ సస్పెన్స్‌

మరికొన్ని అధికారుల హోదా, 

శాఖల పేర్లు మార్పు

రోజంతా ఇదే టెన్షన్‌


ఒకవైపు కొత్త జిల్లా ఆవిర్భావం. మరోవైపు గడిచిన రెండు రోజులుగా ఉద్యోగులు, అధికారుల్లో బదిలీ టెన్షన్‌. అంతకంటే మించి తీవ్ర గందరగోళ పరిస్థితులు. ఏలూరు జిల్లాలో ఉంటామా, లేక భీమవరం కేంద్రంగా ఏర్పడే పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్తామా అనే టెన్షన్‌ పడని ఉద్యోగి అంటూ లేరు. అన్ని శాఖల్లోనూ ఉన్నతాధికారుల నుంచి నాల్గవ తరగతి ఉద్యోగులు వరకు బదిలీ జాబితాలు ఎప్పుడు వెలువడతాయా అని క్షణం ఒక యుగంలా ఎదురుచూస్తూనే ఉన్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి) 

 కొత్త జిల్లాల ఆవిర్భావం సోమవారం ఉదయం ఆరంభమైంది.  ముహూర్తం ఖరారుకాగా శని, ఆదివారాలనాటికే బదిలీల జాబితాలు లేదా నియామక జాబితాలు అందుతాయని అందరూ నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆది నుంచి ఈ నియామకాలపై తీవ్ర గందరగోళ పరిస్థితిని ఉద్యోగులు చవిచూస్తూనే వచ్చారు. ఆఖరుకి కొత్త జిల్లాల ఆవిర్భావం ముహూర్తానికి కొద్ది గంటలు ముందు కూడా ఇదే పరిస్థితిని చవిచూశారు. ఉమ్మడి జిల్లాగా పశ్చిమగోదావరిలో ఉన్న ఉద్యోగులను దామాషా నిష్పత్తిలో వర్క్‌ టూ సర్వ్‌ పేరిట కొత్త జిల్లా కేంద్రం భీమవరానికి బదలాయించారు. ఆ లెక్కన దాదాపు 67 ప్రభుత్వ విభాగాల్లో అధికారుల స్థాయిని బట్టి లెక్కలు కట్టారు. కాని ఇంత సుదీర్ఘ ప్రక్రియ సాగినా అనేక మార్పులు, చేర్పులకు వీలుగా గడిచిన వారం రోజులుగా ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచినా, ఆదేశాలు వెలువడినా కూడా సోమవారం నాటికి ఉద్యోగుల అసంతృప్తిని చల్లార్చలేకపోయారు. ఎవరూ ఊహించని విధంగా అధికారులు దగ్గర నుంచి సిబ్బంది వరకు వెలువడిన బదిలీలు అందరినీ నివ్వెరపోయేలా చేశాయి. తొలుత సీనియర్లు కొత్తగా ఏర్పడబోయే జిల్లాల్లో ఆ తదుపరి స్థానాల్లో ఉన్న అధికారులు పాత జిల్లా కేంద్రంలోనే కొనసాగేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, తదుపరి వీటిలో మార్పులు, చేర్పులు జరిగాయి. దీంతో వీరిలో ఎవరెక్కడ అనే సందేహం తొంగి చూసింది. ఒక్కొ శాఖలో ఒక్కొ రీతిలో ఈ ప్రక్రియ సాగినట్టు చెబుతున్నారు. సమాచార శాఖ ఏడీగా ఉన్న సీనియర్‌ అధికారి నాగార్జునను పశ్చిమ గోదావరికి బదిలీ చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయనతోపాటు మరో డజను మంది సీనియర్‌ అధికారులను ఏలూరులోనే కొన సాగించి మరికొందరికి కొత్త జిల్లాకు బదలాయించబో తున్నట్టు ప్రచారం సాగింది. అదంతా తుస్సున వీగిపోయింది. తొలుత వెలువడిన ఉత్తర్వులు ప్రకారమే ప్రతీ శాఖలోనూ ఉన్న సిబ్బందిని, అధికారులను లెక్కకట్టి మరీ నిష్పత్తి ప్రకారం రెండు జిల్లాల్లోనూ సర్దుబాటు చేశారు. వివిధ శాఖాధిపతుల విషయం లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. పోలీసుశాఖలోనూ బదిలీల కసరత్తు సోమవారం వరకు సుదీర్ఘంగానే సాగింది. డీఐజిగా పాల్‌ రాజు, ఎస్పీగా రాహుల్‌దేవ్‌ శర్మ ఏలూరు జిల్లాకు బాధ్యతలు స్వీకరించగా.. తాజాగా అడిషనల్‌ ఎస్పీని నియమిస్తూ సోమవారం నాడే ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే కలెక్టరేట్‌లోని విభాగాలకు తరలించే సమయంలోనూ ఇలాంటి పరిస్థితే స్పష్టంగా బయటపడింది. దీనికితోడు ఇంతకుముందున్న శాఖలు, అధికారుల హోదాల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. ప్రజా రవాణా శాఖ (పూర్వ ఆర్టీసి)లో పనిచేసే అధికారుల హోదాలు మార్చేశారు. ఇంతకు ముందు డిబిఎంగా ఉండే అధికారుల హోదాను జిల్లా రవాణా అధికారి పేరిట మార్పు చేశారు. జిల్లా హౌసింగ్‌ శాఖలో ఇంతకుముందు శాఖాధిపతికి సూపరిం టెండెంటెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) హోదా ఉండేది. ఇప్పుడు దానిని మార్చి డిస్టిక్ట్‌ హౌసింగ్‌ హెడ్‌ పేరిట మార్పులు, చేర్పులు చేశారు. అలాగే డీఆర్‌డీఏ, డ్వామాను ఒక్కటిగా చేసేశారు. దీని ప్రకారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి అధికారి(డీఆర్‌డీవో)గా మార్పులు చేశారు. ఈరకంగా వరుసగా శాఖల పేర్లే కాకుండా, హోదాల పేర్లలోను మార్పులు పునర్విభజనలో తొంగి చూశాయి. అంతకంటే మించి ఇంతకుముందున్న పాలనా అధికారుల వరుసను ఒకింత కుదించారు. కలెక్టర్‌, ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లు, ఒక డీఆర్‌వో ఉండే కలెక్టరేట్‌లో ఇప్పుడు కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్వోతో సరిపెట్టారు. ముహూర్తం దాటినా కూడా ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ విభాగాల్లో వర్క్‌ టూ సర్వ్‌ పేరిట ఇంకా నియామకాలు పూర్తికాకపోవడం విశేషం. ‘కొత్త జిల్లాల పుణ్యమా అని మాకిన్ని కష్టాలు. ఇప్పటికే సర్కారుతో మొట్టికాయలు అనేకసార్లు కొట్టించుకున్నాం. ఈసారి కూడా తప్పలేదు. ఇక చేసేదేముంది’ ఉద్యోగులు నేరుగానే వ్యాఖ్యలు చేశారు.


Updated Date - 2022-04-05T05:54:19+05:30 IST