కూర్చునేందుకు.. కుర్చీల్లేవ్‌!

ABN , First Publish Date - 2022-04-05T06:45:01+05:30 IST

నవీన పశ్చిమ ఆవిర్భావం రోజే ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

కూర్చునేందుకు.. కుర్చీల్లేవ్‌!
ఇంకా పూర్తి కాని పనులు.. అరకొర వసతులతో మహిళా ఉద్యోగి అవస్థ

తొలిరోజు ఉద్యోగులకు చేదు అనుభవం

వసతులు లేక సిబ్బంది బిక్కమొహం 

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

నవీన పశ్చిమ ఆవిర్భావం రోజే ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అధికార పార్టీ నాయకులు అత్యంత ఉత్సాహంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నా ఉద్యోగులకు తిప్పలు తప్పలేదు. ఎండలు మండుతుండడంతో తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. కనీసం సమృద్ధిగా మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎంపిక నుంచి, సౌకర్యాలు కల్పన వరకు అధికారులు టెన్షన్‌ పడ్డారు. సమయాభావం తక్కువగా ఉండడంతో సౌరన వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేసిన ఉద్యోగులను భీమవరం కేంద్రంగా ఏర్పాటైన పశ్చిమకు కేటాయించారు. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ ప్రారంభంలో విధుల్లో చేరేందుకు ఉద్యోగులంతా చేరుకున్నారు. ఉత్సాహంతో విధులకు హాజరవుదామంటూ వచ్చిన ఉద్యోగులు ఇక్కడ సమకూరిన వసతులను చూసి అవాక్కయ్యారు. కలెక్టర్‌ ఛాంబర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌, వీడియో కాన్ఫరెన్స్‌ హాళ్లనే పూర్తిస్థాయిలో ఏర్పాటుచేశారు. మిగిలిన 20 శాఖలకు సరైన వసతులు కల్పించలేదు. విద్య, వైద్య ఆరోగ్య, సంక్షేమ శాఖల కార్యాలయాల్లో మాత్రమే ప్యాన్‌లు ఏర్పాటు చేశారు. జౌళి పరిశ్రమలు, ట్రెజరీ శాఖల కార్యాలయాల్లో వసతులు కరువయ్యాయి. డ్వామా కార్యాలయంలో సిబ్బంది కూర్చోవ డానికి కనీసం కుర్చీలు, ఫ్యాన్‌లు కూడా లేవు. దీంతో ఉద్యోగులు అసంతృప్తికి లోనయ్యారు. వసతుల ఏర్పాటులో అధికారులు నిమగ్నమైనప్పటికీ సమయాభావంతో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో చేతులెత్తేశారు. పాలన ప్రారంభం రోజున జిల్లాకు కేటాయించిన ఉద్యోగులంతా ఏలూరు నుంచి రావాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ సోమవారం భీమవరం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు కేటాయించిన కార్యాలయాలను చూసి కొన్ని శాఖల ఉద్యోగులు బిక్కముఖం వేశారు. కార్యాలయాల్లో ఆశీనులై ఉక్కపోతతో అల్లాడిపోయారు. ప్రధానంగా రికార్డులు భద్రపరచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి. లేదంటే విధులు నిర్వహించలేమంటూ ఉద్యోగులు వాపోతున్నారు. అప్పటి వరకు ఏలూరు కలెక్టరేట్‌లో విధులు నిర్వహించాలా ? లేదంటే సొంత జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి విధులు చేపట్టాలా ? అన్న విషయమై మీమాంసలో ఉన్నారు. పూర్తిస్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటే ఇంకొన్ని రోజులు సమయం పడుతుంది. ప్రస్తుతం కలెక్టరేట్‌లో ఏర్పాటైన కార్యాలయంలో కంప్యూటర్లను అమర్చలేదు. ఈ విషయమై తక్షణం చర్యలు తీసుకోవాలి. 


స్థానికతపై ఆందోళన

భీమవరం జిల్లా కేంద్రానికి బదిలీపై వచ్చిన ఉద్యోగుల్లో స్థానికతపై ఆందోళన వ్యక్తమైంది. కొన్ని శాఖల కింది స్థాయి ఉద్యోగులకు బదిలీలు ఉండవు. అదే కార్యాలయంలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అటువంటి ఉద్యోగుల్లో అసహనం నెలకొంది. సొంత జిల్లాలకు వెళ్లడానికి ఆప్షన్‌లు పెట్టుకున్నారు. వాటిని పరిగణలోకి తీసుకోవాలన్న అభిప్రాయంతో అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.  మరోవైపు ఏలూరు స్థానికత ఉండే ఉద్యోగుల్లో ఆందోళన అంతా ఇంతా కాదు. ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేశారు. భీమవరం జిల్లా కేంద్రానికి వెళ్లి విధులు నిర్వహించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పలువురు ఉద్యోగులు ఈసురోమంటూ భీమవరం చేరుకున్నారు. ప్రభుత్వం స్థానికతపై ఒక్క అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమైంది. చివరకు కొత్త జిల్లా కేంద్రం కావడంతో తొలి రోజు ఉద్యోగులు సర్దుకునే ప్రయత్నం చేశారు. ప్రధానంగా కార్యాలయాల్లో వసతుల కల్పన వేగవతం చేయాల్సి ఉంది. అందుకు తగ్గ నిధులు సమకూర్చాలి.


Updated Date - 2022-04-05T06:45:01+05:30 IST