భరించలేకపోతున్నాం!

ABN , First Publish Date - 2022-03-05T05:36:34+05:30 IST

సమస్య ఉన్నా అధికారులు.. పాలకులకుపట్టదు.. పరిష్కారం అధికారుల చేతుల్లో ఉన్నా ఎవరికి వారు తమ కెందుకులే అనుకునేవారు.

భరించలేకపోతున్నాం!
ప్రతి రోజూ ఇంతే.. కన్నీళ్లు ఆగడంలేదంతే : డంపింగ్‌యార్డ్‌లో పొగ

డంపింగ్‌యార్డు నుంచి పొగతో ఇక్కట్లు
దుర్గంధం భరించలేక అగచాట్లు
రోగాల బారిన పడుతున్నామని ఆవేదన
చంద్రబాబునగర్‌ కాలనీవాసుల ఆందోళన


ఆకివీడు, మార్చి 4 :
సమస్య ఉన్నా అధికారులు.. పాలకులకుపట్టదు.. పరిష్కారం అధికారుల చేతుల్లో ఉన్నా ఎవరికి వారు తమ కెందుకులే అనుకునేవారు. అనారోగ్యాల బారిన పడుతున్నాం కాపా డండి బాబూ అంటూ వేడుకుంటున్నా కనీసం స్పందించడంలేదు.. ఇదీ ఆకివీడు చంద్రబాబు కాలనీవాసుల ఆవేదన.ఆకివీడు సీహెచ్‌సీ  అగ్నిమాపకశాఖ, తహసీల్దార్‌ కార్యాలయం, ఫిల్టర్‌బెడ్‌ పక్కన, సిద్ధాపురం వైపు వెళ్లే రోడ్‌లో అనధికార డంపింగ్‌యార్డులు ఉన్నాయి. పట్టణంలో రోజుకు వస్తున్న సుమారు 17 టన్నులు చెత్తను ఈ రెండుచోట్లకు కార్మికులు తరలిస్తున్నారు. చెత్త కారణంగా ఈగలు, దోమలు విజృంభిస్తు న్నాయి.తీవ్ర దుర్గంధం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఇక డంపింగ్‌యార్డులో చెత్తను తగలబెట్టడంతో పొగతో స్థానికులు, సమీపంలో ఉన్న అధికారులు రోగాలు బారిన పడుతున్నారు. ఇదిలా ఉండగా గత నెల 23వ తేదీన చంద్రబాబునగర్‌  కాలనీ వాసులు కౌన్సిలర్‌తో కలిసి ధర్నా చేయడంతో ఇక నుంచి చెత్తను వేయమని కమిషనర్‌ హామీ ఇచ్చారు. అయితే చెత్త వేయడం మానే శారు కానీ.. గతంలో వేసిన చెత్త నుంచి వచ్చిన పొగ మాత్రం ఇంకా ఆగలేదు.డంపింగ్‌ పొగతో ఆయాసం,ఉబ్బసం తదితర వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు. డంపింగ్‌యార్డును వేరొకచోటకు తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

ఆఫీస్‌లో పనిచేయలేకపోతున్నాం..
డంపింగ్‌యార్డు నుంచి వెలువడే పొగతో అనారోగ్యం  బారిన            పడుతున్నాం. కార్యాలయానికి వచ్చి విధులు చేయాలంటే కష్టంగా ఉంటుంది. పొగ కారణంగా నిత్యం కళ్లు నలుపుకుంటూ పని చేయాల్సిందే.

– రాజ్‌కిషోర్‌, డిప్యూటీ తహసీల్దార్‌, ఆకివీడు

వచ్చిన జీతం ఆసుపత్రులకే సరిపోతుంది..
డంపింగ్‌యార్డు పక్కనే రెవెన్యూ కార్యాలయం ఉంది. దుర్వాసన, ఈగలు, దోమలు, పొగతో ఇబ్బందిపడుతున్నాం.వచ్చిన జీతం   ఆసుపత్రులకే సరిపోతుంది. వెంటనే సమస్య పరిష్కరించాలి.           

      – దుర్గారావు, నాల్గవ తరగతి ఉద్యోగి, ఆకివీడు

పట్టించుకున్న పాలకులు లేరు..
ఊరు చివరిలో ఉండాల్సిన డంపింగ్‌యార్డు నివాసాలు..ఆఫీస్‌ల  మధ్య ఉంచడం తగదు. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధులు, వికలాంగులు రోగాలు బారిన పడుతున్నారు. సమస్యను పట్టించుకున్న పాలకులు లేరు.

– పెరవలి సత్యవతి, చంద్రబాబునగర్‌ కాలనీ

డంపింగ్‌యార్డును తొలగించాల్సిందే..
డంపింగ్‌ యార్డును తొలగించమంటే పొగ, వాసనలు రాకుండా గోడ నిర్మాణం చే స్తామని అధికారులు చెబుతున్నారు. గోడ నిర్మాణానికి తాము అంగీకరించం. ఇక్కడ నుంచి డంపింగ్‌యార్డును తొలగించాలి. 

–కురాకుల సుబ్బలక్ష్మి, చంద్రబాబునగర్‌ కాలనీ

Updated Date - 2022-03-05T05:36:34+05:30 IST