పీటీడీపై డీజిల్ భారం
ABN , First Publish Date - 2022-03-05T06:31:13+05:30 IST
నష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయి, కరోనా దెబ్బకు కుదేలైన ప్రజా రవాణా శాఖపై మరో పిడుగు పడింది. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సంస్థను డీజిల్ ధరలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.
ప్రైవేటు బంకులబాటలో ఆర్టీసీ బస్సులు
బల్క్ కొనుగోళ్లపై భారీగా వడ్డన
పాత ధర కంటే రూ.15 పెరుగుదల
బంకుల్లో కంటే రూ.4.16 ఎక్కువ ధర
నెలకు రూ.1.8 కోట్ల భారం
ఏలూరు, మార్చి 4(ఆంధ్రజ్యోతి):నష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయి, కరోనా దెబ్బకు కుదేలైన ప్రజా రవాణా శాఖపై మరో పిడుగు పడింది. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సంస్థను డీజిల్ ధరలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఆయిల్ సంస్థల నుంచి నేరుగా ఆర్టీసీ కొనుగోలు చేసే డీజిల్ ధర గడిచిన 60 రోజుల్లో రూ.15 పెరగడంతో ఆర్టీసీ కుదేలైంది. బల్క్ ఆయిల్ ధర కంటే రిటైల్ ఔట్లెట్లు, పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ ధర తక్కువగా ఉండడంతో బస్సులన్నీ ప్రైవేట్ పెట్రోల్ బంకుల బాట పట్టాయి. కొనుగోలు చేసిన డీజిల్ ధర పెరగడంతో ప్రతి నెలా ఆర్టీసీపై రూ.కోటీ 80 లక్షల భారం పెరిగింది. జిల్లాలో ఆర్టీసీ రోజుకు 575 బస్సులను నడుపుతోంది. ఇవి రోజుకు 2లక్షల 25 వేల కిలో మీటర్లు ప్రయాణిస్తూ సేవలు అందిస్తున్నాయి. వీటిలో 450 సొంత బస్సులు ఉండగా వాటికి రోజు కు 40 వేల లీటర్ల డీజిల్ అవసరం అవుతోంది. డీజిల్‌ను ఆయిల్ సంస్థల నుంచి బల్క్‌గా కొనుగోలు చేసేందుకు సంస్థ ఒప్పందం చేసుకుంది. పెట్రోల్ బంకులో రిటైల్‌గా అమ్మే ధరకంటే రూ.11 తక్కువగా డీజిల్ వచ్చేది. ఇప్పుడు లీటర్ డీజిల్ ధర రిటైల్ ఔట్లెట్ల కంటే రూ.4.16 ఎక్కువగా ఉండడం విశేషం. ఒక్కో లీటరుపై పాత ధర కంటే రూ.15 ధర పెరగడంతో ఒక్కో బస్సుపై రోజుకు రూ.1050 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కొవిడ్ కారణంగా ఆక్యుపెన్సీ పడిపోయి నష్టాల్లో కూరుకుపోయిన సంస్థపై ఇది భారంగా పరిణమించింది.
ధరల పెంపునకు కారణాలివే..
అంతర్జాతీయంగా ముడి చమురు ధర చుక్కలనంటుతోంది. ఒక బ్యారెల్ ముడి చమురు ధర వంద డాలర్లను మించిపోవడం 2014 తర్వాత ఇదే తొలిసారి. ఆయిల్ సంస్థలు ధరలు భారీగా పెంచాయి. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నేపథ్యం లో కేంద్రం పన్నుల్లో రాయితీ ఇచ్చి ఆయిల్ ధరలు పెరగకుండా తాత్కాలిక చర్యలు తీసుకుంది. ఫలితంగా రిటైల్ బంకుల్లో ఆయిల్ ధరలు రెండు నెలలుగా స్థిరంగా ఉన్నాయి. ఈ రాయితీలను బల్క్ కొనుగోలుదారులకు వర్తింప జేయకపోవడంతో డీజిల్ ధర భారీగా పెరిగింది. రిటైల్ బంకులో డీజిల్ ధర రూ.4.16 తక్కువగా ఉండడంతో బంకుల్లోనే పీటీడీ డీజిల్ కొనుగోలు చేస్తోంది. ఆయిల్ ధరల పేరుతో మరోమారు చార్జీల మోత మోగిస్తుందేమోనని ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
ధరల పెరుగుదల ఇలా.. (లీటరుకు రూ.)
తేదీ బంకులో పీటీడీ
జనవరి 1 96.2 85.94
జనవరి 9 96.82 87.94
జనవరి 17 96.82 91.26
ఫిబ్రవరి 3 96.82 96.82
ఇప్పటి వరకు 96.82 100.98