రాములోరి పెళ్లికి అపర భద్రాద్రి ముస్తాబు

ABN , First Publish Date - 2022-04-05T05:33:12+05:30 IST

అపర భద్రాద్రిగా పేరుగాంచిన చనుబండ కోదండ రామస్వామి ఆలయానికి భద్రాచలం ఆలయం నుంచి తలంబ్రాలు తీసుకువచ్చారు.

రాములోరి పెళ్లికి అపర భద్రాద్రి ముస్తాబు
చనుబండలో కోదండరాముడి ఆలయం

చాట్రాయి ఏప్రిల్‌ 4: అపర భద్రాద్రిగా పేరుగాంచిన చనుబండ కోదండ రామస్వామి ఆలయానికి భద్రాచలం ఆలయం నుంచి తలంబ్రాలు తీసుకువచ్చారు. 10న జరిగే సీతారామ కల్యాణానికి భద్రాచలం నుంచి తలంబ్రాలు తెచ్చి ఇక్కడ రాములోరి పెళ్లి జరపడం ఆనవాయితీ. తలంబ్రాలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, పూజారి మారుతి అందుకొని మూలవిరాట్‌ల వద్ద భద్రపరిచారు.


1713లో నిర్మితమైన ఆలయం

మూడు శతాబ్దాల చరిత్ర కలిగి అపర భద్రాద్రిగా పేరుగాంచిన చనుబండ కోదండరామస్వామి ఆలయంలో  సీతారామ కల్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి తెలిపారు. 8న ఉదయం స్వామివారిని పెండ్లి కుమారుని చేయడం, రాత్రి విశ్వక్సేన పూజ, 9న ఎదుర్కోలు ఉత్సవం (వధూవర అన్వేషణ) 10న ఉద యం 11.23 గంటలకు స్వామివారి కల్యాణం, అనంతరం గరుడోత్సవం, 11న మహా పట్టాభిషేకం, అన్నసమారాధన, రాత్రి రఽథోత్సవం, 12న మధ్యాహ్నం 3గంలకు వసంతోత్సవం, పూర్ణాహుతి, దోపోత్సవం, 13న ద్వాదశ ప్రదక్షిణలు, అనంతరం స్వామివారి పవళింపు సేవ జరుగుతుందని తెలిపారు. సాంసృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు.


ఆలయ చరిత్ర

చారిత్రక ఆధారాలను బట్టి.. ఆలయాన్ని రామ భక్తుడైన పుచ్చకాయల రామిరెడ్డి 1713లో నిర్మించారు. రామిరెడ్డి ఏటా భద్రాచలంలో సీతారామ కల్యాణానికి కాలి నడకన వెళ్ళి వచ్చేవారు. వృద్ధాప్యంతో ఎట్లా రాగలను అని స్వామిని ప్రార్థిస్తుండేవారట. ఒక రోజు వ్యాపార నిమిత్తం తెలంగాణ ప్రాంతంలో గాలివానలో చిక్కుకున్నారు. రాముని ధ్యానించగా అక్కడ విగ్రహాలు ఉన్నాయి తీసుకువెళ్లి ప్రతిష్ఠించి కల్యాణం జరిపించాలని స్వామి సెలవి చ్చినట్లు చెబుతారు. విగ్రహాలను రామిరెడ్డి స్వగ్రామం నరశింహరావుపాలెం తరలిస్తుండగా చనుబండ వద్ద ఆగిపో వాల్సి వస్తుంది. అక్కడే ఆలయం నిర్మించాలని స్వామి ఆదేశంతో చుట్టు పక్కల గ్రామాల భక్తుల సహకారంతో ఆలయం నిర్మించి కల్యాణం జరిపించడం ప్రారంభించారు.

Updated Date - 2022-04-05T05:33:12+05:30 IST