శరన్నవరాత్రులకు ఆలయాలు ముస్తాబు

ABN , First Publish Date - 2022-09-26T06:21:09+05:30 IST

ప్రసిద్ధ అమ్మవారి ఆలయాల్లో ఒకటైన కైకలూరు శ్రీశ్యామలాంబ ఆలయంలో శ్రీచండీ మహాయాగ సహిత, శ్రీదేవిశరన్నవ రాత్రి మహోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

శరన్నవరాత్రులకు ఆలయాలు ముస్తాబు
శ్రీశ్యామలాంబ అమ్మవారి ఆలయం

కైకలూరు, సెప్టెంబరు 25: ప్రసిద్ధ అమ్మవారి ఆలయాల్లో ఒకటైన కైకలూరు శ్రీశ్యామలాంబ ఆలయంలో శ్రీచండీ మహాయాగ సహిత, శ్రీదేవిశరన్నవ రాత్రి మహోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా  తీర్చిదిద్దారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వరకు దసరా ఉత్సవాలను నిర్వహించను న్నారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే ఆలయ ప్రాంగణంలో మూడు శివాలయాలు ఉండడం విశేషం.  భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీశ్యామ లాంబ అమ్మవారు వెలుగొందుతున్నారు.  ప్రతి పదిమందిలోనూ ఒకరికి శ్యామల, శ్యామలరావు అనేపేరు ఖచ్చితంగా ఉంటుందంటే అమ్మవారిపై ఉన్న భక్తికి నిదర్శనం. దసరామహోత్సవాలకు ఆలయంలో చలువపందిళ్ళు, విద్యు ద్దీపాలు, చాందీని వస్ర్తాల అలంకరణ, రంగవల్లులు హోమగుండాలు  ఏర్పా టు చేశారు. ఉత్సవాలను సోమవారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు దంపతులచే ప్రారంభించనున్నారు. నేడు అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవిగా దర్శనమివ్వనున్నారు. ఆలయ అర్చకులు చావలి వాలేశ్వరరావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  శ్రీశ్యామలాంబ అమ్మవారి ఆలయ చైర్మన్‌ గుర్రం రాంబాబు, శ్రీరామలింగే శ్వరస్వామి దేవ స్ధాన చైర్మన్‌ బూరుబోయిన మోహనరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఈవో వీఎన్‌కే శేఖర్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రి కళా మండపం వద్ద పేరొందిన కళాకారు లతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లను నిర్వహిస్తున్నామని, ఆలయాల ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో విజయ వంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్టు ఈవో వి.ఎన్‌.కె.శేఖర్‌ తెలిపారు. 

కలిదిండి: మండలంలోని శరన్నవరాత్రుల ఉత్సవాలకు కనకదుర్గ, పోలేరమ్మ, గోగులమ్మ ఆలయాలు సర్వం సిద్ధమయ్యాయి. సోమవారం నుంచి మొదలయ్యే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు సిద్ధమయ్యాయి. దానిలో భాగంగా గ్రామాల్లో, పట్టణంలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో భారీ మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేశారు. కలిదిండిలో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి విగ్రహాలను కొనుగోలు చేసి ట్రాక్టర్లపై ఊరేగిం పుగా తీసుకెళ్తున్నారు. కలిదిండి పట్టణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు భారీ పందిళ్లు వేశారు. సంతోషపురం, మూల్లంక, అప్పారావుపేట, సానారుద్రవరం, కోరుకొల్లు, పోతుమర్రు, మట్టగుంట, తాడినాడ, వెంకటాపురం గ్రామాల్లో అమ్మవారి ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించి పందిళ్లు వేశారు.  

ముదినేపల్లి రూరల్‌: సింగరాయిపాలెంలో అమృతేశ్వరస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, గురజ గ్రామంలోని గంగాపార్వతీ ఆలయం, పెదకామనపూడి, పెదపాలపర్రు, వణుదుర్రు గ్రామాల్లోని శివాలయాలు శర న్నవరాత్రులకు సిద్ధమవుతున్నాయి. దేవపూడి దుర్గమ్మ ఆలయాన్ని విద్యుత్‌ అలంకరణ చేశారు. అమ్మవారిని నవరాత్రుల 9 రోజులు పలు అలంకరణలతో పూజలు నిర్వహించనున్నారు. 

ముదినేపల్లి: ముదినేపల్లి భక్తాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, పెదగొన్నూరులో దేవదాయశాఖ ఆధ్వర్యంలో,  భ్రమరాంబ సమేత  మల్లేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తు న్నారు.  ఈ సందర్భంగా  పెయ్యేరు కనకదుర్గమ్మ ఆలయ అర్చకుడు మాట్లాడుతూ  శరన్నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి. దుర్గమ్మకు కుంకుమ పూజలు, అభిషేకాలు, మొక్కులు తీర్చుకోవటం  సత్ఫలితాలనిస్తాయన్నారు. 

ఆగిరిపల్లి: శరన్నవరాత్రి ఉత్సవాలకు చలువ పందిళ్లు ముస్తాబయ్యాయి.   పలు గ్రామాల్లో పందిళ్లను విద్యుద్దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆగిరిపల్లి వేదశాస్త్ర పాఠశాలలో  శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేశారు.Read more